విభజన విన్నపాలు వినవలె
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:53 AM
అడ్డగోలుగా విభజించారు. అందేంటని అడిగినా.. ప్రశ్నించినా కనీసం పట్టించుకోలేదు. జిల్లాల పునర్విభజన పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఆడిన ఆటలో కీలకమైన ప్రాంతాలు ఆ జిల్లా కేంద్రానికి దూరం కాగా, ప్రొటోకాల్ విధులు అధికారులకు తలనొప్పిగా మారాయి. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికగా ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలుగా విభజించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయటాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. మంత్రులు తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
జిల్లాల విభజన సమస్యలపై మంత్రుల కమిటీని స్వాగతిస్తున్న ఉమ్మడి కృష్ణా ప్రజలు
వైసీపీ హయాంలో అడ్డగోలుగా మార్పులు చేర్పులు
ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చినా పట్టించుకోలేదు
విజయవాడకు దగ్గరలోని పెనమలూరు, గన్నవరం కృష్ణాలోకి..
బందరు వెళ్లాలంటే దూరాభారం.. పాలనా ఇబ్బందులు
విజయవాడ ఎయిర్‌పోర్టు కృష్ణాజిల్లా పరిధిలోకి..
ప్రొటోకాల్ విధుల కోసం బందరు నుంచి రాకపోకలు
నూజివీడును ఏలూరు జిల్లాలో కలపడంపై వ్యతిరేకత
కృష్ణాజిల్లాలో కలుపుతానని నాడు చంద్రబాబు హామీ
విజయవాడకు దగ్గరలోని గ్రేటర్ విలీన గ్రామాలు కృష్ణాజిల్లాలోకి..
విజయవాడ రూరల్ మండలం పరిస్థితి అగమ్యగోచరం
సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత ప్రజల విన్నపం
ఆ 25 గ్రామాలు ఎటువైపు?
విజయవాడను గ్రేటర్ చేయటం కోసం 25 విలీన గ్రామాలను జిల్లాల పునర్విభజనలో ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ గ్రామాలన్నీ పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఉండగా, కృష్ణాజిల్లాలో చేర్చారు. ఈ రెండు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలాది సంఖ్యలో ప్రజలు అభ్యర్థించినా పట్టించుకోలేదు. గన్నవరం, పెనమలూరు ప్రాంత ప్రజలకు విజయవాడ కనిష్టంగా 5 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం అయితే కనిష్టంగా 50 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. గన్నవరం, పెనమలూరుకు చెందిన వేలమంది ప్రజలు కలెక్టర్‌ను కలవటానికి మచిలీపట్నం వెళ్లాల్సి వస్తోంది. విజయవాడను ఆనుకుని ఉండే ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఎక్కడో ఉన్న మచిలీపట్నానికి వెళ్లడం ఇబ్బందిగా మారింది.
రూరల్ మండలం ఓ గందరగోళం
ఒక మండలం ఒకే నియోజకవర్గంలో ఉంటే సమస్యలు ఉండవు. విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోనే ఉంది. ఇందులోని తొమ్మిది గ్రామ పంచాయతీలు గన్నవరం నియోజకవర్గ పరిధిలో, ఏడు గ్రామ పంచాయతీలు మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. గన్నవరం కృష్ణాజిల్లాలో, మైలవరం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. స్థూలంగా విజయవాడ రూరల్ మండల పరిపాలన ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ, ఓటుహక్కు నమోదుకు కృష్ణాజిల్లా అనే పేర్కొనాలి. ఈ సమస్యలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
విమానాశ్రయం కృష్ణాజిల్లాలో..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం నియోజకవర్గంలో ఉంది. కానీ, ఇది కృష్ణాజిల్లా పరిధిలోకి వస్తుంది. దీనివల్ల ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ డ్యూటీలు చేయటం కృష్ణాజిల్లా యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. ప్రొటోకాల్ విధుల కోసం 75 కిలోమీటర్లు దాటి గన్నవరం వస్తున్నారు.
నూజివీడు సంగతేంటి?
ఒకప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలో అంతర్భాగంగా ఉన్న నూజివీడును కూడా ఏలూరు జిల్లాలో కలిపారు. మచిలీపట్నానికి దూరంగా ఉన్న నూజివీడును ఏలూరులో కలపటం సబబే అయినా.. ఈ అంశాన్ని స్థానికులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తమను కృష్ణాలోనే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నూజివీడు వచ్చినపుడు ప్రజలు తమ వినతిని ఆయనకు చెప్పుకొన్నారు. నూజివీడును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తాననిఅప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నూజివీడును కృష్ణాజిల్లా కంటే ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయటమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విస్తరిస్తున్న విజయవాడకు ఈ ప్రాంతం దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం కృష్ణాజిల్లాకు దగ్గరలో ఉన్న కైకలూరు, ముదినేపల్లి మండలాలను ఏలూరు జిల్లాలోకి తీసుకెళ్లారు. ఈ మండలాలను దూరం చేయటం వల్ల భౌగోళిక విచ్ఛిన్నం జరిగింది. ఇక్కడి ప్రజలకు దూరాభారాన ఉన్న ఏలూరు వెళ్లడం ఇబ్బందిగా మారింది. దగ్గరగా ఉన్న మచిలీపట్నం కాకుండా ఏలూరు వెళ్లిరావడం వారికి అసౌకర్యంగా మారింది.