మన బస్సుల్లో భద్రత ఎంత?
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:46 AM
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాదం అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లాలో బస్సుల భద్రతపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు ఇక్కడి ప్రైవేట్ బస్సులు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? అంటే నూటికి 95 శాతం కాదనే సమాధానం వస్తుంది. ఇక్కడి బస్సులకు కూడా వేరే రాషా్ట్రల్లో రిజిసే్ట్రషన్లు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని తెలుస్తోంది. ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా, వాహనాలు ఎలా ఉంటాయో కూడా చూడకుండా, రోడ్డు ట్యాక్స్‌కు కక్కుర్తి పడి ప్రైవేట్ యాజమాన్యాలు తమ బస్సులకు వేరే రాష్ట్రంలో రిజిసే్ట్రషన్ చేయిస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు.
ప్రమాదకరంగా ఉమ్మడి కృష్ణాలోని ప్రైవేట్ బస్సులు
దాదాపు వెయ్యికిపైగా బస్సులు.. చాలావరకు స్లీపర్స్
బస్సులు ఇక్కడివి.. రిజిసే్ట్రషన్ మాత్రం కోహిమాలో..
ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండానే అక్కడ రిజిస్ర్టేషన్
వాట్సాప్‌లో కాగితాలు పెడితే చాలు.. గంటల్లోనే పూర్తి
కనీసం బస్సును కూడా చూడకుండానే హడావిడి
ఫైర్‌సేఫ్టీ నిబంధనలు కూడా తూచ్..
డబ్బుకు కక్కుర్తిపడుతున్న ప్రైవేట్ యాజమాన్యాలు
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్రంలోనే ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రైవేట్ బస్సులు అత్యధికంగా ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా మూడు వంతుల మేర పొరుగు రాష్ర్టాలకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడీ బస్సులకు ఏ రాష్ట్రంలో రిజిస్ర్టేషన్లు జరిగాయి? ఏ విధానంలో జరిగాయి? ప్రమాణాలకు అనుగుణంగానే జరిగాయా? వంటి అంశాలపై రవాణాశాఖ అధికారులు నిగ్గు తేల్చకపోతే భవిష్యత్తులో ప్రమాదకర ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వెయ్యికి పైగా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. వీటిలో స్లీపర్ బస్సులే ఎక్కువ. వందకు పైగా ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఉన్నారు. 95 శాతానికిపైగా బస్సులు స్థానికంగా రిజిసే్ట్రషన్ లేనివే. నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఇక్కడి బస్సుల రిజిసే్ట్రషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ రిజిసే్ట్రషన్ చేయడం సులభం. కేవలం వాట్సాప్‌లో కాగితాలు పంపిస్తే గంటల వ్యవధిలోనే బస్సు రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కొత్త బస్సు అయితే బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకోకపోయినా రిజిస్ర్టేషన్ చేసేస్తున్నారు.
ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండానే..
భారత స్టేజ్ (బీఎస్)-6 వంటి అధునాతన సెన్సార్ ఆధారిత బస్సుల విషయంలో భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దీనికోసం మన దగ్గర ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగినపుడు బస్సు బాడీబిల్డింగ్ నిర్మాణం వాటిని నియంత్రించేదిగా ఉండాలి. అగ్ని నిరోధక వ్యవస్థలను కలిగి ఉండాలి. తగిన అగ్ని నిరోధక భద్రతను కలిగి ఉందని ధ్రువీకరించడానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ దోహదపడుతుంది. మన దగ్గర ఈ సర్టిఫికెట్ చూపిస్తేనే రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. ఈ సర్టిఫికెట్ పొందటానికి రూ.2 లక్షల మేర ఖర్చు అవుతుంది. కోహిమాలో అయితే ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్ర్టేషన్ చేస్తారు. దీనివల్ల ప్రైవేట్ బస్సు యజమానికి రూ.2 లక్షలు కలిసొస్తుంది.
రోడ్డు ట్యాక్స్ తగ్గించుకునేందుకు..
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 95 శాతానికి పైగా ప్రైవేట్ బస్సులు కోహిమాలోనే రిజిస్ర్టేషన్లు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.50 వేలు మాత్రమే రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. మన దగ్గర అయితే, స్లీపర్ బస్సు అయితే 36 బెర్తులకు (ఒక్కో బెర్తుకు రూ.3,500 చొప్పున) ఒక త్రైమాసికానికి రూ.1,26,000 రోడ్డు ట్యాక్స్‌గా చె ల్లించాలి. ఏడాదికైతే రూ.5,04,000 చెల్లించాలి.
ఆందోళన కలిగిస్తున్న బీఎస్-6 బస్సులు
బీఎస్-6 బస్సులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ బస్సులు టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పటికీ సాంకేతికంగా తలెత్తే సమస్యలను తెలుసుకునే పరిస్థితి లేదు. కంపెనీ ప్రతినిధి వచ్చి ల్యాప్‌ట్యాప్‌ను కనెక్ట్ చేసి చూస్తే తప్ప సమస్య గుర్తించలేం. దీనికి వైరింగ్ కూడా ఎక్కువ. దాదాపు 200 రకాల వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం ఎక్కువ. అలాగే, పొగ రాకుండా ఉండటానికి డీజిల్‌లో బ్లూ ఆయిల్ కలుపుతారు. ఈ ఆయిల్‌కు మండే స్వభావం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. బస్సులో అద్దాలు ఫిక్స్‌డ్‌గా బిగించి ఉండటం, స్లీపర్ బెర్తుల వల్ల బస్సు ఇరుకుగా మారి కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.