బుడమేరు ప్రక్షాళన ప్రారంభం
ABN , Publish Date - May 17 , 2025 | 01:37 AM
బుడమేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రూ.28 కోట్లు కేటాయించి గండ్లు పడిన చోట అర కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రారంభించారు.
భారీ గండ్ల ప్రాంతంలో బీడీసీకి రక్షణ గోడ
పనులు ప్రారంభించిన మంత్రి నిమ్మల
జూన్ 10 నాటికి పూర్తిచేసే అవకాశం
వెలగలేరు నుంచి సమాంతరంగా మరో కాల్వ
ఇబ్రహీంపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి) : బుడమేరు వరద నుంచి శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రూ.28 కోట్లు కేటాయించి గండ్లు పడిన చోట అర కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. మూడు విడతలుగా జరుగుతున్న ఈ పనులను జూన్ 10 నాటికి పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
52,500 క్యూసెక్యుల వరద మళ్లింపే లక్ష్యం
వరదల సమయంలో బుడమేరు వరద మళ్లింపు కాల్వ (బీడీసీ)కు తరచూ ఒకే ప్రాంతంలో గండ్లు పడుతున్నాయి. దీనివల్ల అటు రైతులు, ఇటు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. విజయవాడ పల్లపు ప్రాంతాలు ముంపు బారిన పడటం వంటి వాటి నుంచి కాపాడాలంటే గండ్లు పడిన ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించడం ఒక్కటే శాశ్వత పరిష్కారంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా పనులు ప్రారంభించింది.
కాల్వకు సమాంతరంగా మరో కాల్వ
వర్షాకాలంలో అతిభారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు ఎంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినా కట్టలకు, రెగ్యులేటర్‌కు ఇబ్బంది లేకుండా మళ్లించేందుకు అవసరమైన ప్రణాళికను జలవనరుల శాఖ సిద్ధం చేసింది. రెగ్యులేటర్ దిగువ భాగంలో నుంచి ఎనికేపాడు యూటీ వరకు ఉన్న పాత కాల్వకు సమాంతరంగా మరో కాల్వ తవ్వాలనే ప్రణాళికలు తయారుచేసింది. పాత కాల్వ, దాని సమాంతర కాల్వ ద్వారా మొత్తం 25 వేల క్యూసెక్కులు నేరుగా కొల్లేరులో కలిపేందుకు చర్యలు తీసుకోనున్నారు. అందుకు అవసరమైన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. రెగ్యులేటర్ వద్దకు వచ్చే వరదను బీడీసీ ద్వారా 37,500 క్యూసెక్కులు మళ్లించేలా కట్టలను బలోపేతం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే మూడు గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఇలా వచ్చే వరదను సాధ్యమైనంత వరకు బీడీసీ ద్వారానే కృష్ణానదిలో కలిపి, కాల్వ సామర్థ్యం మించి వచ్చే వరదను రెగ్యులేటర్ దిగువ భాగంలోని కాల్వల ద్వారా కొల్లేటిలో కలిపేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. ఇందుకు కేంద్ర సాయం కూడా కోరనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ముందు రిటైనింగ్ వాల్ పూర్తయితే సాధ్యమైనంత వరకు బుడమేరు వరద నుంచి విజయవాడ పల్లపు ప్రాంతాలను కాపాడినట్టేనన్న అభిప్రాయంలో అటు అధికారులు, ఇటు ప్రభుత్వం ఉంది. అయితే, వర్షాలు ప్రారంభం కాకముందే రిటైనింగ్ వాల్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.