Share News

వర్షాందోళన

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:49 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దివి రైతులు ఆందోళన చెందుతున్నారు.

వర్షాందోళన
కాసానగర్‌ వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని పోగు చేసుకుంటున్న రైతులు

కోతలు పూర్తయ్యి కళ్లాల్లో ఉన్న ధాన్యం

మిల్లులకు తరలించేందుకు హడావిడి

మొంథా నష్టం మానకముందే మరో గండం

దివిసీమలో పరిస్థితి మరింత దైన్యం

అవనిగడ్డ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దివి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం మొంథా తుఫాన్‌ కారణంగా పాలుపోసుకునే దశలో, గింజ గట్టిపడే దశలో ఉన్న వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లగా, దాని నుంచి కోలుకుని కోతలు మొదలుపెట్టిన రైతన్నలు ప్రస్తుతం భయపడిపోతున్నారు. ఇప్పటికే చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో వరి కోతలు మొదలు కాగా, మిషన్‌ కోతలు కోసిన వారు ధాన్యాన్ని ఆరబెట్టుకుని మిల్లులకు తరలించేందుకు హడావిడి పడుతున్నారు. ఇప్పటి వరకు 3,800 మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా, అంతకు మూడింతలు కోతలు పూర్తయ్యి, కళ్లాల్లో ఉన్నాయి. మొంథా తుఫాన్‌ కారణంగా ఇప్పటికే పలుచోట్ల తాలు కంకులు దర్శనమిస్తుండగా, మరికొన్నిచోట్ల మానుగాయి తెగులు వ్యాపించి ధాన్యం నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈ తరుణంలో మళ్లీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో రైతులు మిషన్‌ కోత ద్వారా కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని పూర్తిగా ఆరుదల కాకముందే మిల్లులకు తోలేందుకు పోటీ పడుతున్నారు. తేమశాతం ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు ధర తక్కువకు ఆడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

రైతులు నష్టపోకుండా చర్యలు : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ భరోసా ఇచ్చారు. ధాన్యం విక్రయాల కోసం ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్‌ 7337359375 ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో రైతుల కోసం 540 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, ఇప్పటికే కోతలు కోసిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి టార్పాలిన్లను వినియోగించుకోవాలన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 3,798 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.8.15 కోట్లు చెల్లించామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం గింజను కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రైతుల సౌకర్యం కోసం నియోజకవర్గంలోని ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ ధాన్యం పరిమాణానికి అనుగుణంగా 5 వేల నుంచి 7 వేల గోనె సంచులు అందుబాటులో ఉంచామని, నియోజకవర్గంలో జీపీఎస్‌ చేసిన 274 ట్రాక్టర్లు అందుబాటులో ఉంచామని, చల్లపల్లి మండలంలో 120, ఘంటసాలలో 122, మోపిదేవిలో 20, కోడూరులో 10 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామని, రైతులకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పలుచోట్ల మిషన్‌ కోత కోస్తున్న రైతులు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో ఆరబెట్టుకున్నారని, వర్షాల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:49 AM