ఫ్లై ‘ఓవర్’
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:07 AM
నిడమానూరు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు జాతీయ రహదారుల సంస్థ మంగళం పాడేసింది. ఎన్‌హెచ్ విజయవాడ డివిజన్ అధికారులు పంపిన డీపీఆర్‌ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) తిరస్కరించింది. విజయవాడ వెస్ట్ బైపాస్ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నిడమానూరు ఫ్లై ఓవర్ అవసరం లేదని నిర్ణయించింది. ఈ కారణంగా ఆ ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు డీపీఆర్‌ను పంపడంలో జరిగిన జాప్యం, మెట్రోరైల్ కారిడార్‌తో లింకుపెట్టడం వంటి చర్యలు కాలాతీతానికి దారితీశాయి. ఈలోపు విజయవాడ వెస్ట్ బైపాస్ తుదిదశకు చేరుకోవడంతో మోర్త్ తన ఆలోచనను మార్చుకుని ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది.
నిడమానూరు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ రద్దు
కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తిరస్కరణ
డీపీఆర్ పూర్తయినా కాలయాపన జరగడం వల్లే..
మెట్రోరైల్ కారణంగా ఏపీఎంఆర్‌సీ కాలాతీతం
పశ్చిమ బైపాస్ పూర్తికావడం కూడా ఓ సాకే..
కేంద్రానికి తిరిగి ప్రతిపాదనలు పంపుతాం.. ఎంపీ కేశినేని చిన్ని
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరానికి మంజూరైన నిడమానూరు ఫ్లైఓవర్ అతిపెద్దది. ఇప్పటి వరకు విజయవాడలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్, మిల్క్‌ఫ్యాక్టరీ, కనకదుర్గ, బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ కంటే ఇదే పెద్దది. నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. డీపీఆర్ కూడా పూర్తయింది. టెండర్లు పిలవాల్సిన దశలో మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా కాలాతీతం జరిగింది. మెట్రో కారిడార్‌కు ఇబ్బంది అవుతుందన్న దృష్ట్యా ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ నుంచి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ వేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలంటే రూ.1,000 కోట్లు అవుతుందని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) డీపీఆర్ తయారు చేయించి మోర్త్‌కు పంపించింది. ఏపీఎంఆర్‌సీ రూపొందించిన డీపీఆర్ ప్రకారం ఏడు కిలోమీటర్ల మేర సెంట్రల్ మీడియం ఫ్లై ఓవర్‌లో నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 4.50 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. డీపీఆర్ తయారుచేయడం కోసం ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఐదు నెలల సమయం తీసుకుంది. ఈ సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ తుదిదశకు చేరుకుంది. పశ్చిమ బైపాస్ ప్రారంభమైతే నిడమానూరు ఫ్లై ఓవర్ అవసరం లేదని మోర్త్ భావించడంతో ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న నిడమానూరు ఫ్లై ఓవర్ కల చెదిరింది.
మళ్లీ ప్రతిపాదనలకు ఎంపీ చిన్ని ప్రయత్నాలు
నిడమానూరు ఫ్లై ఓవర్ ప్రతిపాదన మళ్లీ చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నిర్ణయించారు. వెస్ట్ బైపాస్ వచ్చినప్పటికీ.. నగరంలో ఉన్న అంతర్గత ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు దాదాపు పెద్దవి, చిన్నవి కలిపి 12 జంక్షన్లు ఉన్నాయి. ఈ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా నిలిచిపోతోంది. నిడమానూరు నుంచి నగరంలోకి చేరుకోవాలంటే అరగంట, ఒక్కోసారి గంట వరకు సమయం పడుతోంది. ఇదే మార్గంలో జవహర్ ఆటోనగర్, కానూరు ఆటోనగర్ ఉన్నాయి. ఈ ఆటోనగర్‌లలోకి భారీ వాహనాలు చేరుకోవాలంటే ఎన్‌హెచ్-16 మీదుగా నిర్దేశించిన నాలుగు మార్గాల్లో రాకపోకలు సాగించాలి. ఈ కారణంగా కూడా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. విజయవాడకు ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన కూడా రద్దైంది. అటు వెళ్లాల్సిన ట్రాఫిక్ కూడా విజయవాడ మీదుగానే వెళ్తోంది. దీంతో పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఏమాత్రం తగ్గదని విజయవాడ ఎంపీ భావిస్తున్నారు. ఈ కారణంగా నిడమానూరు ఫ్లైఓవర్‌ను తిరిగి సాకారం చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరోమారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో చర్చించాలని భావిస్తున్నారు.