నిర్లక్ష్యంపై చర్యలు
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:52 AM
దుర్గగుడిలో శానిటేషన్ కాంట్రాక్టర్‌కు రూ.25 వేలు, భక్తుల వాహనాలు పార్కింగ్, టోల్‌గేట్ కాంట్రాక్టు పొందిన వీఎల్‌డీ ఏజెన్సీకి రూ.25 వేలు జరిమానా విధిస్తూ ఈవో శీనానాయక్ నోటీసులు జారీ చేశారు.
దుర్గగుడిలో శానిటేషన్, పార్కింగ్ కాంట్రాక్టర్లకు నోటీసులు
ఇద్దరికీ రూ.25 వేల చొప్పున జరిమానా
మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం వల్లే..
వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్లే..
తక్షణం వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ఇంద్రకీలాద్రి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : దుర్గగుడిలో శానిటేషన్ కాంట్రాక్టర్‌కు రూ.25 వేలు, భక్తుల వాహనాలు పార్కింగ్, టోల్‌గేట్ కాంట్రాక్టు పొందిన వీఎల్‌డీ ఏజెన్సీకి రూ.25 వేలు జరిమానా విధిస్తూ ఈవో శీనానాయక్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ ఆదివారం తాను పరిశీలనలో ఉన్నప్పుడు ఘాట్‌రోడ్డులోని రెండో టర్నింగ్ వద్ద వాష్‌రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయని, బాధ్యత లేకుండా వ్యవహరించారని, ఆదివారం భక్తులు అధికంగా వస్తారన్న విషయం తెలుసుకోవాలని నోటీసులో శానిటేషన్ కాంట్రాక్టర్‌కు సూచించారు. తొలిసారిగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని, ఇకపై ఎటువంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలని, లేదంటే బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. నోటీసు అందిన వారంలో జరిమానా చెల్లించాలని, మూడు పనిదినాల్లో వివరణ ఇవ్వాలన్నారు. అలాగే, పార్కింగ్ సౌకర్యం, టోల్‌గేట్ల కాంట్రాక్టు దక్కించుకున్న వీఎల్‌డీ కాంట్రాక్టర్లకు కూడా ఈవో నోటీసు ఇచ్చారు. ఈ నెల 15 ఆదివారం తాను పరిశీలనలో ఉన్నప్పుడు భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని, పార్కింగ్ సౌకర్యాలు ఏమాత్రం బాగా లేవని, పార్కింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు తగినంతమంది సిబ్బంది లేరని తెలిపారని నోటీసులో పేర్కొన్నారు. భక్తులు నడిచే మార్గాల్లో వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపేస్తున్నారని, వేలంపాట సమయంలో పేర్కొన్న నిబంధనలను అతిక్రమించారన్నారు. రూ.25 వేల జరిమానాను ఏడు పనిదినాల్లో చెల్లించాలన్నారు. మూడు రోజుల లోపల తగిన వివరణ ఇవ్వాలన్నారు.