Share News

పేర్ని నాని.. జంప్‌ జిలానీ..

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:50 AM

‘కన్ను కొడితే చీకట్లో నరికెయ్యండి..’ అంటూ రెచ్చిపోయిన వైసీపీ నేత పేర్ని నాని కనిపించకుండా పోయారు. ‘మహా అయితే అరెస్టు చేస్తారు.. నాలుగు రోజులు జైల్లో ఉంటాను.. ఏమవుతుంది?’ అని బీరాలు పలికిన మాజీమంత్రి అదృశ్యమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన ఆయనపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావటం, విచారణ జరుగుతుండటంతో తోకముడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 పేర్ని నాని.. జంప్‌ జిలానీ..

వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయి.. కనిపించకుండా పారిపోయి..

మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లారా?

వైసీపీ అధిష్ఠానం అండ ఉండటం వల్లే..

పోలీసులు విచారణ చేపడుతుండటంతో మాయం

అరెస్టు చేయకుండా హైకోర్టులో పిటిషన్‌

బెయిల్‌ ఇస్తేనే బయటకు వచ్చే చాన్స్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం క్రైమ్‌) : మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. బందరు నుంచి ఆయన హైదరాబాద్‌ వెళ్లినట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్ఠానమే పేర్ని నానీని సేఫ్‌ జోన్‌లో ఉంచిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. హైకోర్టులో మంగళవారం పేర్ని నాని పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ఈలోపు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ, అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా నేతలంతా మద్దతుగా వచ్చినా పేర్ని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు.

వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే..

ఇటీవల పామర్రు, అవనిగడ్డ సమావేశాల్లో వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా..’ అని సినీ డైలాగులు చెప్పడంతో పేర్ని నాని రెచ్చిపోయారు. చీకట్లో కన్నుకొడితే చంపేయాలన్నారు. చేసే పని సైలెంట్‌గా చే యాలని, ఆ తర్వాత పరామర్శలకు వెళ్లాలని కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఎవరు తప్పులు చేసినా నరికేయాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించటంతో పాటు నేర కార్యకలాపాలను ప్రేరేపించినట్టు అవుతుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు పలు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. అయినా వెరవకుండా పెడనలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి పేర్ని దారుణంగా మాట్లాడారు. తాను అనలేని మాటలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూనే.. తాను పగలే చేయాలని చెబుతాను కానీ, చీకట్లో చేయమని చెప్పనని కూడా అన్నారు. మచిలీపట్నం రాబర్ట్‌సన్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు లొగిశెట్టి వెంకటస్వామి ఫిర్యాదు చేయగా, బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 353(2), 196(1) ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పామర్రు పోలీసులకు కేసును బదిలీ చేశారు. పామర్రు పోలీసులు అరెస్టు చేస్తారన్న సమాచారంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు పేర్ని అనుచరులు, వైసీపీ ముఖ్య నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో పేర్ని హైకోర్టును ఆశ్ర యించారు. తనపై రాజకీయ దురుద్దేశంతో కేసు బనాయించారని, ఆ కేసును కొట్టేయాలని పిటిషన్‌వేశారు. ఈ కేసు మంగళవారం ధర్మాసనం ముందుకురానుంది.

తిరగతోడుతున్న పాత కేసులు

పేర్ని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికితోడు గుడివాడలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక భర్త రాముతో పేర్ని ఆడించిన నాటకం కూడా బయటపడింది. పేర్ని సతీమణి గోడౌన్‌లో రేషన్‌ బియ్యం దొంగతనం వ్యవహారంలో కూడా నానీని వదిలేయడంతో ఇష్టానుసారం పేట్రేగిపోతున్నాడని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో పేర్ని వ్యవహారాలపై మరిన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో టీడీపీ వేయించిన కళ్యాణమండపం శిలాఫలకాలను అప్పట్లో దుండగులు ధ్వంసం చేయగా, ఆ వ్యవహారంపైనా కేసులు పెట్టాలని చూస్తున్నారు. పేర్ని నాని ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్యోదంతాన్ని మంత్రి కొల్లు రవీంద్రపై నెట్టడం వెనుక కూడా కుట్ర దాగుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పేర్ని నానీకి ముఖ్య అనుచరుడిగా ఉన్న మోకా భాస్కరరావు హత్యలో కూడా వైసీపీ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. నాడు సరైన ఆధారాలు లభించలేదు. అప్పుడు అధికారం వైసీపీ చేతిలో ఉండటంతో విచారణను నీరుగార్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపైనా పునర్విచారణకు ఆదేశించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ హత్యకు ప్రేరేపించిన వారు ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారని, సమగ్ర విచారణ జరిపితే న్యాయం జరుగుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:50 AM