Share News

కిక్కు ఎక్కేలా.. ఫార్ములా

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:59 AM

మద్యం తయారీలో బ్రాందీకి ఒక ఫార్ములా ఉంటుంది. విస్కీకి మరో ఫార్ములా ఉంటుంది. రమ్ముకు ఇంకో ఫార్ములా ఉంటుంది. ప్రభుత్వ అనుమతితో నిర్వహించే ప్రతి డిస్టిలరీలో తయారయ్యే మద్యానికి ఈ సూత్రం వర్తిస్తుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ములకలచెరువులో..

కిక్కు ఎక్కేలా.. ఫార్ములా

  • సరికొత్తగా నకిలీ మద్యం తయారీ

  • నిందితుడు జనార్దనరావుకు సహకరించిన కొత్త ఫ్రెండ్‌

  • చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీతో గోవాలో బంధం

  • బెంగళూరు డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవం

  • మద్యం తయారీ ఫార్ములా చెప్పాలన్న జనార్దనరావు

  • నిరాకరించిన బాలాజీ.. తానే చేసి ఇస్తానని హామీ

  • ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో

  • మద్యం తయారుచేసింది అతనే..

  • అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు చెల్లింపు.. అమ్మకాల్లో కమీషన్‌

  • నకిలీ వ్యవహారం బయటపడటంతో అజ్ఞాతంలోకి..

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు సొంతంగానే మద్యం తయారు చేయాలని భావించాడు. ఇందుకోసం చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ వద్ద ఉన్న ఫార్ములా చెప్పాలని కోరాడు. దీనికి బాలాజీ ససేమిరా అనడంతో జనార్దనరావుకు మరో మార్గం కనిపించలేదు. బాలాజీ బెంగళూరులోని పలు డిస్టిలరీల్లో పనిచేశాడు. తర్వాత తన ప్రస్థానాన్ని గోవాకు మార్చుకున్నాడు. అక్కడా కొన్ని డిస్టిలరీల్లో పనిచేశాడు. సుదీర్ఘకాలంపాటు డిస్టిలరీల్లో పనిచేయడంతో అందులో ఉపయోగించే ఫార్ములాలను పసిగట్టాడు. ఏరకం మద్యం తయారీకి ఏ ఫార్ములా ఉపయోగించాలన్న దానిపై మంచి పట్టు సాధించాడు. తర్వాత డిస్టిలరీల నుంచి బయటకు వచ్చి గోవాలో లిక్కర్‌ హబ్‌లను నిర్వహించే స్థాయికి వెళ్లాడు.


గోవాలో కలిసిన చేతులు

వాస్తవానికి జనార్దనరావుకు, బాలాజీకి ఎలాంటి సంబంధం లేదు. జనార్దనరావు తెలంగాణాలో ఈ7 పేరుతో కొంతమంది భాగస్వాములను కూడగట్టుకుని బార్‌కు లైసెన్స్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ద్వారా బాలాజీకి జనార్దనరావు టచ్‌లోకి వెళ్లాడు. బార్‌లో భాగస్వాములతో కలిసి గోవా వెళ్లిన జనార్దనరావు అక్కడ బాలాజీని కలిశాడు. బాలాజీ చేస్తున్న మద్యం వ్యాపారం చూసిన జనార్దనరావుకు ఆశలు అమాంతంగా పెరిగాయి. ప్రీమియర్‌ బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తానని బాలాజీ అతడికి ఆఫర్‌ ఇచ్చాడు. దీన్ని మరోలా ఉపయోగించుకోవాలని జనార్దనరావు భావించాడు. తర్వాత పలుమార్లు గోవాకు ఒంటరిగా వెళ్లిన జనార్దనరావు అతడిని మాత్రమే కలిసేవాడు. ఈ సందర్భంలో బాలాజీకి డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవం ఉందన్న విషయాన్ని గ్రహించాడు. మద్యం తయారీకి ఉపయోగించే ఫార్ములాను చెప్పాలని జనార్దనరావు అడిగాడు. తన వద్ద ఉన్న ఫార్ములా జనార్దనరావు చేతుల్లోకి వెళ్తే మొదటికే మోసం వస్తుందని భావించిన బాలాజీ దానికి అంగీకరించలేదు.


మద్యం తయారీ ఎక్కడ చేసినా తాను స్వయంగా వచ్చి ముడి సరకులతో మిశ్రమం చేసి ఇస్తానని చెప్పాడు. ఫార్ములా మాత్రం ఇవ్వనని స్పష్టం చేశాడు. ఇక్కడే జనార్దనరావు వ్యూహం బెడిసికొట్టింది. మద్యం వ్యాపారంలో బాలాజీకి ఉన్న అనుభవంతో అతడితో మంచి సంబంధాలు నడిపాడు. ఫార్ములా చేతికొచ్చాక బాలాజీని వదిలించుకుందామనుకున్నాడు. బాలాజీ మాత్రం ఫార్ములా తప్ప ఏదైనా అడగమనడంతో జనార్దనరావుకు దిక్కుతోచలేదు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో ఉన్న అనధికార డిస్టిలరీల్లో బాలాజీ తన వద్ద ఉన్న ఫార్ములా ప్రకారమే మద్యం తయారు చేసి ఇచ్చాడు. ఈ మిశ్రమం చేసేటప్పుడు తాను మాత్రమే ఉండేవాడు. సహాయకులుగా ఇద్దరు, ముగ్గురిని ఉంచుకునేవాడు. ఇలా సీసాల్లో పోయడానికి వీలుగా మద్యం తయారు చేయడానికి బాలాజీ అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు తీసుకున్నాడు. తర్వాత విక్రయించిన సరుకులో ఒక్కో సీసాకు పైసల లెక్కన కొంత కమీషన్‌ తీసుకున్నట్టు తెలిసింది.


బాలాజీ ఎక్కడ?

నకిలీ మద్యం తయారీకి సొంత ఫార్ములాను ఉపయోగించిన బాలాజీ కోసం ఎక్సైజ్‌ పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చాక అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో పోలీసులు నిఘా పెట్టారు. బెంగళూరు కేంద్రంగా స్పిరిట్‌, కార్మెల్‌, ఇతర ముడిసరుకులు విక్రయించే వ్యాపారులతో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అతడు ఫోన్‌చేసి చెప్తే సరుకును పంపే వ్యాపారులు ఉన్నారు. నకిలీ మద్యం తయారీలో ఉపయోగించిన ముడి సరకు మొత్తం బెంగళూరు నుంచి వచ్చిందని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

Updated Date - Oct 18 , 2025 | 02:09 PM