Share News

విస్తరణ వివాదం

ABN , Publish Date - Jun 15 , 2025 | 01:03 AM

హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారి విస్తరణ అలైన్‌మెంట్‌లో వివాదాలు అలముకున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 20 కిలోమీటర్లకే విస్తరణను పరిమితం చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. గొల్లపూడి వరకు విస్తరణ జరగాలని ఆయన పట్టుబట్టారు.

విస్తరణ వివాదం

ఎన్‌హెచ్‌-65 విస్తరణ అలైన్‌మెంట్‌పై అభ్యంతరం

జిల్లాలో విస్తరణను కుదించేలా తెలంగాణ ఎన్‌హెచ్‌ ప్లాన్‌

అభ్యంతరం వ్యక్తంచేసిన ఎంపీ కేశినేని శివనాథ్‌

గొల్లపూడి వరకు విస్తరించాల్సిందేనని పట్టు

పశ్చిమ బైపాస్‌కు కలపాలని స్పష్టీకరణ

ఎన్‌హెచ్‌ అధికారులతో ఎంపీ అత్యవసర సమావేశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారి విస్తరణలో వివాదం తలెత్తింది. ఈ జాతీయ రహదారిని ఆరు వరసలుగా విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన డీపీఆర్‌ కూడా హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌ అధికారులు రూపొందిస్తున్నారు. ఈ డీపీఆర్‌లో ఎన్టీఆర్‌ జిల్లాలో తెలంగాణ ఎన్‌హెచ్‌ అధికారులు భారీగా కొత పెట్టారు. ఈ జాతీయ రహదారిని అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఆరు వరసలుగా విస్తరించనున్నట్టు చెప్పారు. దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌-65ను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించటం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఇదేమి అమరావతి-హైదరాబాద్‌ రోడ్డు కాదని, దానికి వేరే ప్రణాళికలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌-విజయవాడ విస్తరణ పనులను గొల్లపూడి నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఈ మేరకు డీపీఆర్‌ రూపొందించాలంటున్నారు. ఈ అంశాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

ఎన్‌హెచ్‌ అధికారులతో సమావేశం

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు సంబంధించి విజయవాడ వేదికగా శుక్రవారం ఎన్‌హెచ్‌ అధికారులతో ఎంపీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించడమే సబబు అనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. వాస్తవానికి గొల్లపూడి మైలురాయి సెంటర్‌ వరకు ఆరు వరుసలుగా విస్తరిస్తేనే బాగుంటుంది. అలాగే, గొల్లపూడి మీదుగా వెళ్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ (ఎన్‌హెచ్‌-16)కు కచ్చితంగా అనుసంధానం చేయాల్సిందే. దీనిద్వారా హైదరాబాద్‌-విజయవాడకు అనుసంధానంతో పాటు హైదరాబాద్‌-విశాఖ, హైదరాబాద్‌-చెన్నై మార్గాన్ని కూడా అనుసంధానించవచ్చు. కానీ, తెలంగాణా రాష్ట్ర ఎన్‌హెచ్‌ అధికారులు విజయవాడ ప్రయోజనాలను కాదని, తెలంగాణా ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. దీంతో ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్‌హెచ్‌-65 ఆరు వరుసల రోడ్డు విస్తరణ అసమగ్రంగా మారింది. డీపీఆర్‌ దశలోనే అలైన్‌మెంట్‌ లోపాలను గుర్తించటం వల్ల సమస్యను పరిష్కరించుకునే మార్గం ఏర్పడింది.

గుంటుపల్లి వద్ద బైపాస్‌ ప్రతిపాదన.. తిరస్కరణ

హైదరాబాద్‌-విజయవాడ అలైన్‌మెంట్‌ను గొల్లపూడి వరకు విస్తరిస్తే గుంటుపల్లి వద్ద బైపాస్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ఎన్‌హెచ్‌ అధికారులు తీసుకురాగా, దీనికి ఎంపీ కేశినేని శివనాథ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బైపాస్‌ అవసరం లేదని, ఉన్న రోడ్డునే ఆరు వరుసలుగా గొల్లపూడి వరకు విస్తరించాలని పట్టుబట్టారు.

ఇబ్రహీంపట్నం ఎగువన బైపాస్‌లు

ఎన్‌హెచ్‌-65 విస్తరణకు సంబంధించి పాత డీపీఆర్‌లో ఇబ్రహీంపట్నం దిగువ వరకు నిర్దేశించిన బైపాస్‌లను యథాతథంగా కొత్త డీపీఆర్‌ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను సమావేశంలో లేవనెత్తారు. దీంతో పాత డీపీఆర్‌లో ఐతవరం, పరిటాల తదితర ప్రాంతాల్లో ప్రతిపాదిత బైపాస్‌ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలియజేశారు.

ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో ఫ్లై ఓవర్‌

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ సమస్యగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఫ్లై ఓవర్‌ ఇబ్రహీంపట్నం శివారు నుంచి ప్రారంభమై వీటీపీఎస్‌ కాల్వ ఎగువన దిగుతుంది. ఈ ఫ్లై ఓవర్‌ను టీ ఆకారంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్‌గడ్‌కు ఎన్‌హెచ్‌-30 కూడా అనుసంధానం అవుతుంది కాబట్టి, సర్కిల్‌ నుంచి కొండపల్లి వైపు ఫ్లై ఓవర్‌కు ఒక దారి ఇవ్వాలని నిర్ణయించారు.

ముందే అప్రమత్తమయ్యాం..

మాకు ఈ విషయం చివరి నిమిషంలో తెలిసింది. మొదట్లో అనుకున్న డీపీఆర్‌ గొల్లపూడి వరకు ఉంది. తర్వాత అలైన్‌మెంట్‌ మారింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే కలెక్టర్‌ లక్ష్మీశతో మాట్లాడాను. వెంటనే సమావేశం ఏర్పాటు చేయించాం. ఈ సమావేశంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 20 కిలోమీటర్ల వరకే పరిమితం చేయాలనుకున్న దానిని మేము అంగీకరించలేదు. గొల్లపూడి వరకు పొడిగించాల్సిందేనని గట్టిగానే చెప్పాం. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రజల సమస్య కాబట్టి గట్టిగా పోరాడతాం. గొల్లపూడి వరకు అనుసంధానం చేసే వరకు కృషి చేస్తాం. - కేశినేని శివనాథ్‌, విజయవాడ ఎంపీ

Updated Date - Jun 15 , 2025 | 01:03 AM