బాబోయ్ మధ్యప్రదేశ్ ముఠా
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:52 AM
ప్రాంతమేదైనా నేరం జరిగిన తీరు ఒకలాగే ఉంటుంది. ఎక్కడా ఇళ్ల తాళాలు పగలవు. బాతరూమ్ కిటికీల అద్దాలే పగులుతాయి. లోపల వస్తువులు మాత్రం మాయమవుతాయి. ఇదీ మధ్యప్రదేశ్ గ్యాంగ్ చోరీల విధానం. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి విజయవాడ పోలీసులు వేట మొదలుపెట్టారు. వారితో పాటు ఖమ్మం, కర్ణాటక పోలీసులు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈ మూడుచోట్లా జరిగిన చోరీల తీరంతా ఒకేలా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా మధ్యప్రదేశ్ గ్యాంగ్ పనేనన్న అంచనాకు వచ్చారు.
నగరంలోకి ప్రవేశించిన గ్యాంగ్ కోసం పోలీసుల వేట
విజయవాడ, ఖమ్మం, కర్ణాటకలో వరుస చోరీలు
ఇంటి వెనుక కిటికీ అద్దాలు పగలగొట్టుకుని ప్రవేశం
యజమానికి తెలియకుండా నగలు, నగదు అపహరణ
‘పార్థి’ గ్యాంగ్‌పైనా పోలీసులకు అనుమానాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ప్రాంతమేదైనా నేరం జరిగిన తీరు ఒకలాగే ఉంటుంది. ఎక్కడా ఇళ్ల తాళాలు పగలవు. బాతరూమ్ కిటికీల అద్దాలే పగులుతాయి. లోపల వస్తువులు మాత్రం మాయమవుతాయి. ఇదీ మధ్యప్రదేశ్ గ్యాంగ్ చోరీల విధానం. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి విజయవాడ పోలీసులు వేట మొదలుపెట్టారు. వారితో పాటు ఖమ్మం, కర్ణాటక పోలీసులు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈ మూడుచోట్లా జరిగిన చోరీల తీరంతా ఒకేలా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా మధ్యప్రదేశ్ గ్యాంగ్ పనేనన్న అంచనాకు వచ్చారు.
వరుస దొంగతనాలు
ఈనెల 5న గుణదలలోని విశాఖపట్నం రైల్వేట్రాక్ సమీపాన ఉన్న విల్లాల్లోని ఓ ఇంట్లోకి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారు. వెనుక వైపు నుంచి నిచ్చెన ద్వారా బాతరూం కిటికీ వరకు ఎక్కారు. అద్దాన్ని పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆ ఇంట్లో ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 వేలు దొంగిలించారు. ఇంటి యజమానులు నిద్రలో ఉండగా పని చక్కబెట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన గుణదల పోలీసులు కొన్ని వేలిముద్రలు సేకరించారు. వాటిని సీపీ కార్యాలయంలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ విభాగంలో పరిశీలించారు. ఏ వేలిముద్రతోనూ ఈ నమూనాలు సరిపోలేదు. నేరం జరిగిన తీరును తెలియజేస్తూ పోలీసులు వారి గ్రూపుల్లో ఫొటోలను పోస్టు చేశారు. గుణదల మాదిరిగానే మరికొన్ని చోరీలు జరిగినట్టు సమాచారం అందింది. ఈనెల 1న ఖమ్మంలో, తర్వాత గుణదలలో, ఆ తర్వాత 8న కదిరిలో, 9న హిందూపురంలో, 11, 12న అనంతపురం జిల్లా దగ్గరలో కర్ణాటక రాష్ట్రంలో చోరీలు జరిగాయి. ఈ మొత్తం నేరాల విధానం ఒకేలా ఉంది.
వేర్వేరు గ్యాంగ్‌ల పనే..
ఖమ్మం వయా విజయవాడ, కర్ణాటక వరకు జరిగిన చోరీలన్నీ ఒకేలా ఉండటంతో ఒకే గ్యాంగ్ చేసి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. గుణదల పోలీసులకు లభించినట్టుగానే ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు కొన్ని వేలిముద్రల నమూనాలు లభించాయి. గుణదల పోలీసులు ఆ వేలిముద్రలతో పోల్చి చూశారు. ఒకచోట లభించిన వేలిముద్రలకు మరోచోట లభించిన వాటికి వ్యత్యాసాలు ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్ నుంచి పది గ్యాంగ్‌లు దక్షిణాది రాషా్ట్రల్లోకి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో నేరాలకు సంబంధించి పది రకాల గ్యాంగ్‌లు ఉన్నాయి. వాటిలో ఏ కేటగిరీ గ్యాంగ్‌లు ఈ చోరీలు చేశాయన్నది తెలియట్లేదు. వారిని పట్టుకోవడానికి విజయవాడ సీసీఎస్, గుణదల పోలీసులు గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్ గ్యాంగ్‌లు ఈ చోరీలు చేశాయని అంచనాకు వచ్చినప్పటికీ, మహారాష్ట్ర అనుమానం మరోపక్క వెంటాడుతోంది. మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్‌ను కొట్టిపారేయలేమని పోలీసులంటున్నారు. నెల వ్యవధిలో మొత్తం ఏడు చోరీలు జరగడం, ప్రతి చోరీలోనూ లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలను కాజేయడంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.