Share News

ధాన్యం.. దైన్యం

ABN , Publish Date - May 16 , 2025 | 01:04 AM

రబీలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత రైతుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో మిగులు ధాన్యం ఉన్న అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు మిల్లర్లు, దళారులు దోపిడీకి దిగుతుండగా, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనకపోతే చేసేదేమిటి దేవుడా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఓవైపు వాతావరణ పరిస్థితులు రోజుకొక రకంగా ఉండటం, మరోవైపు కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ఉప్పుడు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని పెంచాలని కోరుకుంటున్నారు.

ధాన్యం.. దైన్యం
నందిగామలో కల్లాలో ఆరబోసి ఉన్న ధాన్యాన్ని చూసి ఆవేదన చెందుతున్న రైతు

జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లు నిలిపివేత.. ఆవేదనలో అన్నదాతలు

మొత్తం 1.60 లక్షల టన్నుల దిగుబడి

ఇప్పటివరకు కొన్నది సగమే..

ఇంకా రైతుల వద్ద సగానికిపైగా ధాన్యం

కొనుగోళ్ల నిలిపివేతతో అగమ్యగోచరం

భయాందోళన కలిగిస్తున్న వాతావరణం

లక్ష్యాన్ని పెంచాలని రైతుల వేడుకోలు

దళారుల దోపిడీ.. తక్కువకే కొనుగోళ్లు

నందిగామ/ఇబ్రహీంపట్నం/విస్సన్నపేట/తిరువూరు/రెడ్డిగూడెం/ గంపలగూడెం/గొల్లపూడి/ ఎ.కొండూరు, మే 15 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది రబీలో జిల్లాలో మొత్తం 1.60 లక్షల టన్నుల ధాన్యం పండింది. తొలుత కొనుగోళ్లు ప్రారంభించిన ప్రభుత్వం కేవలం 10 వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లకే అవకాశం కల్పించింది. ఇంత తక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేపట్టలేమని మిల్లర్లు బీష్మించడంతో ప్రభుత్వం 50 వేల టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. గత ఏడాది ధాన్యం రవాణా చేసిన వాహనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌ రబీ ధాన్యం రవాణా చేయడానికి నిరాకరించారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారులు.. ఆర్‌టీఏ అధికారుల సాయంతో దొరికిన ప్రతి లారీని పట్టుకుని డీజిల్‌ కొట్టించి ధాన్యం రవాణా చేయించారు. సకాలంలో సరిపడా లారీలు దొరక్క అటు అధికారులు, ఇటు రైతులు ఇబ్బందులు పడ్డారు. నిర్దేశించిన 50 వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు మరికొంత అనుమతి సాధించి రెండు దఫాలుగా 10 వేల చొప్పున ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. అంతిమంగా 70 వేల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో ఇళ్లలో, కల్లాల్లో ధాన్యం నిల్వలు ఉన్న అన్నదాతల్లో కల్లోలం మొదలైంది.

మరో 80 వేల టన్నులకు అనుమతినివ్వాలి

జిల్లాలో 1.60 లక్షల టన్నుల ధాన్యం పండగా, ప్రభుత్వం 70 వేల టన్నులు కొనుగోలు చేసింది. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి సుమారు 10 వేల టన్నుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారు. ఇంకా రైతుల వద్ద మరో 80 వేల టన్నులు ధాన్యం ఉంది. ఈ మొత్తం కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకు రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వీటిలో 1010 రకం, పీఆర్‌ 126 రకం ఉప్పుడు ధాన్యం 50 వేల టన్నుల వరకూ ఉంది. ప్రభుత్వం దన్నుగా నిలవకపోతే ఈ రకం ధాన్యాన్ని దళారులు అతి తక్కువ ధరకు కొనే అవకాశాలు ఉన్నాయి.

మిగులు ఇలా..

  • విస్నన్నపేట మండలంలో ఇంకా 400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందని అధికారులు తెలిపారు. పుట్రేలలో 200 మెట్రిక్‌ టన్నులు, కలగలరలో 150 మెట్రిక్‌ టన్నులు, వేమిరెడ్డిపల్లిలో 50 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది. లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • గంపలగూడెంలో మండలం నెమలిలో 30 లారీలు, చినకొమెరలో 10 లారీలు ధాన్యం కొనాల్సి ఉంది. అనుమతులు ఇంకా రాలేదు. ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుంటున్నారు.

  • గొల్లపూడిలో ఒక లారీ ధాన్యం బస్తాలు కొనాల్సి ఉంది. అనుమతులు లేక కొండపల్లి శాంతినగర్‌ మిల్లు వద్ద నిలిచిపోయింది.

  • ఎ.కొండూరు మండలంలో 3,500 మెట్రిక్‌ టన్నులు కొనాల్సి ఉంది.

  • తిరువూరు మండలంలోని వావిలాల, ముష్టికుంట్ల, చింతలపాడు గ్రామాల్లో 50 లారీలకు పైగా ధాన్యం కొనాల్సి ఉంది. లారీలు రాకపోవడంతో ముష్టికుంట్ల రైతులు ట్రాక్టర్లపై మిల్లులకు ధాన్యం తరలించేందుకు సిద్ధమయ్యారు.

  • రెడ్డిగూడెం మండలం రంగాపురం, రెడ్డిగూడెం గ్రామాల్లో ఐదు లారీల ధాన్యం కాటా వేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని, టార్గెట్‌ అయిపోయిందని చెబుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ధాన్యం కొనుగోళ్ల వివరాలు

కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశాలతో ఏప్రిల్‌ 2 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. క్వింటా గ్రేడ్‌-ఏకు రూ.2,320, కమాన్‌ (ఉప్పుడు బియ్యం) రకానికి రూ.2,300 నిర్ణయించారు. 107 ఆర్‌ఎస్‌కేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. విజయవాడ డివిజన్‌కు 7.47 లక్షలు, తిరువూరు డివిజన్‌కు 8.62 లక్ష లు, నందిగామ డివిజన్‌కు 3.55 లక్షల గన్నీబ్యాగ్‌లు అందజేశారు. జిల్లాలో మొత్తం 19.65 లక్షల బ్యాగ్‌ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. పీఏసీఎస్‌లు, డీసీఎస్‌ఎంల ఆధ్వర్యంలో మొత్తం 107 ఆర్‌ఎస్‌కేలు ధాన్యం సేకరణ చేపట్టాయి. ఇప్పటి వరకు 69,858 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. ఈ మొత్తం ధాన్యానికి రైతులకు 24 గంటల వ్యవధిలో సొమ్ము చెల్లించాలి. జిల్లాలో మొత్తం 5,956 మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సింది రూ.154.91 కోట్లు కాగా, రూ.127.08 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. అనేక ఆటుపోట్ల నడుమ ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను సంతృప్తి పరిచినా.. మిగిలిన ధాన్యం ఏమిటన్నదే ప్రశ్నగా మారింది.

Updated Date - May 16 , 2025 | 01:04 AM