అర్ధరాత్రి అక్రమాలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:02 AM
నిశీధిలో పోలవరం మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పగలు కంటికి కనిపించకుండా, అర్ధరాత్రి 12 గంటలు మొదలు తెల్లవారే వరకు పోలవరం కట్ట మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రి వందలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేసి తోటల్లో డంప్ చేస్తున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఇరిగేషన్ బృందం గురువారం అర్ధరాత్రి దాడులు చేసి అక్రమ తవ్వకాలను వెలుగులోకి తెచ్చింది. కాగా, మట్టి డంపింగ్‌ను పరిశీలించడానికి ఓ తోటలోకి వెళ్లిన అధికారులను కాపలాదారుడు లోపలే పెట్టి గేటుకు తాళం వేయడం గమనార్హం.
కొత్తూరు తాడేపల్లిలో పోలవరం మట్టి తవ్వకాలు
ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారుల బృందం
పారిపోయిన అక్రమార్కులు.. ఎక్స్‌కవేటర్ స్వాధీనం
తోటలో మట్టి లెక్క తేల్చేందుకు వెళ్లిన జేఈఈ
అధికారులు లోపల ఉండగానే గేటుకు తాళం
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తూరు తాడేపల్లిలో పోలవరం మట్టిని అక్రమార్కులు ఏ విధంగా తవ్వుకున్నారో అందరికీ తెలిసిందే. ఈ అక్రమాలపై విజిలె న్స్ అధికారులు విచారణ కూడా జరిపారు. పోలవరం మట్టి తవ్వకాల వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. అయినా అక్రమార్కులు భయపడట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా భయం లేదన్నట్టుగా చెలరేగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి తాడేపల్లిలో ఓ తోట వెంబడి ఉన్న పోలవరం కట్ట మట్టిని యథేచ్ఛగా ఎక్స్‌కవేటర్లతో తవ్వేశారు. ఆ మట్టిని తరలిస్తుండగా గ్రామస్తులు వీడియో తీసి అప్పటికప్పుడు పోలవరం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలవరం ఇరిగేషన్ డీఈ అప్పిరెడ్డి, జేఈఈలు కిషోర్, కౌశిక్ బృందం కొత్తూరు తాడేపల్లికి చేరుకుంది. అధికారుల బృందం వస్తుండటాన్ని గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయారు. అర్ధరాత్రి మట్టిని తవ్వటాన్ని అధికారుల బృందం గుర్తించింది. కాల్వకట్టపై ఏపీ 40ఏఈ 8316 నెంబర్ కలిగిన ఎక్స్‌కవేటర్‌తో మట్టి తవ్వుతుండటాన్ని అధికారులు గమనించి నిలుపుదల చేయించారు. తవ్విన మట్టి తోటలో ఎంతవేశారో చూద్దామని డీఈ అప్పిరెడ్డి.. జేఈఈ కిషోర్‌ను పురమాయించారు. ఆయన తోటలోకి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో ఆ తోట కాపలాదారుడు గేట్లకు తాళం వేసి పారిపోయాడు. తనను తోటలో ఉంచి తాళం వేసిన విషయాన్ని జేఈఈ కిషోర్.. డీఈ అప్పిరెడ్డికి చెప్పారు. గ్రామస్థులు అక్కడికి చేరుకుని తోట గేటు తాళం పగలగొట్టి కిషోర్‌ను బయటకు తీసుకొచ్చారు.
పక్కాగా లెక్కలు
పోలవరం మట్టిని అక్రమంగా తవ్వుతున్న విషయాన్ని ఇరిగేషన్ అధికారుల బృందం గుర్తించటంతో పాటు ఎంతమేర మట్టి తవ్వారు? ఎంత నష్టం వాటిల్లింది? అనే లెక్కలు వేశారు. స్వాధీనం చేసుకున్న ఎక్స్‌కవేటర్‌ను టూటౌన్ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొద్దిరోజులుగా దాదాపు 5 వేల క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టిని తవ్వుకుపోయారని తెలుస్తోంది. దీని విలువ రూ.8.50 లక్షలు ఉంటుందని నిర్ధారించినట్టు కిషోర్ పోలీసులకు తెలిపారు.