ఆశల యూపీక్స్
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:50 AM
రూ.లక్షను ఏడాదిలో రూ.2 లక్షలు చేసి ఇస్తానని నమ్మించి వందలాది మంది నుంచి రూ.కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన యూపిక్స్ సినీ యానిమేషన్స్ కేసు కొలిక్కి వచ్చింది. ఈ మొత్తం మోసంతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్ డీసీపీ తిరుమలేశ్వర్‌రెడ్డి, ఉత్తర మండలం ఏసీపీ స్రవంతిరాయ్, సత్యనారాయణపురం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి శనివారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో వెల్లడించారు.
యూపిక్స్ కేసును ఛేదించిన పోలీసులు
ముగ్గురు అరెస్టు.. ఒకరికి నోటీసులు
344 మంది నుంచి రూ.592.72 కోట్ల వసూలు
183 మంది నుంచి రూ.201.55 కోట్లు హాంఫట్
ఎలాంటి లాభం పొందని బాధితులు 25 మంది
నిందితుల ఆస్తుల జప్తునకు ప్రణాళిక
విజయవాడ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : సత్యనారాయణపురానికి చెందిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మీ కిరణ్ 2014లో యూపిక్స్ క్రియేషన్స్‌ను ఏర్పాటు చేశాడు. 2017లో ఈ కంపెనీలో మ్యాజిక్ టాయ్స్ పేరుతో యానిమేషన్ సిరీస్‌ను రూపొందించింది. ఇందులో నరసరావు పేటకు చెందిన పి.మాల్యాద్రిరెడ్డి రూ.60 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ సిరీస్‌ను ఆయన రూ.1.04 కోట్లకు విక్రయించారు. ఒక్కసారిగా రూ.40 లక్షల లాభాన్ని చూసిన కిరణ్, మాల్యాద్రిరెడ్డి ప్రజలను మోసం చేయడానికి ఇదే మార్గమని భావించారు. వెంటనే మిట్టపల్లి రాజేంద్ర, కొత్తూరి వేణుగోపాల్‌ను కలిసి విషయం వివరించారు. రూ.లక్ష పెట్టుబడికి ఏడాది తర్వాత రూ.2 లక్షలు ఇస్తామంటూ ప్రచారం చేశారు.
డిపాజిట్లుగా రూ.కోట్లు
2018-2024 డిసెంబరు వరకు 344 మంది నుంచి రూ.593 కోట్లను డిపాజిట్లుగా సేకరించారు. ఈ మొత్తం డిపాజిటర్లకు 1,953 బాండ్లు జారీ చేశారు. రూ.392 కోట్లను ఖాతాదారులకు తిరిగి చెల్లించారు. 183 మంది ఖాతాదారులకు రూ.201 కోట్లను చెల్లించకపోవడంతో వారంతా నష్టపోయారు. ఈ మొత్తం నగదు నుంచి నిడుమోలు వెంకట సత్యలక్ష్మీ కిరణ్ రూ.26.24 కోట్లను, నరసరావుపేటకు చెందిన మిట్లపల్లి రాజేంద్రబాబు, మరో వ్యక్తి కలిసి రూ.71.18 కోట్లను, కొత్తూరి వేణుగోపాలరావు రూ.27.26 కోట్లను, పేరం మాల్యాద్రి అండ్ కో రూ.10 కోట్లను దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు. వారు కాకుండా మరో 121 మంది లాభాలు పొందినవారు రూ.66.75 కోట్లను దారి మళ్లించారు. మొత్తంగా రూ.201.05 కోట్లు దారి మళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత చెల్లింపులు చేయలేక బోర్డు తిప్పేశాడు. ఇందులో పెట్టుబడి పెట్టిన పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై క్రైం నెంబరు 114/2025 115/2025తో బీఎన్‌ఎస్ 61(2), 318(4), 316(2), 316(5), 338, 336(3), 340(2), 45, డిపాజిటర్ల రక్షణ చట్టంలోని సెక్షన్-5 కింద రెండు కేసులు నమోదు చేశారు. యూపిక్స్ నగదు లావాదేవీలను సాంకేతికంగా ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కిరణ్, రాజేంద్రబాబు అలియాస్ రాజు, మిట్టపల్లి రాజీవ్‌కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మల్యాద్రిరెడ్డి బైపాస్ ఆపరేషన్ చేయించుకోవడంతో అరెస్టు చేయలేదు. ప్రస్తుతం నోటీసు మాత్రం జారీ చేశారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కిలోల వెండి ఆభరణాలు, ఎక్స్‌యూవీ కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం
నిందితులు నలుగురికి సంబంధించి మొత్తం రూ.20.09 కోట్ల విలువైన 49 ఆస్తులను పోలీసులు గుర్తించారు. అలాగే, ఈ నలుగురు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో రూ.4.91 కోట్ల విలువైన 88 చరాస్తులను గుర్తించారు. కోర్టు అనుమతి తీసుకుని వాటిని జప్తు చేస్తామని పోలీసు కమిషనర్ తెలిపారు.
దర్యాప్తు అధికారులకు సత్కారం
రేయింబవళ్లు శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులను పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు సత్కరించారు. ఉత్తర మండలం ఏసీపీ స్రవంతిరాయ్, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, పలివెల శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, పుల్లా చంద్రశేఖర్, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు నగదు పురస్కారం అందజేసి సత్కరించారు.
లాభాలను తిరిగి చెల్లించండి : సీపీ
‘యూపిక్స్‌లో అధిక వడ్డీలకు ఆశపడి, పెట్టుబడులు పెట్టి లాభాలను తీసుకున్నవారు వాటిని వెనక్కి ఇవ్వాలి. ఎలాంటి అనుమతులు లేని సంస్థలో పెట్టుబడులు పెట్టడం తప్పు. పైగా అందులో నుంచి లాభాలను దగ్గర పెట్టుకోవడం ఇంకా తప్పు. యూపిక్స్ నుంచి లాభాలను పొందినవారు తిరిగి వాటిని చెల్లించాలి. లేకపోతే కేసులు నమోదు చేస్తాం.’ అని సీపీ రాజశేఖరబాబు ఆదేశించారు.