ఆర్‌డబ్ల్యూఎస్‌లో వేధింపులు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:33 AM
మచిలీపట్నంలోని గ్రామీణ నీటిపారుదల శాఖ విభాగంలో పరిపాలన గాడి తప్పుతోందా.. ఉద్యోగులు, అధికారుల మధ్య విభేదాలు పొడచూపి ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోందా.. అధికారుల వేధింపులు అధికం కావడంతో ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా.. ఈ కార్యాలయంలో పనిచేయలేనంటూ ఇటీవల ఓ మహి ళా ఏఈ రాసిన లేఖ పై ప్రశ్నలన్నింటినీ నిజమేనని చెబుతోంది.
మచిలీపట్నం ఈఈ కార్యాలయంలో ఉద్యోగులపై ఒత్తిడి
ఇక్కడ పనిచేయలేనంటూ ఓ మహిళా ఏఈ లేఖ
సెలవులు మంజూరు చేయకుండా నోటీసులు జారీ
జీతం కూడా ఇవ్వకుండా వేధింపులు
సాయంత్రం 6 వరకు పనిచేయాలంటూ హుకుం
సీనియర్ అసిస్టెంట్‌తో కలిసి ఈఈ ఇబ్బందులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పరిపాలనా సౌలభ్యం నిమిత్తం గతంలో గుడివాడలో ఉండే గ్రామీణ నీటిపారుదల శాఖ విభాగం (ఆర్ డబ్ల్యూఎస్) ఈఈ కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి మార్చారు. గత ఏడాది అక్టోబరులో ఇక్కడ బదిలీలు జరిగాయి. కాగా, వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు పనిచేయాల్సిన ఈ విభాగంలోని ఉన్నతాధికారులు.. ఆ పని చేయకుండా అధికారులను, సిబ్బందిని ఏదో ఒక కారణం చూపి ఇబ్బందులపాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈఈ కార్యాలయంలో సర్దుబాటు కోటాలో వచ్చిన ఓ సీనియర్ అసిస్టెంట్ అధికారితో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కలిసి వేధింపులకు గురిచేసేందుకు వ్యూహం రచిస్తుండటంతో ఉద్యోగులు హడలిపోతున్నారు.
నోటీసులపై నోటీసులు
ఈఈ కార్యాలయంలో పనిచేసే అసిస్టెంట్ మహిళా టెక్నికల్ ఉద్యోగి వ్యక్తిగత కారణాలతో రెండు రోజుల సెలవు తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన అధికారి ఆమె రెండు రోజుల వేతనాన్ని ట్రెజరీలో జమ చేయాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో తరచూ తనకు మెమోలు జారీచేస్తుండటంతో సదరు ఉద్యోగి నెల పాటు సెలవు పెట్టారు. ఈ సెలవును అంగీకరించకుండా మళ్లీ నోటీసు జారీచేయడం గమనార్హం. మరో ఉద్యోగి తన తండ్రి చనిపోయిన కొద్దిరోజుల తరువాత ఒకరోజు సెలవు పెట్టారు. ఆ సెలవును మంజూరు చేయకపోవడంతో సదరు ఉద్యోగికి నెల జీతాన్ని నిలిపివేయడంతో పాటు నోటీసును జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఈ అంశపై చర్చ నడుస్తోంది. కార్యాలయంలో పనిచేసే మిగిలిన సిబ్బందినీ వివిధ కారణాలతో ఇబ్బందులపాలు చేస్తుండటంతో ఎవరికి వారు ఇక్కడ విధులకు హాజరుకావాలంటేనే భయపడిపోతున్నారు.
తప్పుడు నివేదికలు
మండలస్థాయిలో నీటిసంప్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు జియోట్యాగ్ చేసే పనికి సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. కానీ, వాస్తవ పరిస్థితులకు, ఈ నివేదికకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వీటిని సరిచేసి పంపే బాధ్యతను ఒక మహిళా ఏఈకి అప్పగించారు. ఇలా ఉన్న నివేదికలపై ఈఎన్‌సీ కార్యాలయంలో నిలదీస్తున్నారు. ఏదో ఒకటి సరిచేసి పెట్టాలని ఈఈ స్థాయి అధికారి చెబుతుండటంతో పాటు రిపోర్టులు సక్రమంగా చెప్పకపోవడం, పంపకపోవడం ఏమిటనే అంశంపై కొందరు ఉద్యోగులకు ఎంచుకుని మరీ వేధింపులకు గురిచే స్తుండటంతో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఉద్యోగులు, అధికారుల మధ్య వివాదాలు ముదిరిపోతున్నాయి. దీంతో మహిళా ఏఈ ఒకరు తాను వేధింపులకు గురువుతున్న తీరు, కార్యాలయంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఆరు పేజీల లేఖను రాశారు. తాను ఈఈ కార్యాలయంలో పనిచేయలేనని, దీర్ఘకాలిక సెలవు పెడతానని, మంజూరు చేయాలని కోరారు. ఈ లేఖ బయటకు పొక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇష్టానుసారంగా సీట్ల కేటాయింపు
బదిలీపై వచ్చిన ఏఈలు, ఇతర ఉద్యోగులకు కార్యాలయంలో ఇష్టానుసారంగా సీట్లు కేటాయించారు. అదేమని అడిగితే కొంతకాలం పోయాక సర్దుబాటు చేస్తామని, ప్రస్తుతం మీకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఓ అధికారిని ప్రసన్నం చేసుకున్నవారికి కోరుకున్న పనులను అప్పగించి, ఇష్టంలేని వారికి చిత్తానుసారంగా సీట్లు కేటాయించారు. కల్పన అనే ఏఈకి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించలేదు. గతంలో పనిచేసిన ఈఈ సూచించిన విధంగా సీటు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు. అలా చేయకుండా త మ చిత్తానుసారంగా ఈఈ కార్యాలయంలో కొందరు ఏఈలకు సీట్లను కేటాయించారు.
సాయంత్రం 6 వరకు పనిచేయాలని సర్క్యులర్
ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు విధుల్లోనే ఉండాలని రెండు నెలల క్రితం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఉద్యోగులు జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో లేని నిబంధనలు ఇక్కడే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు ఏ సమయంలో కార్యాలయానికి వచ్చి వెళ్లిపోయినా పట్టించుకోవట్లేదని, కొందరిని మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయంలోనే ఉండాలని షరతులు పెడుతుండటంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.