‘మద్యం’తరంగా..
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:59 AM
అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ప్రభావం కొత్త విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటికే మద్యం అమ్మకాల్లో పారదర్శకత కోసంప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. తాజాగా నో క్రాసింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
నకిలీ మద్యం ఉదంతంతో ఎక్సైజ్ కొత్త నిబంధనలు
జిల్లాలో ఎక్కడి మద్యం అమ్మకాలు అక్కడే
మరెక్కడికీ తరలించకూడదని ఆదేశాలు
వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ స్పష్టీకరణ
ఆంధ్రజ్యోతి-విజయవాడ : బార్, మద్యం దుకాణం ఒకే వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఒకచోట సరుకును మరోచోటకు మార్చుకుంటారు. ఇక నుంచి ఆ విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని అధికారుల నుంచి వ్యాపారులకు ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించి అన్ని మద్యం దుకాణాలు, బార్‌లకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని సిద్ధం చేశారు. అదేవిధంగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 183 బార్‌లకు నోటిఫికేషన్ ఇవ్వగా, 118 బార్‌లను కేటాయించారు. ఇవికాకుండా 261 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో కొంతమంది వ్యాపారులు భాగస్వాములుగా ఏర్పడి సంయుక్తంగా మద్యం దుకాణాలు, బార్‌లను దక్కించుకున్నారు.
ఇప్పటివరకు జరిగింది ఇది..
వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి మద్యం దుకాణాలను, బార్‌లను దక్కించుకోవడం ఎప్పటినుంచో జరుగుతోంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని వివిధ ప్రాంతాల్లో బార్‌లు, మద్యం దుకాణాలను సిండికేట్‌లో ఉన్న సభ్యులు తీసుకుం టారు. బార్ ఒకరి పేరున ఉంటే, మద్యం దుకాణం మరొకరి పేరున ఉంటుంది. లైసెన్స్ ఒకరి పేరుతో ఉన్నప్పటికీ సిండికేట్‌లో ఉన్నవారంతా వాటికి యజమా నులుగా ఉంటారు. బార్, మద్యం షాపులకు అవసరమైన సరుకును డిపోల నుంచి కొంటారు. దీనికయ్యే ఖర్చును భాగస్వాము లంతా సమానంగా భరిస్తారు. వచ్చిన లాభాలను పెట్టుబడిని బట్టి పంచుకుంటారు. బార్, మద్యం దుకాణం ఒకే వ్యక్తి పేరుతో ఉన్నప్పుడు రెండింటికీ ఒకరే యజమానిగా ఉంటారు. మద్యం దుకాణంలో సరుకు నిండుకుంటే ఆ బ్రాండ్‌లను బార్ నుంచి రప్పించుకుని విక్రయించుకుంటు న్నారు. ఈ సరుకును మొత్తం కొన్న వ్యాపారి ఒకరే కాబట్టి ఒకచోట సరుకును మరోచోటకు తరలించుకుంటారు. తనిఖీల సమయంలో ప్రశ్నించినా ఇదే విషయం చెప్పేవారు.
ఇక అలా కుదరదు
ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈవిధంగా ఒకచోట సరుకును మరోచోటకు తరలించడం నిలుపుదల చేయాలని అధికారులు నిర్ణయిం చారు. ఈ విధానంలోనూ అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి 2014-19 వరకు మద్యం సరుకుపై నిఘా, ట్రాకింగ్ ఉండేది. ఇదంతా ఆన్‌లైన్‌లో అధికారులకు తెలిసిపోయేది. మద్యం దుకాణం, బార్‌లో రోజుకు ఎంతెంత అమ్మకాలు జరుగుతున్నాయి, ఏ సమయంలో ఎంతెంత మద్యం అమ్ముతున్నారు.. అనే వివరాలు స్పష్టంగా ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిఘా నిద్దరపోయింది. ట్రాకింగ్‌కు ట్రాక్ లేకుండాపోయింది. అద్దేపల్లి జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి పూనుకోవ డానికి ఈవిధానం ఒక కారణంగా అధికారులు భావిస్తున్నారు. మద్యం షాపు, బార్ ఒకరి ఆధ్వర్యంలోనే నడుస్తున్నా సరకు మార్పిడికి మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఈవిధంగా జరిగితే సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.