ఆర్‌డబ్ల్యూఎస్‌లో అడ్డుగోడలు
ABN , Publish Date - May 27 , 2025 | 12:58 AM
గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)లో చీఫ్ ఇంజనీర్ల (సీఈల) వార్ నడుస్తోంది. ఓపక్క జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) పథకంలో భాగంగా భారీ ఎత్తున పనులు చేపట్టాల్సి ఉంది. పనిచేయించే ఉన్నతాధికారుల అవసరం ఉంది. కానీ, స్వలాభం, రాజకీయాలతో అట్టుడికిపోతున్న గొల్లపూడిలోని కార్యాలయంలో మాత్రం కొందరికే ప్రవేశం అన్నట్టుగా వ్యవహరిస్తూ.. ఇతర అధికారులు రాకుండా అడ్డుకుంటున్నారు.
చీఫ్ ఇంజనీర్ పోస్టు భర్తీ కాకుండా పన్నాగాలు
ఈఎన్‌సీలో అన్నీ తామేనంటూ వ్యవహారాలు
పదోన్నతి పొందిన సీఈకి ప్రవేశం కల్పించకుండా అడ్డంకులు
ఉన్నతాధికారులు చెబుతున్నా వినని పరిస్థితి
సిబ్బంది లేకపోవడంతో పనులు ముందుకు సాగని దుస్థితి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వ హయాంలో గొల్లపూడిలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కార్యాలయం భ్రష్టుపట్టింది. వందల కోట్ల రూపాయల అవినీతికి చిరునామాగా మారింది. జల్‌జీవన్ మిషన్ (జే ఏఎం) పనులను అడ్డం పెట్టుకుని మెటీరియల్ ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా అధికారులే సొంత నిర్ణయాలు తీసుకుని కాంట్రాక్టర్లతో కొనుగోలు చేయించారు. కమీషన్ల వ్యవహారాలు నడిపారు. అంతేకాదు.. అడ్డగోలుగా డిప్యూటేషన్లు ఇవ్వటం, ఆ మాటున భారీ ఎత్తున ముడుపులు అందుకోవడం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేయాల్సిన డీఈఈలు, ఇంజనీర్లు ఇతర డిపార్ట్‌మెంట్లకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేయటానికి డీఈఈలు, ఈఈలు, ఎస్‌ఈల కొరత ఏర్పడింది. నాడు కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డగోలుగా డిప్యూటేషన్లు ఇవ్వటంతో ప్రస్తుతం ఈ శాఖలో పనిచేయటానికి అధికారులు లేకుండాపోయారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు డీఈఈగా వచ్చిన విద్యాసాగర్‌కు ఇన్‌చార్జి ఈఈ బాధ్యతలతో పాటు ఎస్‌ఈ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే, ఇక్కడ ఒక్క పని కూడా ముందుకు వెళ్లట్లేదని, సిబ్బంది లేరని, సెలవు పెట్టి వెళ్లిపోతానని ఏకంగా కలెక్టర్ లక్ష్మీశ దగ్గర మొర పెట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
అడుగడుగునా అడ్డంకులు
ఈఎన్‌సీ కార్యాలయంలో ఒక ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ), నాలుగు చీఫ్ ఇంజనీర్ల (సీఈ) పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈఎన్‌సీ కార్యాలయంలో గాయత్రి, నాయక్, భాషా, సత్యనారాయణ చీఫ్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈఎన్‌సీగా పనిచేసిన కృష్ణారెడ్డి పదవీ విరమణ తర్వాత అప్పటి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సంజీవ్‌రెడ్డి పదవీ విరమణ నేపథ్యంలో మరో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గాయత్రీకి ఈఎన్‌సీగా బాధ్యతలిచ్చారు. గాయత్రికి ఎలాగూ ఈఎన్‌సీ ఇన్‌చార్జి ఇచ్చారు కాబట్టి ఆమె ఆ పోస్టులో వేతనం తీసుకోవచ్చు. కానీ, అలా చేయట్లేదు. ఒకవేళ గాయత్రి ఈఎన్‌సీ పోస్టులో వేతనం తీసుకుంటే.. మరో సీఈ పోస్టును భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా చీఫ్ ఇంజనీర్ల సీనియారిటీ జాబితాలో నెక్కంటి వెంకట సత్యనారాయణ, ఏషన్ భాషా, వెంకట రమణ ఉన్నారు. ఈ ముగ్గురూ ఒకేసారి పదోన్నతి అందుకున్నారు. వీరిలో ఏషన్ భాషాపై చార్జెస్ ఉండటంతో ఆయన కోర్టుకెళ్లి పోస్టు తెచ్చుకున్నారు. నెక్కంటికి చీఫ్ ఇంజనీర్‌గా అవకాశం కల్పించిన ఈఎన్‌సీ కార్యాలయం ఉన్నతాధికారులు వెంకట రమణకు మాత్రం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఖాళీలు లేవని, ఆయన్ను తీసుకోవటం కుదరదని ఇన్‌చార్జి ఈఎన్‌సీ గాయత్రి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె ఈఎన్‌సీ హోదాలో జీతం తీసుకుంటే, సమస్య పరిష్కారమవుతుందని ఉన్నతాధికారులు సూచించినా ఆ పని చేయట్లేదు. కాగా, ఈఎన్‌సీ కార్యాలయంలో పని చేయడానికి వెంకట రమణ ఎంతో పోరాడినా అడుగడుగునా అడ్డు పడుతూ వచ్చారు. చేసేదేమీలేక ఆయన మరో డిపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈఎన్‌సీ కార్యాలయంలో తగినంతగా అధికారులు లేకపోతే, క్షేత్రస్థాయిలో పనులు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోయినా.. ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారు.