నా భర్తను ఉరేసి చంపేశారు!
ABN , Publish Date - May 24 , 2025 | 01:16 AM
తన భర్త కుంభా నాగరాజును ఉరివేసి హత్య చేశారని, తనకు, తన పిల్లలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని మృతుడి భార్య కనకదుర్గభవాని ఆరోపించింది.
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా
మృతుడు నాగరాజు భార్య కనకదుర్గాభవాని
బంధువులతో కలిసి గుడివాడలో రాస్తారోకో
గుడివాడ, మే 23(ఆంధ్రజ్యోతి) : తన భర్త కుంభా నాగరాజును ఉరివేసి హత్య చేశారని, తనకు, తన పిల్లలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని మృతుడి భార్య కనకదుర్గభవాని ఆరోపించింది. కుంభా నాగరాజు, కనకదుర్గాభవాని పామర్రు కొబ్బరితోటలో నాగరాజు తల్లి ఇంట్లో నివాసముంటున్నారు. ఇటీవల నాగరాజు తన తల్లి వ్యవహార శైలి నచ్చక, పలుమార్లు మందలించాడని, 15రోజుల క్రితం తల్లి, మరో ఐదుగురు కలిసి నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని దుర్గాభవాని తెలిపింది. గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందాడని, గాయాలతోనే నాగరాజు పామర్రు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. గొడవ అనంతరం నాగరాజు, తాను గుడివాడలోని తన పుట్టింట్లో ఉంటున్నామని తెలిపింది. రెండు రోజుల క్రితం కేసు పని మీద నాగరాజు పామర్రు వెళ్లాడని, శుక్రవారం ఉదయం శవమయ్యాడని, తన అత్త, అంజి, కల్యాణి, మరో ముగ్గురు కలిసి తన భర్తకు ఉరివేసి హత్య చేశారని భవాని ఆరోపిస్తోంది. పామర్రు పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ భవాని, ఆమె బంధువులు నెహ్రూచౌక్‌లో రాస్తారోకోకు దిగారు. భవాని, ఆమె బంధువులతో టూటౌన్ సీఐ చల్లా నాగప్రసాద్ మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అక్కడ నుంచి వారు బయలుదేరి ఏరియా ప్రభుత్వాస్పత్రి ఎదుట మరోసారి రాస్తారోకోకు దిగారు. టూటౌన్ సీఐ నాగప్రసాద్, పామర్రు ఎస్సై రాజేంద్రప్రసాద్‌లు దుర్గాభవాని, ఆమె బంధువులతో మాట్లాడి కేసు నమోదు చేయడంతో రాస్తారోకో విరమించారు. భవాని దివ్యాంగురాలు కాగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు.