మరువని విలయం
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:43 AM
2024, ఆగస్టు 31 అర్ధరాత్రి.. తెల్లవారితే సెప్టెంబరు 1.. అందరికీ కేవలం నెల మాత్రమే మారితే, విజయవాడ వాసుల జీవితాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. బుడమేరు సృష్టించిన బీభత్సానికి విజయవాడలోని 50 శాతం ప్రాంతంతో పాటు రూరల్ మండలాలు, మైలవరంలోని ప్రాంతాలు నీటమునిగిపోయాయి. 4.5 లక్షల మంది ప్రజలు నిలువనీడ లేకుండాపోయారు. రూ.కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తినడానికి తిండిలేక, కట్టుకునేందుకు దుస్తులులేక సుమారు 15 రోజుల పాటు నరకయాతన అనుభవించారు. ప్రభుత్వం అందించిన సాయం, దాతల దాతృత్వం కాస్త చేయూతనిచ్చినా.. ఈ విలయానికి నేటికీ కోలుకోని అభాగ్యులెందరో ఉన్నారు. అందుకే.. చిన్నపాటి వర్షానికి కూడా బుడమేరు ఎప్పుడొస్తుందోనని బెజవాడవాసులు నేటికీ భయంతోనే బిక్కుబిక్కుమంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన రోజులు పునరావృత్తం కాకుండా ఉండాలన్నా.. బెజవాడవాసుల భయం తొలగిపోవాలన్నా.. బుడమేరు వరద నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. బుడమేరు జల ప్రళయానికి నేటికి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేక కథనం..
బుడమేరు వరద బీభత్సానికి ఏడాది
బెజవాడ సహా రూరల్ ప్రాంతాలు నీటమునక
4.5 లక్షల మందిపై ముంపు ప్రభావం.. రూ.కోట్లలో నష్టం
ఇళ్లు నీటమునిగి సర్వం కోల్పోయిన వారెందరో..
షాపులు, గోడౌన్లు నాశనమై నష్టపోయిన వారెందరో..
ఏడాది అవుతున్నా నేటికీ బుడమేరు అంటేనే ఓ భయం
వర్షం వస్తే వరద వస్తుందేమోననే వణుకు
వెలగలేరు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కాస్త ఉపశమనం
శాశ్వత పరిష్కారం చూపించాలంటున్న బెజవాడవాసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ఇబ్రహీంపట్నం) : 1964 నాటి వరద బీభత్సాన్ని గుర్తుచేస్తూ సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 2024, సెప్టెంబరు 1న బుడమేరు మహోగ్రరూపం దాల్చి బెజవాడను ముంచేసింది. మైలవరంతో పాటు విజయవాడ రూరల్ గ్రామాల్లోకి పరుగులు పెట్టింది. గత ఏడాది ఆగస్టు 31 రాత్రి సుమారు 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పాటు కొండవాగు, కోతులవాగు, పులివాగుతో పాటు అనేక వాగులు పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు సుమారు 40 వేల క్యూసెక్కుల వరద చేరింది. రెగ్యులేటర్ గేట్ల పైనుంచి వరద ప్రవహించింది. ఈ దశలో రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద మళ్లింపు కాల్వకు (బీడీసీ)కు సుమారు 3.9 కిలోమీటర్ దగ్గర 200 మీటర్ల మేర మూడు భారీగండ్లు పడ్డాయి. మరోపక్క కృష్ణానదికి ఎగువ నుంచి వచ్చిన వరద పోటెత్తడంతో బీడీసీ ద్వారా నదిలోకి వెళ్లాల్సిన బుడమేరు వరద వెనక్కి ఎగదన్నింది. గండ్ల ద్వారా వరద మొత్తం విజయవాడ పల్లపు ప్రాంతాలతో పాటు మైలవరం, విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలను ముంచెత్తింది. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది పశువులు నీటిలోనే మునిగిపోయాయి. రూ.కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. సర్వం కోల్పోయి రోడ్డును పడినవారు.. ఇప్పటికి కోలోకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారు.
రిటైనింగ్ వాల్‌తో కాస్త ఉపశమనం
సెప్టెంబరులో ఒకేరోజు 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో బుడమేరుకు 40 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పొంగి ప్రవహించింది. గేట్లు ఎత్తే లోగానే అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల వద్ద బీడీసీ ఎడమ కట్టకు మూడుచోట్ల భారీగండ్లు పడటం, బెజవాడ పల్లపు ప్రాంతాలను ముంచెత్తడం జరిగిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం స్పందించింది. బుడమేరు మిగిల్చిన గాయాలకు కాయకల్ప చికిత్స చేసింది. గండ్లు పడిన ప్రదేశం దగ్గర రూ.23 కోట్లతో రిటైనింగ్ వాల్ పూర్తిచేసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌కు మరమ్మతులు చేయించింది. అయితే చర్యలు తాత్కాలికమే కాగా, శాశ్వత ప్రాతిపదికన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
శాశ్వత పరిష్కారం అవసరం
బుడమేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభించాలంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దిగువ భాగం నుంచి ఎనికేపాడు యూటీ వరకూ ఇప్పుడున్న కాల్వకు సమాంతరంగా మరో 25 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయంగా మరో కాల్వ తవ్వాలి. ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 4 వేల క్యూసెక్కుల నుంచి 20 వేల క్యూసెక్కులకు పెంచాలి. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రెయిన్ నీరు సముద్రంలోకి పోయేలా డీసిల్టింగ్ పనులు చేయాలి. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవునా బుడమేరు డ్రెయినేజీ పూడిక తీయాలి. ఇందుకు రూ.5,800 కోట్ల నిధులు కావాలని జలవనరుల శాఖ అధికారులు డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి పంపారు.