ఆ నగదు ఎక్కడ?
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:03 AM
బంగారం చీటీలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. నగదు చీటీల నిర్వహణలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడుందో తెలియట్లేదు. పోలీసులకూ చెప్పట్లేదు. ఇదీ బంగారం చీటీలు నిర్వహించి వందల మందికి కోట్ల రూపాయలు టోకరా వేసిన ముచ్చెర్ల శ్రీనివాసరావు వ్యవహారం.
బంగారం శ్రీను ఇంట్లో పోలీసు సోదాలు
బంగారం, వెండి తప్ప కనిపించని డబ్బు
పోలీసుల విచారణలో నోరు మెదపని నిందితుడు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : బంగారం చీటీలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. నగదు చీటీల నిర్వహణలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడుందో తెలియట్లేదు. పోలీసులకూ చెప్పట్లేదు. ఇదీ బంగారం చీటీలు నిర్వహించి వందల మందికి కోట్ల రూపాయలు టోకరా వేసిన ముచ్చెర్ల శ్రీనివాసరావు వ్యవహారం. హైదరాబాద్‌లో తలదాచుకున్న శ్రీనివాసరావును అజితసింగ్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడ్ని నగరానికి తీసుకొచ్చి పోలీసు స్టేషన్‌లో గంటల తరబడి విచారణ చేశారు. పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా శ్రీనివాసరావు సమాధానం చెప్పలేదని తెలిసింది. అయోధ్యనగర్‌లోని లోటస్‌లో ఉంటున్న శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో సోదాలు చేశారు. ఇంట్లో 18 కిలోల వెండి, 600 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అనంతరం అతడ్ని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిసే్ట్రట్ కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసరావు పోలీస్‌స్టేషన్‌లో ఉండగా, వాసవీ క్లబ్‌కు చెందిన పలువురు అక్కడికి చేరుకున్నారు.
ఆ డబ్బు ఎక్కడ?
బాధితులంతా పోలీసులను ఆశ్రయించిన తర్వాత ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆడియో వాయిస్‌ను చీటీల గ్రూపులో పోస్టు చేశాడు. రెండు రోజుల్లో వచ్చి బాధితులకు సర్దుబాటు చేస్తానని సందేశం పంపాడు. ఇప్పుడు పోలీసులు ఇంట్లో సోదాలు చేయగా, డబ్బు ఏమీ కనిపించలేదు. డబ్బు ఎక్కడ దాచాడో కూడా శ్రీనివాసరావు చెప్పట్లేదు. డబ్బు గురించి అడిగినప్పుడు తన వద్ద ఏమీ లేదని చెప్పినట్టు సమాచారం. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తులను కుటుంబ సభ్యుల పేరు మీద కూడగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో భద్రపరిచాడా.. అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. వ్యాపారంలో నష్టాలు ఎలా వచ్చాయని పోలీసులు వేసిన ప్రశ్నకు శ్రీనివాసరావు నోరు విప్పలేదని తెలుస్తోంది. వాస్తవానికి పోలీసులకు శ్రీనివాసరావు చిక్కకపోతే కుటుంబం సహా ఇతర రాషా్ట్రలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. తర్వాత కోర్టులో లొంగుబాటు పిటిషన్ వేసుకుని పోలీసులకు చిక్కకుండా మార్గం సుగమం చేసుకోవాలనుకున్నాడు. దీనికి కోర్టు బ్రేక్ వేయడంతో పారిపోవడానికి రెండో ప్రణాళిక వేసుకున్నాడు. దీనికి కూడా పోలీసులు అడ్డుకట్ట వేశారు. త్వరలో శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని డబ్బు, ఆస్తుల వివరాల లెక్కలు తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు.