కలిసికట్టుగా..
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:59 AM
16వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు సంయుక్త డీపీఆర్ తయారుకానుంది.

నిడమానూరు-రామవరప్పాడు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
నిడమానూరు-మహానాడు 4 వరసల ఫ్లైఓవర్
సంయుక్త డీపీఆర్‌కు ఎన్‌హెచ్, మెట్రో శ్రీకారం
మొత్తంగా రూ.150 కోట్లు ఆదా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 16వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మించే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు సంయుక్త డీపీఆర్ తయారుకానుంది. ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) రూ.600 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించే నాలుగు వరసల సింగిల్ ఫ్లై ఓవర్‌కు, మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు 4.7 కిలోమీటర్ల మేర రూ.500 కోట్లతో నిర్మించే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు డీపీఆర్‌లను వేర్వేరుగా తయారు చేశాయి. కానీ, ఫ్లై ఓవర్, మెట్రో ఎలివేటెడ్ కారిడార్స్ రెండూ వేర్వేరుగా ఎన్‌హెచ్ అభివృద్ధి చేయటం సాధ్యం కాదు కాబట్టి మెట్రో కారిడార్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఎన్‌హెచ్, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు డబుల్ డెక్కర్ ప్రతిపాదనకు అంగీకరించారు. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ఏపీఎంఆర్‌సీ నుంచి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు)కు ప్రతిపాదనలు అందాయి. ప్రస్తుతం ఈ అంశం మోర్తు దగ్గర పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి గడ్కరీ మధ్య ఈ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా మోర్తు నుంచి అధికారికంగా అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఇక ఆలస్యం కాకుండా ఉండేందుకు కంబైన్డ్ డీపీఆర్ తయారు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీఎంఆర్‌సీ అధికారులే కంబైన్డ్ డీపీఆర్‌ను తయారు చేయించాలని నిర్ణయించారు. బాలాజీ రైల్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం కంబైన్డ్ డీపీఆర్‌కు రూపకల్పన జరుగుతోంది.
బహుళ ప్రయోజనమే..
డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ వల్ల ఎన్‌హెచ్, మెట్రో అధికారులకు వ్యయం తగ్గుతుంది. నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్ నిర్మించాలనుకున్న 4 వరసల ఫ్లై ఓవర్‌కు రూ.600 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అదే మెట్రో కారిడార్‌తో సంయుక్తంగా చేపట్టడం వల్ల ఎన్‌హెచ్‌కు రూ.100 కోట్ల మేర ఆదా అవుతుంది. అలాగే, నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మించే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు కూడా ఖర్చు తగ్గుతుంది. రూ.500 కోట్లు అంచనా వ్యయం కాగా, రూ.50 కోట్ల మేర తగ్గుతుంది.
డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఏపీఎంఆర్‌సీదే..
డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మాత్రమే చేపట్టనుంది. తామే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. నాలుగు వరసల ఫ్లై ఓవర్‌పై మెట్రో ఎలివేటెడ్ కారిడార్ వస్తున్న నేపథ్యంలో భూగర్భ పిల్లర్లను ఆ స్థాయిలో నిర్మించాల్సి ఉంటుంది.