Share News

అజ్ఞాతవాసులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:12 AM

కొద్దినెలల క్రితం హైదరాబాద్‌ నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకొస్తున్న ఇద్దరు యువకులను పటమట పోలీసులు రామవరప్పాడు రింగ్‌ వద్ద పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో మరో యువకుడిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురికీ ఎండీఎంఏను పంపుతున్న వ్యక్తి ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు. తాను సరుకు పంపిన ముగ్గురు వ్యక్తులకు పోలీసులకు దొరికిపోయారని తెలుసుకున్న ఢిల్లీలోని వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో అసలు డ్రగ్‌ను తయారుచేసిన వ్యక్తి, దాన్ని మార్కెట్‌ చేసిన వ్యక్తి ఇప్పటి వరకు చిక్కలేదు. కొద్దిరోజుల క్రితం ఈగల్‌ పోలీసులు బెంగళూరు నుంచి ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను తీసుకొస్తున్న వైజాగ్‌కు చెందిన యువతీ యువకులను మహానాడు జంక్షన్‌ వద్ద పట్టుకున్నారు. వారిని విచారణ చేసి, వైజాగ్‌కు చెందిన మరో యువకుడిని కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురికి రెండు డ్రగ్‌లను బెంగళూరులో మల్లెల మధుసూదనరెడ్డి సమకూర్చినట్టు నిర్ధారించారు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అజ్ఞాతవాసులు

డ్రగ్స్‌ కేసుల్లో పోలీసులకు చిక్కని సూత్రధారులు

ఏ కేసులోనూ ఇప్పటి వరకు బయటకు రాని మూలాలు

డ్రగ్స్‌ కొనుగోలుదారులు దొరికిన వెంటనే అప్రమత్తం

అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. చాటుగా వ్యాపార కార్యకలాపాలు

కేసు చతికలపడ్డాక బయటకు వచ్చి మళ్లీ వ్యాపారం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇప్పటివరకు పోలీసులు బట్టబయలు చేసిన డ్రగ్‌ కేసుల్లో కొనుగోలుదారులు, వారికి డ్రగ్స్‌ తయారీదారుల చిరునామాలను ఇచ్చినవారే పట్టుబడుతున్నారు. అసలు సూత్రధారులు ఎక్కడున్నారన్నది తెలియట్లేదు. అజ్ఞాతంలో ఉంటూ, చాకచక్యంగా వ్యవహరిస్తూ వ్యాపారాన్ని మూడు పూలు, ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాషా్ట్రల విద్యాసంస్థల్లోని యువకులకు మత్తు రుచి చూపించి ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు, వాటి దర్యాప్తు తీరుతెన్నులను పరిశీలిస్తే.. అసలు సూత్రధారులు దొరికిన దాఖలాలు ఎక్కడా లేవు. సమాచారం వచ్చిన వెంటనే ఆయా మార్గాల్లో గస్తీ నిర్వహించి డ్రగ్స్‌ను తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని రెండు, మూడు రోజులు విచారణ చేసి నెట్‌వర్క్‌ గురించి కొంతవరకు సమాచారం సేకరిస్తున్నారు. డ్రగ్స్‌ను తీసుకొస్తున్న వారు దొరికిపోయారని తెలిసిన వెంటనే ఆ నెట్‌వర్క్‌లో ఉన్నవారంతా ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి పారిపోతున్నారు.

కొత్త నెంబర్లు.. పాత ఖాతాలు

దశలవారీగా ఉన్న డ్రగ్‌ నెట్‌వర్క్‌లోని వ్యక్తులు పోలీసులు వేస్తున్న అడుగులను బట్టి ఎత్తులు వేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో కొనుగోలుదారులు చివరి దశలో ఉంటున్నారు. ఒకసారి కొనుగోలుదారుడు దొరికిన వెంటనే ఆ పైన దశల్లో ఉండేవారంతా అప్రమత్తమైపోతున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే ప్రధాన సూత్రధారులకు చెప్పేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని వారి చిరునామాల వివరాలను తెలుసుకునే సరికి వారు మొత్తం సర్దేసుకుంటున్నారు. అప్పటి వరకు ఉపయోగించిన ఫోన్‌ నెంబర్లను స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు ఉపయోగించిన ఆ సిమ్‌లను తొలగించేస్తున్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బును లాగేసుకుంటున్నారు. పోలీసులు బ్యాంక్‌ల్లో ఉన్న నగదును స్తంభింపజేసినా నష్టం లేకుండా ఇలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తును ఆపేశారని తెలుసుకున్న తర్వాత మరో కొత్త సిమ్‌ తీసుకుని పాత ఖాతాదారులకు సమాచారం ఇస్తున్నారు. అక్కడి నుంచి అడ్డంకులు లేకుండా మత్తును నలుమూలలకు పంపుతున్నారు. తిరిగి ఎక్కడైనా ఎవరైనా పోలీసులకు చిక్కారని తెలియగానే మళ్లీ ఆ నెంబర్లను వదిలేస్తున్నారు. పోలీసులు గుట్టురట్టు చేసిన ప్రతి డ్రగ్‌ కేసులోనూ ఇదే జరుగుతోంది. ఈ కారణంగానే ముఠాలకు మూలస్తంభాలు బయటకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. పోలీసుల దర్యాప్తు కొన్ని దశల వరకే సాగుతోంది. ఈ విషయాన్ని డ్రగ్‌ నెట్‌వర్క్‌లో ఉన్న వారు బాగా గ్రహించారు.

నెమ్మదిగా దర్యాప్తు

బెంగళూరు కేంద్రంగా రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు యువకులు ఎండీఎంఏ డ్రగ్‌ను విచ్చలవిడిగా తయారు చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. పోలీసులకు పలు సందర్భాల్లో చిక్కిన నిందితులు ఇదే విషయాన్ని వెల్లడించారు. వారంతా తెలుగు వారిని బెంగళూరులో ఏజెంట్లుగా నియమించుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారి మూలాలు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. గంజాయి కేసుల్లో పడినంత వేగంగా అడుగులు డ్రగ్స్‌ దర్యాప్తులో పడట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన కేసులో అయినా అసలు మూలాలు బయటకు వస్తాయో రావో వేచి చూడాలి.

Updated Date - Sep 05 , 2025 | 01:12 AM