Share News

మునేరు మహోగ్రం

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:55 AM

మొంథా తుఫాను గండం వీడిందంటే.. మునేరు వరద ముంపు జిల్లాపై పడగవిప్పింది. తెలంగాణాలో వర్షాల కారణంగా మునేరు మహోధృతమై ప్రవహిస్తోంది. వేలాది ఎకరాల పంటలు ముంపునకు గురయ్యాయి. గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 15 అడుగులకు చేరింది. లింగాల కాజ్‌వేను వరద ముంచెత్తింది. దీంతో ఈ మార్గంలో తెలంగాణాకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు వంతెనపై కూడా అడుగు ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప గ్రామాలవారు భయాందోళన చెందుతున్నారు. పాలేరు, వైరా, కట్టలేరు కూడా ఉగ్రరూపం దాల్చాయి.

మునేరు మహోగ్రం
కీసర వంతెన నుంచి మునేరు విశ్వరూపం

భారీగా చేరుతున్న వరద

వందల ఎకరాల్లో పంటలు నీటమునక

వరదనీటిలో చిక్కుకుపోయిన గ్రామాలు

పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు

రెండోరోజూ జలదిగ్బంధంలో కాజ్‌వేలు

ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్‌

పెనుగంచిప్రోలు ఆలయ పరిసరాల్లోకి వరద

పాలేరు, వైరా, కట్టలేరులోనూ తగ్గని ఉధృతి

క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారుల పర్యటన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల/ వత్సవాయి/పెనుగంచిప్రోలు/నందిగామ) : మొంథా తుఫాను వల్ల తెలంగాణాలోని వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో మునేరుకు వరద చేరింది. ప్రస్తుతం 1.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రవాహం శుక్రవారానికి తగ్గుముఖం పట్టవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్‌ జిల్లా పాకాలలో పుట్టిన మునేరు 240 కిలోమీటర్లు ప్రవహించి ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇది వరంగల్‌, ఖమ్మ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఖమ్మం జిల్లాలో పుట్టిన కట్టలేరు వాగు.. వైరా వాగులో కలుస్తుంది. అక్కడి వైరా వాగు వచ్చి మునేరులో కలుస్తుంది. మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాల్లో గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్యలో మునేరు పరిధిలో 277.56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నీరు మొత్తం మునేరులోకి వస్తోంది. ఈ ఏరుకు 2005లో రికార్డు స్థాయిలో 3.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. గత ఏడాది 3.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఉదయం నుంచి నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మునేరు వాగు మీదుగా తెలంగాణాకు ఉన్న మార్గాలను మూసివేశారు. గురువారం ఉదయం 9 గంటలకు కలవోడు వద్ద 24.50 అడుగులకు నీటిమట్టం చేరింది. కీసర వద్ద సాయంత్రం 4 గంటలకు 25.50 అడుగులకు నీటిమట్టం చేరింది.

పాలేరుపై 79.59 సెంటీమీటర్లు

ఒకపక్క మునేరు ఉప్పొంగుతుండగా, మరోపక్క పాలేరు పరవళ్లు తొక్కుతోంది. జనగాం జిల్లా నుంచి ప్రారంభమయ్యే పాలేరు మహబూబబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల మీదుగా ప్రవహించి జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు పరిధిలో 79.59 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వాగులన్నీ కృష్ణానదిలో కలవడంతో ఆ వరద ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడుతోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద గంటగంటకూ ఉధృతి పెరుగుతూనే ఉంది. కృష్ణానదికి కూడా వరద వస్తుండటంతో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ తదితరులు కీసర, పెనుగంచిప్రోలు, లింగాల, పోలంపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు.

జలదిగ్బంధంలో కాజ్‌వేలు

చిల్లకల్లు-వైరా అంతర్రాష్ట్ర రహదారిలోని లింగాల కాజ్‌వే వరద దిగ్బంధానికి గురైంది. ఈ కాజ్‌వేపై ఆరేడు అడుగుల ఎత్తున వరద పొంగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అధికారులు ఈ కాజ్‌వేను మూసివేశారు. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది కాజ్‌వే రెండువైపులా పహారా కాస్తున్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచి 24 గంటలు దాటింది. రెండువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెనుగంచిప్రోలు వంతెనపై ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఒక అడుగు ఎత్తున వరద ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు వంతెనను మూసివేశారు.

పెనుగంచిప్రోలు ఆలయ పరిసరాల్లోకి వరద

పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం వద్దకు వరద చేరింది. పరిసరాలు నీట మునిగాయి. పలు దుకాణాలు వరదలో చిక్కుకున్నాయి. ఆలయం సెంటర్‌లోని కొన్ని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. అధికారులు అమ్మవారి సత్రంలో, ఎంపీయూపీ మెయిన్‌ స్కూల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యిమందిని తరలించారు. లింగాల, ఇందుగుపల్లి గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాలకు చెందిన 600 మందిని అక్కడికి తరలించారు. వేమవరం వద్ద వరద రోడ్డెక్కటంతో పెనుగంచిప్రోలు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

నీటిలోనే గ్రామాలు

కంచికచర్ల మండలం కీసర, గండేపల్లి, పెండ్యాల, ఎస్‌.అమరవరం, మోగులూరు, మున్నలూరు తదితర గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల పంటలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొనటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి కూడా వరద వస్తుండటంతో తీర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కొనసాగుతున్న వైరా, కట్టలేరు ఉధృతి

వైరాయేరు, కట్టలేరుకు వరద కొనసాగుతూనే ఉంది. వైరాయేరు కూడలి కాజ్‌వేపై పొంగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కీసర వంతెన వద్ద గురువారం సాయంత్రం 4 గంటలకు మునేరు వరద 5.82 మీటర్లకు చేరింది.

జాతీయ రహదారిపైకి చేరుతుందా?

మునేరు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గురువారం రాత్రికి భారీగా వరద పెరిగే అవకాశం ఉందన్న సమాచారం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. వరద ఇంకా పెరిగితే ఎన్‌హెచ్‌-65పైకి నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే హైదరాబాద్‌-విజయవాడ ప్రధాన మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

గండి ని వదిలేయటం వల్లే..

పెనుగంచిప్రోలు మండలం రేకులగడ్డ వద్ద గత ఏడాది పడిన గండి (మైసమ్మ గండి)ని ఇప్పటి వరకు పూడ్చలేదు. మునేరు వరద ఈ గండి మీదుగా పంట భూములపైకి చేరింది. రేకులగడ్డ, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాలకు చెందిన వెయ్యి ఎకరాల మాగాణి వరి నీట మునిగింది.

Updated Date - Oct 31 , 2025 | 12:55 AM