Share News

ఇదేం డీపీఆర్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:56 AM

అనుకున్నదే అయ్యింది. ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్టు విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌-65 ఆరు వరసల విస్తరణ డీపీఆర్‌ గందరగోళంగా తయారైంది. కన్సల్టెన్సీ నివేదించిన అంశాలు రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు ఆగ్రహం తెప్పించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.2,500 కోట్ల నిధులు కేటాయిస్తే రూ.1,000 కోట్లకు డీపీఆర్‌ తయారు చేస్తారా? అంటూ సదరు సంస్థపై మండిపడ్డారు.

ఇదేం డీపీఆర్‌
సమావేశంలో పాల్గొన్న రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు

గందరగోళంగా ఎన్‌హెచ్‌-65 ఆరు వరసల విస్తరణ డీపీఆర్‌

కన్సల్టెన్సీపై రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆగ్రహం

డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉండాల్సిందేనని పట్టు

అనుసంధానిత రోడ్ల విస్తరణకూ ప్రతిపాదన

ఫోన్‌లో ఎంపీల దృష్టికి.. వారు కూడా తిరస్కరణ

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌-65 ఆరు వరసల విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌పై రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారుల నేతృత్వంలో రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో బుధవారం నగరంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీతో పాటు ఎన్‌హెచ్‌-65 పరిధిలోని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా పాల్గొన్నారు. ముందుగా కన్సల్టెన్సీ సంస్థ రూ.1,000 కోట్లతో కూడిన ప్రాజెక్టు నివేదికను సమావేశంలో ప్రజెంటేషన్‌ చేసి చూపించింది. ఆసాంతం విన్న ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంజిసర్కిల్‌ నుంచి పెనమలూరు వరకు ఎలాంటి వీయూపీలు లేకుండా ప్రతిపాదించటంపై బోడె, గద్దె ప్రశ్నించారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఎందుకు ప్రతిపాదించలేదన్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్‌ కారిడార్‌ లేకపోతే ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. పెనమలూరు సెంటర్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా మెట్రో కారిడార్‌-2 వెళ్తుందని, దీనికి సంబంధించిన అధికారులతో చర్చలు జరిపారా? అని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా, లేదని కన్సల్టెన్సీ సంస్థ చెప్పింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు.. మెట్రోను కూడా దృష్టిలో పెట్టుకుని డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. ఎంపీలు కేశినేని శివనాథ్‌, వల్లభనేని బాలశౌరికి ఫోన్‌ చేసిన విషయాన్ని తెలిపారు. దీంతో ఇద్దరు ఎంపీలూ డీ పీఆర్‌ను తిరస్కరించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా తన నియోజకవర్గం పరిధిలో సబ్‌వే, వీయూపీల గురించి చెప్పారు.

కలెక్టర్ల అసహనం

డీపీఆర్‌పై కలెక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ మెట్రో అధికారులతో కలిసి మూడు రకాల డిజైన్లను సిద్ధం చేయాలని సూచించారు. బెంజిసర్కిల్‌ నుంచి చిన ఓగిరాల వరకు ఉన్న ట్రాఫిక్‌ సమస్యలపై దృష్టి సారించలేదని, వీయూపీలు తక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మాట్లాడుతూ విజయవాడ నగర, శివారు ప్రాంతాలతో పాటు భవిష్యత్తులో పోర్టు ట్రాఫిక్‌ మరింత పెరగబోతోందని, ఇలాంటపుడు ఎలివే టెడ్‌ కారిడార్‌ మాత్రమే పరిష్కారమన్నారు.

బెంజిసర్కిల్‌ వరకు విస్తరించాల్సిందే..

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) హద్దుగా ఎన్‌హెచ్‌-65 విస్తరణకు డీపీఆర్‌ను తయారు చేయటంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో వచ్చే ఓఆర్‌ఆర్‌ కోసం విజయవాడ ప్రజలను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ ప్రాతిపదికగా కాకుండా బెంజిసర్కిల్‌ వరకు కూడా విస్తరించాల్సిందేనని పట్టుబట్టారు.

అనుసంధానిత రోడ్లు కూడా విస్తరించండి

ఎన్‌హెచ్‌-65, 16ను అనుసంధానించే రోడ్లు మూడు ఉన్నాయని, వాటిని కూడా ఇదే డీపీఆర్‌లోకి తీసుకొచ్చి విస్తరించేందుకు ప్రతిపాదించాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఆటోనగర్‌ బస్‌ టెర్మినల్‌ రోడ్డు ఎన్‌హెచ్‌-16, 65ను కలుపుతుందని, ఈ రోడ్డును కూడా ఎన్‌హెచ్‌ పరిధిలోకి చేర్చి విస్తరించాలని సూచించారు. ఎనికేపాడు-తాడిగడప 100 అడుగల రోడ్డును, కంకిపాడు-కేసరపల్లి రోడ్డును కూడా విస్తరించేలా తుది డీపీఆర్‌ ఉండాలని సూచించారు. వీటి అభివృద్ధికి భూములను ప్రత్యేకంగా చేర్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ పీడీ విద్యాసాగర్‌, కృష్ణా జేసీ నవీన్‌, ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వో లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, మెట్రో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:56 AM