అయ్యో రామలింగేశ్వరా.. భూమాయ
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:58 AM
వేల కోట్ల రూపాయల విలువచేసే నందిగామ రామలింగేశ్వరస్వామి భూములు అన్యాక్రాంతమయ్యాయి. వందల ఎకరాలు పరాధీనమయ్యాయి. ఆలయ నిర్వహణ, అర్చకులు, సిబ్బంది పోషణ నిమిత్తం జమిందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దాతృత్వంతో ఇచ్చిన భూములకు రెక్కలు వచ్చేశాయి. 1,220 ఎకరాలకు గానూ ప్రస్తుతం 280 ఎకరాలే మిగలాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నందిగామ రామలింగేశ్వరుడి భూములు మాయం
1,220 ఎకరాలకు మిగిలింది 280 ఎకరాలే..!
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఇచ్చిన భూములు
క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల అన్యాక్రాంతం.. నిర్మాణాలు
ఉన్న భూములపైనా అక్రమార్కుల కన్ను
పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దేవదాయ శాఖలో విచ్చలవిడి అవినీతి కారణంగా కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. నందిగామ రామలింగేశ్వరస్వామి ఆలయ నిర్వహణ నిమిత్తం జమిందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1,220 ఎకరాలు రాసిచ్చారు. ఆ తర్వాత ఈ భూములు దేవదాయ శాఖ పరిధిలోకి రావడంతో విలువ పెరిగింది. ఇప్పుడు కేవలం 280 ఎకరాలే ఆ శాఖ పరిధిలో ఉన్నాయి. 940 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అనేకమంది చేతులు మారిపోయాయి. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది.
ఆడిట్‌లో బయటపడిన విషయాలు
ఆ భూములను అమ్ముకునే హక్కు ఎవరికీ లేదు. కేవలం ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, కార్యక్రమాలు, అర్చకుల జీవనం వంటి వాటికి ఖర్చు చేయాలి. కానీ, మొదట్లో ఆలయానికి నియమితులైన అర్చకులు ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. వారు ఇంకొందరికి విక్రయించారు. ఇలా చేతులు మారుతూ వస్తున్నాయి. ఏళ్ల తరబడి దేవదాయ శాఖ అధికారులు రామలింగేశ్వరస్వామి భూములపై ఆజమాయిషీ చేయకపోవటంతో వందల ఎకరాలు కరిగిపోయాయి. అధికారులు ఆలయ భూముల ఆడిట్ నిర్వహించకపోవటంతో ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. రెండు దశాబ్దాల కాలంగా దేవదాయ శాఖలోని అవినీతి సిబ్బందితో చేతులు కలిపిన ప్రైవేట్ వ్యక్తులు భూములను ఆక్రమించుకుంటున్నారు. నిర్మాణాలు కూడా జరిపేస్తున్నారు. దేవదాయ శాఖ సిబ్బంది సహకారంతో విచ్చలవిడిగా భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు, సాగు భూములుగా వందల ఎకరాలు పరాధీనమయ్యాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అధికారులు ఆలయ భూములపై ఆడిట్ జరపగా, ప్రస్తుతం 280 ఎకరాలే ఉన్నాయని తేలింది. దీనిని బట్టి ఏ స్థాయిలో భూములు అన్యాక్రాంతమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
ఉన్న భూములనూ కాపాడుకోలేని దైన్యం
ఇప్పటికీ దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయ భూములను కూడా అధికారులు కాపాడలేకపోతున్నారు. ఈ భూముల్లో కొందరు వ్యక్తులు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి మీడియాకు వచ్చిన సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, మొక్కుబడిగా ఫొటో దిగి పనులు ఆపేసినట్టు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ ఆ షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి.