చింతలపూడి ఎత్తిపోతలకు తగినన్ని నిధుల కేటాయించలేదు : సీపీఐ
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:02 AM
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం శోచనీయం అని సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు.

తిరువూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం శోచనీయం అని సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతలపూడికి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.30 కోట్లు పాడైన లాకులు మరమ్మతులకే సరిపోదన్నారు. ఈ పథకాన్ని సత్వరం పూర్తిచేయాలని సీపీఐ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి దేవినేని ఉమా ఎత్తిపోతల పథకం అద్భుతంగా పూర్తి అవుతుందని రైతలు, ప్రజల్ని మఽభ్యపెట్టారని విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సమస్యల్ని ప్రస్తావిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో గళం విప్పడం లేదని అన్నారు. పట్టణ శివారు పీటీ కొత్తూరులో నిర్మించిన టిడ్కో గృహాలు శిథిలావస్థకు చేరుతున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. కాకర్ల శివారులో వ్యవసాయాధారిత అటవీ భూములు ఉన్నాయని, ఆ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తూము కృష్ణయ్య, షేక్ నాగుల్‌మీరా పాల్గొన్నారు.