Share News

డ్రెయిన్ల ప్రక్షాళన

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:02 AM

నగరంలో డ్రెయిన్ల ప్రక్షాళన ప్రారంభమైంది. ఆక్రమణలకు గురైన డ్రెయిన్లను యుద్ధప్రాతిపదికన తొలగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ కార్పొరేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణల్లో ఇళ్లు పోయే వారికి ప్రత్యామ్నాయంగా టిడ్కో ఇళ్లు కల్పించాలని నిర్ణయించారు.

డ్రెయిన్ల ప్రక్షాళన
పకీరుగూడెంలో డ్రెయిన్‌ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

నగరంలో డ్రెయిన్లపై ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం

మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

ఆక్రమణ తొలగింపులో ఇళ్లు కోల్పోతే.. టిడ్కో ఇళ్లు ఇవ్వాలని ఆదేశం

వచ్చే వర్షాకాలం నాటికి ఇబ్బంది లేకుండా చర్యలు

కార్పొరేషన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : నగరంలో డ్రెయిన్ల ప్రక్షాళన ప్రారంభమైంది. ఆక్రమణలకు గురైన డ్రెయిన్లను యుద్ధప్రాతిపదికన తొలగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ కార్పొరేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణల్లో ఇళ్లు పోయే వారికి ప్రత్యామ్నాయంగా టిడ్కో ఇళ్లు కల్పించాలని నిర్ణయించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మంత్రి నారాయణ అధికారులతో కలిసి పర్యటించారు. గుణదల పుల్లేటికట్ట, దర్శిపేట, పకీరుగూడెంలో అవుట్‌ఫాల్‌ డ్రెయిన్లు, బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ దిగువన వర్షపునీరు నిల్వ ఉండే ప్రాంతాలతో పాటు ఆటోనగర్‌లోని వీఎంసీ శాటిలైట్‌ స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. కొన్నిచోట్ల డ్రెయిన్లు వెడల్పుగా ఉండగా, మరికొన్ని చోట్ల ఇరుగ్గా ఉండటంపై అధికారులను వివరణ అడిగారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్రహరీలను డ్రెయిన్లను ఆక్రమించి కట్టడాన్ని గుర్తించారు. ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలు తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో వర్షపు నీరు బయటకు వెళ్లేలా డ్రెయినేజీల నిర్మాణానికి 2014-19 మధ్యకాలంలో రూ.500 కోట్లతో పనులు ప్రారంభించి, 55 శాతం పూర్తి చేశామన్నారు. అయితే, గత ప్రభుత్వం పనులను నిలిపేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విజయవాడ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నగరంలో అవుట్‌ఫాల్‌ డ్రెయిన్ల నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చాలాచోట్ల డ్రెయిన్లు ఆక్రమణకు గురయ్యాయని, 10 అడుగులు ఉండాల్సిన చోట 2 అడుగులే ఉన్నాయన్నారు. ఇలాగైతే నీరు బయటకు ఎలా వెళ్తుందని అధికారులను ప్రశ్నించారు. ఆక్రమణలను మార్కింగ్‌ చేసి డ్రెయిన్లు వెడల్పు చేయాలన్నారు. సెప్టెంబరు నుంచి పనులు ప్రారంభించి, ఆరు నెలల్లో పూర్తిచేసి వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

బుడమేరు ఆక్రమణలపై త్వరలో నిర్ణయం

బుడమేరు ఆక్రమణలపై ఇరిగేషన్‌ శాఖ సాంకేతిక కమిటీని నియమించిందని, ఆ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందన్నారు. బుడమేరును వెడల్పు చేయడమా లేక గట్లు ఎత్తు పెంచడమా అనే అంశాన్ని టెక్నికల్‌ కమిటీ పరిశీలిస్తుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర ఇరిగేషన్‌అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ పర్యటనలో ప్రజారోగ్య విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభాకర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, చీఫ్‌ సిటీప్లానర్‌ సంజయ్‌ రత్నకుమార్‌, ఇతర ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 01:02 AM