Share News

వాగుల్లో కెమి‘కిల్స్‌’

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:48 AM

ఫార్మా, కెమికల్స్‌ కంపెనీ యజమానుల లాభాపేక్ష పంట భూములకు, పశువులకు శిక్షగా మారింది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా డ్రెయినేజీల ద్వారా వాగుల్లోకి వదిలేయడంతో నీరు కలుషితమై పంట పొలాలు బీడుగా మారుతుండగా, ఆ నీరు తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయి. కవులూరు, కట్టుబడిపాలెం గ్రామాలను దశాబ్దాల నుంచి వెన్నాడుతున్న ఈ సమస్యను అరికట్టాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పట్ట నట్టు వ్యవహరిస్తుండగా, స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.

వాగుల్లో కెమి‘కిల్స్‌’
ఫార్మా కంపెనీల వ్యర్థాలతో రంగు మారిన తొమ్మండ్రువాగు నీరు

తొమ్మండ్రు, గుర్రాల వాగుల్లోకి వదిలేస్తున్న ఫార్మా వ్యర్థాలు

కంపెనీల లాభాపేక్ష.. పంటలకు, పశువులకు శిక్ష

బీడువారిన 100 ఎకరాల పంట పొలాలు

సాగులేక చేపల చెరువులుగా మాగాణి భూములు

నిరుపయోగంగా మారిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

నిద్రావస్థలో కాలుష్య నియంత్రణ బోర్డు

మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో సుమారు 11 వరకు ఫార్మా కంపెనీలు, పలు కెమికల్‌ కంపెనీలు, పాలిమర్స్‌, టైర్స్‌ రీబూట్‌ కంపెనీలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఆయా కంపెనీల వారే శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. బయటకు విడుదల చేయకుండా చూసుకోవాలి. కానీ, చాలా కంపెనీలు అలా చేయకుండా నేరుగా వ్యర్థాలను డ్రెయినేజీ ద్వారా వాగుల్లోకి పంపించేస్తున్నారు. సమీపంలో ఉన్న జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం తొమ్మండ్రువాగులోకి, కవులూరులోని గుర్రాల వాగులోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ రెండు వాగులు కలుషితమవుతున్నాయి. ఆ నీరు వాడిన పంట పొలాలు చౌడు బారుతున్నాయి. కలుషిత నీరు తాగిన పశువులు రోగాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. రెండు గ్రామాల్లో ఇప్పటికే 200 ఎకరాలు సాగుకు పనికిరాకుండా పోవడంతో ఆయా భూములను రైతులు చేపల చెరువులకు లీజుకు ఇచ్చేశారు. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన భూములు చేపల చెరువులుగా మారిపోయాయి. వాగుల ప్రవాహం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. ముఖ్యంగా కట్టుబడిపాలెం గ్రామానికి దక్షిణంగా ప్రవహించే తొమ్మండ్రువాగులో తీవ్ర దుర్గంధం వల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నామని, తలుపులు, కిటికీలు మూసుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. దోమలు సైతం విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐడీఏలో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాలకు చెందిన రైతుల ఆందోళనలతో ఔషధ (ఫార్మా) కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసుకునేందుకు 20 ఏళ్ల క్రితం కొండపల్లి ఐడీఏలో కోట్ల రూపాయలు పెట్టి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడతో పూర్తి సామర్థ్యంతో అది పనిచేయలేదు. కొద్దిమేర మాత్రమే వ్యర్థాలను శుద్ధిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో దానికి సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ యజమాని జనావాసాల మధ్య ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉండటానికి వీల్లేదని కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కంపెనీల యజమానులు కేంద్ర సాయం కోసం పోరాడలేదు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కూడా పూర్తికాలేదు.

దశాబ్దాల పోరాటం

కొండపల్లి పారిశ్రామికవాడ (ఐడీఏ)లోని ఫార్మా, కెమికల్‌ కంపెనీల వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను భరించలేక కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల ప్రజలు మూడు దశాబ్దాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఒకదశలో కట్టుబడిపాలెం దగ్గర కవులూరు గ్రామానికి చెందిన గరిమెళ్ల గోపాలరావు అనే రైతు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు రైతుల నుంచి మద్దతు లభించింది. 2004లో అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సైతం ఈ కాలుష్యంపై స్పందించి కంపెనీల యజమానులతో మాట్లాడారు. కాలుష్యం కాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. ఆ తర్వాత పరిస్థితి యథాతథంగానే మారింది. కంపెనీల యజమానులు వ్యర్థాలను డ్రెయినేజీలోకి వదులుతూనే ఉన్నారు.

జిల్లా యంత్రాంగం స్పందించాలి

ఈ సమస్య కేవలం రెండు గ్రామాలదే కాదు.. తొమ్మండ్రువాడు, గుర్రాలవాగుల్లో కలిసే ఫార్మా, కెమికల్స్‌ వ్యర్థాలు.. వర్షాలు వచ్చినప్పుడు తారకరామా ఎత్తిపోతల పథకం కాల్వలోనూ కలుస్తున్నాయి. ఈ నీరు విజయవాడ రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలను ముంచెత్తుతోంది. భవిష్యత్తులో అనేక గ్రామాలపై ఈ కాలుష్యం కాటు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఫార్మా, కెమికల్‌ కంపెనీల వ్యర్థాలు బయటకు రాకుండా వారే వాటిని శుద్ధి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కాలుష్య నియంత్రణ బోర్డు దృష్టిసారించాలి

కంపెనీలకు చెందిన ప్రమాదకర వ్యర్థాల నుంచి ప్రజలు, పంటలు, పశువులను కాపాడాలని కాలుష్య నియంత్రణ బోర్డును స్థానికులు కోరుతున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు వచ్చి నామమాత్రపు తనిఖీలు నిర్వహించి హడావిడి చేయడం పరిపాటిగా మారింది. కంపెనీల యజమానులు ఇచ్చే తాయిలాలకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.

Updated Date - Aug 12 , 2025 | 12:48 AM