పూజలు మరింత చేరువగా..
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:55 AM
దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై నిర్వహించే ప్రత్యేక పూజలను పరోక్ష విధానంలో చేయించుకునే భక్తుల విషయంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. కుంకుమార్చనలు, శ్రీచక్రనవార్చన, చండీహోమం, ఖడ్గమాలార్చనకు ఫీజులను గణనీయంగా తగ్గించాలని అధికారులు యోచిస్తున్నారు.
దసరా ఉత్సవాల సమయంలో టికెట్ ధరలు తగ్గించే యోచన
పరోక్ష విధానంలో మాత్రమే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై నిర్వహించే ప్రత్యేక పూజలను పరోక్ష విధానంలో చేయించుకునే భక్తుల విషయంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. కుంకుమార్చనలు, శ్రీచక్రనవార్చన, చండీహోమం, ఖడ్గమాలార్చనకు ఫీజులను గణనీయంగా తగ్గించాలని అధికారులు యోచిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో పరోక్ష పూజా విధానంలో కుంకుమార్చనకు రూ.3 వేల చార్జీ వసూలు చేస్తున్నారు. అలాగే శ్రీచక్రనవార్చనకు రూ.3 వేలు, చండీహోమానికి రూ.4 వేలు, ప్రత్యేక లక్షకుంకుమార్చనకు రూ.5 వేలు, ఖడ్గమాలార్చనకు రూ.5,116 చొప్పున టికెట్ వసూలు చేస్తున్నారు. ఈ టికెట్ ధరలను రూ.1,000-రూ.1,500 వరకు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత ఎక్కువమంది భక్తులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే రేట్లు తగ్గించాలనేది దేవస్థాన అధికారుల భావన. పరోక్ష విధానంలో పూజలు చేయించుకునే వారికి దేవస్థానం పూజల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా లింక్ ఇస్తారు. ఈ లింక్ ద్వారా ఇంటి నుంచి పూజలు వీక్షించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం, రాగి డాలర్, వస్త్రం తదితరాలను భక్తుల ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.