Share News

అమరావతి 2.0.. జయహో..

ABN , Publish Date - May 03 , 2025 | 12:54 AM

కలల సౌధం కళ్ల ముందు వాలింది. ఆశల రాజధాని అంగరంగ వైభవంగా ఆవిష్కృతమైంది. అమరావతి 2.0కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర కదిలింది. దారులన్నీ వెలగపూడివైపే సాగాయి. రూ.49,040 కోట్లతో కూడిన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో రాజధాని అంతటా పండుగ వాతావరణం కనిపించింది. వికసిత అమరావతే లక్ష్యమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగగా, తెలుగులో ఆయన మాట్లాడిన తీరుకు సభికుల నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. అమరావతి చరిత్రను కీర్తిస్తూ, రైతుల త్యాగాలను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగం రాజధాని ఔన్నత్యాన్ని తెలియజేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వేదికలను అలంకరించగా, సభా ప్రాంగణంలో అమరావతి రైతులకు అగ్రస్థానం లభించింది. అంబరాన్నంటిన ఈ వేడుకకు వాతావరణం కూడా చల్లగా మారగా, జనాలు తండోపతండాలుగా తరలివచ్చి అమరావతికి జేజేలు పలికారు.

అమరావతి 2.0.. జయహో..
సభావేదికపై పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు చిరునవ్వులు

వేడుకలా రాజధాని పునః ప్రారంభోత్సవం

ప్రధాని మోదీ రాకతో పండుగ వాతావరణం

అమరావతి ఔన్నత్యాన్ని కీర్తించిన సీఎం చంద్రబాబు

కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నాగాయలంక మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ వర్చువల్‌ ప్రారంభం

దేశ రక్షణకు నవశక్తిని ఇస్తుందంటూ ప్రధాని వ్యాఖ్య

విజయవాడ-కాజిపేట మూడోలైన్‌ జాతికి అంకితం

దారులన్నీ రాజధానివైపే.. భారీగా తరలిన జనం

వందలాది వాహనాలతో పార్కింగ్‌ ప్రాంతాలు ఫుల్‌

కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణాలు, గ్యాలరీలు

విజయవాడ/గుంటూరు/తుళ్లూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : అమరావతి జనసంద్రంగా మారింది. వెలగపూడి వేదికగా రాజధానిలో రూ.49 వేల కోట్ల పనులకు, నిర్మాణాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఇతర మంత్రులు ప్రధాన వేదికపై ఆశీనులు కాగా, ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రాజధాని గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. సభ జరిగే వెలగపూడితో పాటు అన్ని గ్రామాల్లోనూ ఇదే వాతావరణం కనిపించింది. సభకు వెళ్లే మార్గాలన్నీ వాహనాలు, జనంతో నిండిపోయాయి. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాగాయలంకలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశరక్షణ వ్యవస్థలో కీలకపాత్ర పోషించనున్న మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను నవదుర్గగా అభివర్ణించారు. అమరావతి రాజధానికి అన్నివిధాలా సహకరిస్తానని ఆయన చెప్పటంతో సభికులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. అలాగే, విజయవాడ-కాజిపేట మూడోలైన్‌ మార్గాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అమరావతి కోసం భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు మురిసిపోయారు. ఐదేళ్లు అష్టకష్టాలు పడ్డామని, తిరిగి అమరావతికి ప్రాణం పోస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. సభలో అమరావతి రైతులకు అగ్రస్థానాన్ని అందజేశారు. ఏ ప్లస్‌ పాసులు ఇచ్చి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రవేశ ద్వారంలో అనుమతించారు.

అన్నిదారులూ అమరావతివైపే..

అమరావతిని చూడాలన్న ఆకాంక్షతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. దీంతో ఉదయం 10 గంటలకే రాజధానికి దారితీసే మార్గాల్లో జనసందోహం కనిపించింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వివిధ ప్రాంతాల ప్రజలు సాయంత్రం 6 గంటలకు సభ ముగిసిన సమయంలో కూడా ప్రాంగణానికి చేరుకుంటూనే ఉన్నారు.

మధ్యాహ్నానికే కిటకిట

వేలాదిగా ప్రజలు తరలిరావడంతో సభా ప్రాంగణం మఽధ్యాహ్నం 12 గంటలకే నిండిపోయింది. గ్యాలరీలన్నీ నిండిపోవడంతో ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకున్న వారు రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. పార్కింగ్‌ ప్రదేశాలతో పాటు ఈ-6, 7, 8 రోడ్ల వరకు, ఎన-9 రోడ్డు, సచివాలయం చుట్టుపక్కల రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణానికి చుట్టుపక్కల కిలోమీటరు మేర ఎటుచూసినా జనమే కనిపించారు.

వెల్లివెరిసిన జాతీయత

రాజకీయ పార్టీల జెండాలకు ఆస్కారం లేకుండా అమరావతి పునర్నిర్మాణ పండుగ జరిగింది. ప్రజలు మూడు రంగుల జెండాలను ప్రదర్శిస్తూ జాతీయతను చాటారు. సభ వెలుపల, సభా ప్రాంగణంలో ఎక్కడా ఏ పార్టీ జెండాల ప్రదర్శన లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేవలం మువ్వన్నెల జాతీయ జెండాను మాత్రమే అనుమతించారు. ప్రధాని సభావేదిక మీదకు రాగానే ప్రజలు వందేమాతరం.. అంటూ స్వాగతం పలికారు. అమరావతి రైతులు జయహో... అమరావతి అంటూ పచ్చ కండువాలు గాలిలో ఊపారు. అలాగే, ప్రధాని హెలిప్యాడ్‌ మొదలు సుమారు 1.3 కిలోమీటర్ల దూరం పొడవునా సభా ప్రాంగణం వరకు జాతీయ జెండాలతో అలంకరించారు.

బస్సెనక బస్సు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అన్నిదారులూ అమరావతివైపే సాగాయి. వందలాది బస్సులు అమరావతికి క్యూ కట్టాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి అంచనాలకు మించి బస్సుల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారులన్నీ కిటకిటలాడాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 400 ఆర్టీసీ బస్సులు, 2,500కు పైగా ప్రైవేట్‌ బస్సుల్లో అమరావతి వెళ్లారు. ఇవికాకుండా సొంతకార్లు, ఇతర వాహనాల్లోనూ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి కూడా తండోపతండాలుగా వాహనాలు తరలివచ్చాయి. ఈ వాహనాలన్నీ ఎన్టీఆర్‌ జిల్లా మీదుగానే వెళ్లాల్సి రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగింది. పోలీసుల ముందస్తు ప్రణాళికల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాలేదు. భారీ వాహనాలను నగరం వెలుపల నుంచి మళ్లించడంతో సమస్యలు తలెత్తలేదు. బస్సులు భారీగా తరలివస్తుండటంతో అధికారులు ఒకింత ఆందోళన చెందారు. మధ్యాహ్నం 2 గంటలకే అమరావతిలో సభా ప్రాంగణం పక్కనే ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్‌ ప్లేస్‌లు నిండిపోయాయి. వస్తున్న వాహనాలకు చోటు లేకపోవటంతో నగరం బయటే వాహనాలను నిలుపుదల చేశారు. చాలామంది నడుచుకుని అమరావతి వెళ్లారు. అశేషంగా వస్తున్న ప్రజలకు భోజన ఏర్పాట్లు కూడా సరిపోకపోవడంతో అదనంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఆటంకాలు లేకుండా అమరావతికి..

కీలకంగా మారిన పశ్చిమ బైపాస్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో బస్సులు కదిలొచ్చినా విజయవాడపై మాత్రం ఆ ప్రభావం పడలేదు. సాధారణ వాహనదారులు ముందుకు సాఫీగా సాగిపోయారు. దీనంతటికీ ప్రధాన కారణం పశ్చిమ బైపాస్‌ రోడ్డు మార్గమే. వెలగపూడిలో రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం భారీస్థాయిలో నిర్వహించినా నగరం మీదుగా ఎలాంటి బస్సులు రాకపోకలు సాగించకుండా ఈ రోడ్డు ప్రధానంగా నిలిచింది. బస్సులన్నీ నగరంలోకి ప్రవేశించకుండానే అమరావతి చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి బస్సులు భారీగా రాగా, గన్నవరం నుంచి నిర్మించిన పశ్చిమ బైపాస్‌ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఇందుకు కృష్ణా బ్రిడ్జి కూడా కీలకంగా ఉపయోగపడింది. ఫలితంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన బస్సులు నేరుగా ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వెలగపూడి చేరుకున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి బయల్దేరిన వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాయి. కృషాజిల్లా నుంచి కొన్ని బస్సులు మాత్రం వారధి మీదుగా వెళ్లాయి.

Updated Date - May 03 , 2025 | 12:54 AM