మళ్లీ ఆశలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:54 AM
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసుపై మళ్లీ ఆశలు నెలకొంటున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును అక్కడి తెలుగువారు విజయవాడ కు విమాన సర్వీసు గురించి అడగ్గా, వర్కవుట్ చేస్తామని సమాధానమిచ్చారు. దీంతో విజయవాడ నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయవాడ-సింగపూర్‌కు విమాన సర్వీసు నడపండి
సీఎం చంద్రబాబుకు సింగపూర్‌లోని తెలుగువారి విజ్ఞప్తి
వర్కవుట్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
గతంలోనే విజయవంతంగా నడిచిన సర్వీసు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసుపై మళ్లీ ఆశలు నెలకొంటున్నాయి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును అక్కడి తెలుగువారు విజయవాడ కు విమాన సర్వీసు గురించి అడగ్గా, వర్కవుట్ చేస్తామని సమాధానమిచ్చారు. దీంతో విజయవాడ నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఇండిగో సర్వీసు
ఏడేళ్ల కిందట విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడిచింది. నాటి టీడీపీ హయాంలో సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీనిద్వారా సగం ప్రయాణికులు లేకపోతే ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్ విధానంలో భరిస్తుంది. అంతకుముందే ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ఏడీసీఎల్).. సింగపూర్‌కు విమానయాన సర్వీసుకు సంబంధించి ఆన్‌లైన్ సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వే అనుకూలంగా రావడంతో వీజీఎఫ్ విధానంలో ఇండిగో ద్వారా సింగపూర్‌కు సర్వీసు నడపాలనుకున్నారు. 2018, డిసెంబరు 3న నాటి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ సర్వీసును ప్రారంభించారు. 90 శాతం ఆక్యుపెన్సీతో నడిచేది. విజయవాడ-సింగపూర్ మధ్య కేవలం రూ.9,500 చార్జీ ఉండేది. సింగపూర్ వె ళ్లినవారు ప్రపంచంలోని ఏ దేశం నుంచి ఏ దేశానికైనా విమానంలో చేరుకునే అవకాశం ఉండేది. దీంతో గల్ఫ్, ఇతర ప్రపంచ దేశాల్లో ఉన్నవారంతా సింగపూర్ వచ్చి, అక్కడి నుంచి విజయవాడ వచ్చేవారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం, ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి విదేశాలకు రాకపోకలు సాగించేవారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటగా నడిచిన అంతర్జాతీయ విమాన సర్వీసుగా ఇది నిలిచింది. వీజీఎఫ్ విధానం అవసరం లేకుండానే పోయింది. ఈలోపు ఎన్నికలు వచ్చాక.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం సింగపూర్ విమాన వీజీఎఫ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఇండిగో విమానయాన సంస్థ సింగపూర్‌కు సర్వీసును రద్దు చేసింది. ఇప్పటి వరకు సింగపూర్‌కు విమాన సర్వీసు అనేది లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఈ సర్వీసును పునరుద్ధరిస్తారన్న చర్చ సాగింది. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో అక్కడి వారు విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డైరెక్ట్ విమానాలను నడపాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ సర్వీసుపై మళ్లీ ఆశలు ఏర్పడ్డాయి.