Share News

రీల్‌ కోసమే హత్య

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:14 AM

ఇన్‌స్టాలో ఓ రీల్‌ కోసమే సస్పెక్ట్‌ షీటర్‌ అలవల నవీన్‌రెడ్డిని గద్దె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి హత్య చేశాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. సాయి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ధర్మవరప్పాడు తండా చప్టాపై మందు పార్టీ చేసుకున్నారు.

రీల్‌ కోసమే హత్య
రైలు ట్రాక్‌పై ప్రమాదకరంగా నిందితుడి సాయి రీల్స్‌

నవీన్‌రెడ్డి హత్య కేసులో కీలక మలుపు

ఇన్‌స్టా రీల్‌ వేరొకరి ఫోన్‌లో చూడొద్దన్నందుకు కోపం

తనకే ఎదురుచెప్పాడని నవీన్‌పై సాయి సీసాతో దాడి

హత్య అనంతరం తెలంగాణాలోకి పరార్‌

సూర్యాపేట, ఖమ్మంలో ఉన్నట్టు సమాచారం

విజయవాడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఇన్‌స్టాలో ఓ రీల్‌ కోసమే సస్పెక్ట్‌ షీటర్‌ అలవల నవీన్‌రెడ్డిని గద్దె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి హత్య చేశాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. సాయి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ధర్మవరప్పాడు తండా చప్టాపై మందు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో నవీన్‌రెడ్డి, అన్వేష్‌, నందకిషోర్‌తో పాటు మరికొంతమంది ఉన్నారు. వారంతా కలిసి బీరులు, మద్యంతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సాయి తన రీల్స్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. పార్టీలో ఉన్న మరో యువకుడి ఫోన్‌ తీసుకుని సాయి తన రీల్స్‌ను చూసుకుంటున్నాడు. కొద్దిసేపటికి నవీన్‌రెడ్డి ఆ ఫోన్‌ను ఆ యువకుడికి ఇవ్వమని చెప్పాడు. ఆ రీల్స్‌ను సాయి ఫోన్‌లో చూసుకోవాలని సూచించాడు. ఇలా రెండు, మూడుసార్లు చెప్పేసరికి సాయికి కోపం వచ్చింది. నవీన్‌ తనకే ఆదేశాలు ఇస్తాడా.. అని కోపోద్రిక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి నవీన్‌, సాయి మధ్య ఘర్షణ మొదలైంది. వెంటనే చప్టాపై ఉన్న బీరు సీసాను పగలగొట్టి నవీన్‌పై ఇష్టానుసారంగా దాడి చేసి చంపేశాడు.

పరారీలో..

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు గద్దె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి ఎక్కడున్నాడు? నవీన్‌రెడ్డి హత్య తర్వాత తెలంగాణాలోకి పారిపోయాడా? సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుని, వేర్వేరు నెంబర్ల నుంచి స్నేహితులకు ఫోన్లు చేస్తున్నాడా? అంటే దర్యాప్తు బృందాలు అవుననే అంటున్నాయి. హత్య తర్వాత అక్కడి నుంచి తెలంగాణాలోకి పారిపోయాడని తెలిసింది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సూర్యాపేటలోని ఓ లాడ్జీలో బస చేశాక ఖమ్మం పారిపోయినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అక్కడి నుంచి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. వేర్వేరు నెంబర్ల నుంచి చిల్లకల్లులో ఉన్న స్నేహితులకు ఫోన్లు చేసి డబ్బు పంపమని అడుగుతున్నాడని తెలిసింది.

ఎక్కడున్నా గ్యాంగ్‌ తయారీ

సాయి విజయవాడలోనే కాదు.. ఎక్కడున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకుంటాడు. రాణిగారితోటలో పదిమంది యువకులను చేరదీసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. వారికి గంజాయిని అలవాటు చేశాడు. దారినపోయే జనాన్ని బెదిరించి, డబ్బు వసూలుచేసి వారికి సమకూర్చాడు. ఆ యువకులతో గంజాయి విక్రయాలు చేయించేవాడు. ఈ గ్యాంగ్‌ మొత్తాన్ని కృష్ణలంక పోలీసులు గంజాయి కేసుల్లో జైళ్లకు పంపారు. గోవా నుంచి చిల్లకల్లు చేరుకున్న నవీన్‌రెడ్డి, సాయి ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. అక్కడ కూడా కొత్త గ్యాంగ్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. గురువారం సాయి పుట్టినరోజు సందర్భంగా చిల్లకల్లులో 50 మంది యువకులు ‘హ్యాపీ బర్త్‌డే సాయి అన్న’ అంటూ ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.

Updated Date - Dec 07 , 2025 | 01:14 AM