Share News

వేరే దారి లేదా?

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:16 AM

ఇవి రోడ్లా.. పార్కింగ్‌ ప్లేసులా.. వన్‌టౌన్‌లోని కెనాల్‌ రోడ్డు, బీఆర్పీ రోడ్డును చూస్తే వచ్చే ప్రశ్న ఇది. ఆదాయమే పరమావధిగా కార్పొరేషన్‌ అధికారులు రహదారులపై పార్కింగ్‌ల ఆట ఆడుతుండగా, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకున్న వారు కరువయ్యారు. ఫలితంగా కార్పొరేషన్‌, కాంట్రాక్టర్లకు కాసుల పంట పండుతుండగా, వాహనదారులకు, దుర్గమ్మ భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

వేరే దారి లేదా?
కెనాల్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసిన వాహనాలు

రోడ్లపై పార్కింగ్‌ ప్లేసులా?

వన్‌టౌన్‌లో కార్పొరేషన్‌ అధికారుల నిర్వాకం

కీలక రహదారులు పార్కింగ్‌ ప్లేస్‌లకు కేటాయింపు

కెనాల్‌ రోడ్డు, బీఆర్పీ రోడ్డులో పరిస్థితి దారుణం

రోడ్లలోని సగభాగం వాహనాల నిలిపివేత

మిగతా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరం

పార్కింగ్‌ మాఫియాలు.. నిత్యం గొడవలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కెనాల్‌ రోడ్డు, బీఆర్పీ రోడ్డు.. వన్‌టౌన్‌లో కీలకమైన రహదారులివి. ఇంద్రకీలాద్రిపైకి వెళ్లేందుకు ప్రధానమైనది కెనాల్‌ రోడ్డు. ఈ రోడ్డులో ఒక భాగాన్ని కార్పొరేషన్‌ అధికారులు పార్కింగ్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. కెనాల్‌ రోడ్డు రెండోభాగం కూడా వినియోగంలో ఉంటే రద్దీ తగ్గుతుంది. కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నంవైపు వెళ్లేవారు ఈస్ట్‌ కృష్ణా మెయిన్‌ కెనాల్‌ బ్రిడ్జి మీదుగా కార్పొరేషన్‌ కార్యాలయం, శనీశ్వరుడి గుడి నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గర కుడివైపు తిరిగి కుమ్మరిపాలెం చేరుకోవాల్సి వస్తోంది. వాహనదారులకు ఇదొక పరీక్షగా మారింది. ఇక వన్‌టౌన్‌లో బీఆర్పీ రోడ్డుపై గాంధీజీ స్కూల్‌ దగ్గర రోడ్డులో సగభాగాన్ని పార్కింగ్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. ఇక్కడ వాహనాలు పార్క్‌ చేయడం వల్ల ఒక వరసలోనే వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఏర్పడుతోంది. రోడ్లపై పార్కింగ్‌ తీసుకున్నవారు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కార్పొరేషన్‌ నిర్దేశించే ఫీజు కంటే మూడు నాలుగు రెట్లు పెంచి అడ్డగోలుగా దండుకుంటున్నారు. దీంతో పార్కింగ్‌ కాంట్రాక్టుల కోసం మాఫియాలు ఏర్పడుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వారి పంచన చేరి పార్కింగ్‌ కాంట్రాక్టులను రక్షించుకోవటం అలవాటుగా మారింది.

ఎమ్మెల్యే చెప్పినా లెక్కలేదా?

రోడ్లపై పార్కింగ్‌ వ్యవహారాలపై చాలాకాలంగా స్థానికులు, వాహనదారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి దగ్గర స్థానికులు మొరపెట్టుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన రోడ్లను పార్కింగ్‌కు ఇవ్వటమేమిటని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తక్షణం వాటిని నిలిపివేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. ఉన్నతస్థాయి అధికారులకు ఆయన సూచించినా లెక్కచేయలేదు.

రోడ్డు భద్రతా కమిటీ సమావేశాల్లో మాట్లాడరేం..

రోడ్లపై పార్కింగ్‌ కాంట్రాక్టులు ఇస్తుండటం ఇబ్బందిగా పరిణమిస్తున్నా.. రోడ్డు భద్రతా కమిటీ సమావేశాల్లో పోలీసులు కానీ, కార్పొరేషన్‌ అధికారులు కానీ చర్చకు తీసుకురావట్లేదు. అవినీతి రుచిమరిగిన కార్పొరేషన్‌ ఎస్టేట్‌ విభాగం, ట్రాఫిక్‌ పోలీసులు తమకు అందే మామూళ్లు పోతాయేమోనని నోరు మెదపట్లేదు.

కార్పొరేషన్‌ చెప్పే సాకులివీ..

కాళేశ్వరరావు మార్కెట్‌, వన్‌టౌన్‌కు భారీసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కానీ, వాహనాలు పార్కింగ్‌ చేయటానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. షాపుల దగ్గర పార్కింగ్‌ చేస్తే రోడ్లు బ్లాక్‌ అవుతాయి. కాబట్టి రోడ్లను పార్కింగ్‌ కోసం ఇస్తున్నామని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. కానీ ఇది ఎంతవరకు సబబు అనే ప్రశ్న వస్తోంది. కార్పొరేషన్‌కు ఆదాయం వస్తున్నప్పుడు ఖాళీ స్థలాలు కానీ, కాల్వలపై ఐరన్‌ గ్రిల్స్‌తో కూడిన మల్టీమోడల్‌ కార్‌ పార్కింగ్‌ స్టాండ్లను ఏర్పాటు చేయవచ్చు. ప్రత్యామ్నాయ ఆలోచనలను వదిలిపెట్టి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగేలా రోడ్లను ఆక్రమించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 26 , 2025 | 01:16 AM