ఇంటిదొంగలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:00 AM
సీవీటీ.. చెకింగ్ వెహికల్ ట్యాక్స్. వాణిజ్య పన్నుల శాఖ విధినిర్వహణలో ఇదొక భాగం. వివిధ ప్రాంతాల నుంచి సరుకులతో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేసి బిల్లులు ఉన్నాయా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించారా లేదా అనే విషయాన్ని పరిశీలించేది సీవీటీ. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఈ సమాచారం కార్యాలయం గేట్లు దాటుతోంది. ఎక్కడ తనిఖీలు జరుగుతాయో ఆ ప్రదేశం వివరాలన్నీ ముందే డీలర్లు, ఆడిటర్లకు చేరుతున్నాయి. ఇది ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల వద్ద ఉండే కిందిస్థాయి సిబ్బంది నుంచి ఈ సమాచారం లీకవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్ల చిత్రాలు
సీవీటీ తనిఖీల సమాచారం ముందే లీక్
కీలకంగా మారుతున్న కిందిస్థాయి సిబ్బంది
డీలర్లు, ఆడిటర్లకు అప్పటికప్పుడు సమాచారం
చేతికి చిక్కిన వాహనాలతో బేరాసారాలు
వసూలు రాయుళ్లకు అధికారుల అండదండలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం మూడు డివిజన్లు ఉన్నాయి. విజయవాడ-1 డివిజన్ పరిధిలో నందిగామ, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, పార్కురోడ్డు, ఇంద్రకీలాద్రి, భవానీపురం సర్కిళ్లు ఉన్నాయి. విజయవాడ-2 డివిజన్‌లో సామారంగంచౌక్, కృష్ణలంక, బెంజిసర్కిల్, సూర్యారావుపేట, ఆటోనగర్, గాంధీనగర్ సర్కిళ్లు ఉన్నాయి. విజయవాడ-3 డివిజన్‌లో బందరు, గుడివాడ, రామవరప్పాడు, పెనమలూరు, పటమట సర్కిళ్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 17 సర్కిళ్లు ఉన్నాయి. ఇవికాకుండా ఒక్కో డివిజన్‌లో స్పెషల్ సర్కిల్ ఉంటుంది. వాటితో కలిపి మొత్తం 20 సర్కిళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్లలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు మొత్తం చక్రం తిప్పుతున్నారని తేలిపోయింది. ఇప్పటి వరకు సబార్డినేట్లపై వచ్చిన ఫిర్యాదులను కొట్టిపారేసిన అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. వన్‌టౌన్‌లోని పంజా సెంటర్‌లో ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి లంచం తీసుకుంటూ గవర్నరుపేట సర్కిల్ అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులు, వారి కింద పనిచేసే సిబ్బంది సిత్రాలు బయటకు వస్తున్నాయి.
వసూళ్లు ఇలా..
సర్కిళ్లలో అధికారులు నిత్యం సీవీటీ తనిఖీలు చేస్తుంటారు. ఈ తనిఖీల్లో డీసీటీవో, ఏసీటీ.వో, ఇన్‌స్పెక్టర్ ఉంటారు. వారితో పాటు వాహనాలను ఆపడానికి అటెండర్లు, వాచ్‌మెన్లను కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది అధికారులు వారి వాహనాలను నడిపే డ్రైవర్లను తనిఖీలకు నియమించుకుంటున్నారు. ఒకప్పుడు డివిజన్లలో సర్కిల్ అధికారులు తోచినప్పుడల్లా తనిఖీలకు వెళ్లేవారు. వైసీపీ హయాంలో ఈ విధానం మొత్తం మారిపోయింది. కమిషనర్ కార్యాలయం నుంచి తనిఖీలకు వెళ్లమని ఆదేశాలు వస్తేనే సర్కిళ్ల నుంచి అధికారులు రహదారులపైకి రావాలి. కమిషనర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా తనిఖీలకు వెళ్లినట్టు తెలిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సీవీటీ తనిఖీలకు సంబంధించి కమిషనర్ కార్యాలయం నుంచి డివిజన్ల పరిధిలో సర్కిళ్లకు ఆదేశాలు వస్తున్నాయి. ఒక సర్కిల్ పరిధిలో జరిగే తనిఖీలకు మరో సర్కిల్ అధికారులను రంగంలోకి దింపుతున్నారు. ఈ సీవీటీ తనిఖీల సమాచారం వాహనాల్లో సరుకులను పంపే సంస్థల అధినేతలకు చేరుతోంది. కొన్నిచోట్ల మాత్రం తనిఖీల సమయంలో లోపాలను గుర్తించిన అధికారులు వెంటనే బేరాలు మొదలుపెడుతున్నారు. ఈ లావాదేవీల్లో గుమస్తాలు, అటెండర్లు, వాచమెన్లు, డ్రైవర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీవీటీల్లో జరుగుతున్న వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో జిల్లాలోని అధికారులకు క్లాస్ తీసుకున్నారు.
అధికారులు, సిబ్బంది సత్సంబంధాలు
బిల్లులో లోపాలను గుర్తించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సీన్‌లో కనిపించకుండా కిందిస్థాయి సిబ్బందితో వ్యవహారాలు చక్కబెట్టిస్తున్నారు. సిబ్బంది వసూళ్లు చేసి అధికారులకు వాటాలు ఇవ్వడంతో వారిపై ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. అధికారులకు కిందిస్థాయి సిబ్బందికి సంబంధాలు బలంగా ఉండటానికి కారణం ఇదేనని తెలుస్తోంది. తాజా ఘటనతో అయినా వాణిజ్య పన్నుల శాఖలో మార్పు వస్తుందా అని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.