పార్కింగ్ దోపిడీ
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:11 AM
విజయవాడ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ ఫీజులు ప్రయాణికులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. రోజుకు రెండు లక్షల మంది రాకపోకలు సాగించే అతిపెద్ద రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఊరెళ్లి రావడం కంటే కూడా రైల్వేస్టేషన్‌లో ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేస్తే ప్రయాణ టికెట్‌కు మించి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రీమియం పేరుతో గంటకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. నాన్ ప్రీమియం పేరుతో గంటలకు లెక్కలు కట్టి మరీ డబ్బు పిండుతున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ బాదుడు
ప్రీమియం పేరుతో గంటకు రూ.12, రోజుకు రూ.288 వసూలు
నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేసుల్లో 3 గంటలకు రూ.12
రోజుకు రూ.వందల్లో చెల్లిస్తున్న ప్రయాణికులు
ఉపాధి, ఉద్యోగాలు చేసుకోవటానికి వచ్చే వారికి షాక్
రైలు టికెట్ కంటే అధికంగా వసూళ్లు
నెలవారీ పాసులకు మంగళం.. అడిగితే గొడవలు
రైల్వే ఉద్యోగులకూ పార్కింగ్ వసతి లేని దుస్థితి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం విజయవాడ నుంచి రాకపోకలు సాగించే వారికి రైల్వేస్టేషన్ దగ్గర పార్కింగ్ ఫీజులు మోయలేని భారమవుతున్నాయి. రైల్వే అధికారులు యూనిక్ పాలసీ ప్రకారం టెండర్లు పిలుస్తున్నామని చెబుతున్నారు కానీ, వాహనాలు పార్కింగ్ చేసే ప్రయాణికుల జేబులకు మాత్రం భారీగా చిల్లులు పడుతున్నారు. రైల్వేస్టేషన్ ఎదుటే తూర్పు ద్వారం వద్ద ప్రీమియం పార్కింగ్ కు అనుమతి ఇచ్చారు. ఇక్కడ గంటకు రూ.12 (జీఎస్టీతో కలిపి) వసూలు చేస్తున్నారు. 12 గంటలైతే రూ.144 తీసుకుంటున్నారు. మచిలీపట్నం, గుంటూరు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి విజయవాడలో చిరు ఉద్యోగాలు చేసుకునేవారు రైళ్లలోనే వస్తారు. రైల్వేస్టేషన్ నుంచి పని ప్రదేశానికి వెళ్లడానికి వీరు ద్విచక్రవాహనాలను పార్కింగ్ ప్లేస్‌లో పెట్టుకుంటారు. వీరికి రోజుకు రూ.144 ఫీజు భారం పడుతోంది. ఏలూరు, గుంటూరు, మచిలీపట్నానికి జనరల్ బోగీల్లో వెళ్లాలంటే రూ.100లోపే చార్జీ అవుతుంది. పార్కింగ్‌కు మాత్రం రెట్టింపు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సెలవు రోజుల్లో రెండు, మూడు రోజులు ఆఫీసులకు రాకపోతే రూ.400 నుంచి రూ.500 చెల్లించాలి. పార్కింగ్ ఫీజుల్లో నిలువు దోపిడీ చేస్తున్నారని చిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులే కాకుండా.. దూరప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు, ద్విచక్రవాహనాల్లో రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నవారు, ఇతర పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లేవారు కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజు రైల్వేస్టేషన్‌లోని ప్రీమియం, నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేస్‌లలో తమ వాహనాలను పార్కింగ్ చేయటం ద్వారా రూ.1,000 వరకు ఫీజు చెల్లిస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉండే ప్రీమియం పార్కింగ్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్ సర్క్యులేటింగ్ ఏరియాలో మరో నాలుగు నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. రైల్వేస్టేషన్ వెస్ట్, నార్త్ సైడ్‌తో పాటు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ రోడ్డు వెంబడి పార్శిల్ బ్లాక్ వైపు.. ఇలా పలు నాన్ ప్రీమియం పార్కింగ్ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ మూడు గంటలకు రూ.12 వసూలు చేస్తున్నారు. మూడు గంటలయ్యాక మళ్లీ మూడు గంటలకు రూ.12 చెల్లించాలి. రైల్వేస్టేషన్‌కు రోజూ 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో నిత్యం లక్షమందికి పైగా తమ వాహనాలను పార్కింగ్ ప్లేస్‌లలో ఉంచుతారు. దీనిని బట్టి చూస్తే ప్రయాణికుల నుంచి రూ.కోట్లలో పిండేస్తున్నారని అర్థమవుతుంది.
రైల్వే ఉద్యోగులూ బాఽధితులే..
రైల్వే ఉద్యోగులు కూడా పార్కింగ్ ప్లేస్‌ల బాధితులుగా మారిపోయారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 18 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా విజయవాడ నుంచి డివిజన్ పరిధిలోని అనేక ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తారు. ఎక్కువమంది ఉద్యోగులు రన్నింగ్‌లో ఉంటారు. వీరికి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ అనేది లేదు. ఏ సంస్థ అయినా తమ ఉద్యోగులు వాహనాలు నిలుపుకోవడం కోసం పార్కింగ్ ప్లేస్ కల్పించాలి. డీఆర్‌ఎం కార్యాలయం చెంతనే ఉన్నా పార్కింగ్ ప్లేస్ లేదు. దీంతో రైల్వేస్టేషన్‌లోని పెయిడ్ పార్కింగ్ ప్లేస్‌లలో వాహనాలు పెట్టుకుంటున్నారు.
నెలవారీ పాసులు ఇవ్వరు
రైల్వేశాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ నిర్వాహకులు కచ్చితంగా నెలవారీ పాసులు ఇవ్వాలి. ఈ పాసుల కోసం ఎవరైనా ప్రయాణికులు అడిగితే, పాసులు పరిమితమని, అందరికీ సాధ్యం కాదని చెబుతున్నారు. ఇలా అందరికీ మాయ మాటలు చెబుతూ.. ఎవరికీ పాసులు ఇవ్వట్లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. గట్టిగా అడిగితే దందాగిరీ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. పాసులైతే రాయితీ ఇవ్వాలనే పార్కింగ్ ప్లేస్‌ల నిర్వాహకులు ఇలా చేస్తున్నారు.
పాలసీ ప్రకారమే అంటున్న రైల్వే అధికారులు
పార్కింగ్ ప్లేస్‌ల వసూళ్లను రైల్వే అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని, నిబంధనల మేరకు టెండర్లు పిలుస్తున్నామని అంటున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను మాత్రం రైల్వే అధికారులు పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదు.