రెడ్ అలర్ట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:29 AM
మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో, అతి భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డేంజర్ అలారం మోగించారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. కూరగాయలు, మందుల షాపులు మినహా అన్ని దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రకటించడంతో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉమ్మడి కృష్ణాజిల్లా యంత్రాంగం అప్రమత్తం
నేడు తీరం దాటనున్న మొంథా తుఫాను ..అంతటా టెన్షన్
కృష్ణాలోని తీరప్రాంతాలు సహా విజయవాడపై ప్రభావం
నగరంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం
గంటకు 35-40 కిలోమీటర్ల వేగంతో గాలులు
డేంజర్ అలారం మోగించిన మున్సిపల్ కార్పొరేషన్
కూరగాయలు, మెడికల్ వ్యాపారాలకే అనుమతి
తీర ప్రాంతాల్లో గస్తీ.. ప్రభుత్వ సిబ్బందికి సెలవులు రద్దు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాను మొంథా తుఫాను గండం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా మారుతుందోనని సర్వత్రా భయాందోళనలు వెంటాడుతున్నాయి. మచిలీపట్నం కేంద్రంగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తర్వాత ఇది కాకినాడ సమీపానికి మారడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణాజిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను కారణంగా సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. జిల్లా మొత్తం చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత వర్షం విరామం ఇచ్చింది. ఈ ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడపైన, కృష్ణాజిల్లాలో సముద్రతీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు.
నగరంలో డేంజర్ అలారం
తుఫాను కారణంగా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఫోర్‌కాస్ట్ విడుదల చేసింది. 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తయ్యారు. ముందే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బయటకు రావొద్దని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ మూడు రోజులు సెలవు ప్రకటించారు. గత ఏడాది బుడమేరు బీభత్సాన్ని చూసిన అధికారులు ఈసారి దానికి తగ్గట్టుగానే ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలో మంగళవారం అన్ని వాణిజ్య సముదాయాలను మూసివేయాలని వీఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కూరగాయలు, మందుల షాపులు మాత్రమే తెరుచుకోవాలని స్పష్టం చేశారు. ఈ వర్షపాతం ఎంత సమయంలో కురుస్తుందన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు. 24 గంటల పాటు నమోదైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అంతకు తక్కువ సమయంలో కురిస్తే అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయని అనుమానిస్తున్నారు. నీటమునిగే ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
గాలుల వేగం 35-40 కిలోమీటర్లు
ఉమ్మడి జిల్లాలో సోమవారం వరకు వాతావరణం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ మంగళవారం సాయంత్రం నుంచి మొత్తంగా మార్పులు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మొంథా తుఫాన్ కాకినాడకు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీరం దాటేటప్పుడే అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి. జిల్లా మొత్తం సాధారణం నుంచి అతిసాధారణ వర్షపాతం నమోదవుతుంది. సుమారు 35-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.
ఇలాగైతే నష్టమే..
తుఫాను అంటేనే చెట్లు కూలిపోవడం, విద్యుత స్తంభాలు వాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఉండబోదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే విద్యుత స్తంభాలు నేలకు వాలిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అదే 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే చిన్నచిన్న చెట్లతో పాటు భారీ వృక్షాలు పడిపోతాయని వివరిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉన్నప్పటికీ అంత తీవ్రత ఉండదని స్పష్టం చేశారు.
రోజంతా ముసురు
విజయవాడ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాను ప్రభావం సోమవారం జిల్లా అంతటా విస్తరించింది. తెల్లవారుజాము నుంచే ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమైన చిరుజల్లులు మధ్యాహ్నం 12 గంటలకు మోస్తరు వానగా మారాయి. జిల్లావ్యాప్తంగా 48.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. అత్యధికంగా విజయవాడ రూరల్‌లో 6.2, విజయవాడ పశ్చిమలో 6.1, సెంట్రల్‌లో 5.9, తూర్పులో 5.4, ఉత్తరంలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జగ్గయ్యపేట, వీరులపాడు, తిరువూరు, కంచికచర్ల మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. వత్సవాయి, మైలవరం మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. సగటు 2.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.