Share News

పదవుల ఫైట్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:06 AM

పార్టీ, సొసైటీ పదవుల నియామకాల వ్యవహారం తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ మధ్య రాజకీయ రగడకు దారితీసింది. కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు గురువారం వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ సమయంలోనే తిరువూరు నియోజకవర్గంలో గురువారం ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ వేర్వేరుగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకోవటంతో విభేదాలు బట్టబయలు అయ్యాయి.

పదవుల ఫైట్‌

ఎంపీ కేశినేని శివనాథ్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో రాజుకున్న వివాదం

తిరువూరులో ఒకేరోజు ఇద్దరూ పోటాపోటీ కార్యక్రమాలు

డబ్బు తీసుకుని పదవులు ఇచ్చారంటూ కొలికపూడి ఆరోపణలు

ఇసుక, పేకాట క్లబ్‌లు, గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని వ్యాఖ్య

వైసీపీతో కొలికపూడి అంటకాగుతున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని

వైసీపీ కోవర్టులకు పదవులు ఇవ్వరని ప్రతిగా కౌంటర్‌

తనకు డబ్బు ఇచ్చావంటే ఎవరూ నమ్మరని సమాధానం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తిరువూరు నియోజకవర్గంలో కొద్దిరోజుల కిందట సంస్థాగత పార్టీ పదవులకు సంబంధించి ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. తన ప్రమేయం లేకుండా పదవుల ఎంపిక జరిగిందని ఎమ్మెల్యే శిబిరం ఆరోపిస్తుండగా, పార్టీకి పనిచేసిన వారికే పదవులు ఇచ్చామని ఎంపీ శిబిరం చెబుతోంది. సంస్థాగత పదవుల వ్యవహారంతో మొదలైన వివాదం ఆ తర్వాత సొసైటీ చైర్మన్ల ఎంపికతో ముదిరి పాకాన పడింది. వారం రోజులుగా ఇరుపక్షాల మధ్య పరోక్షంగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఎంపీ కార్యాలయంలోని కిషోర్‌, సూరపనేని రాజాపై విమర్శనాసా్త్రలు సంధించారు. ఎంపీ అనుచరులు కూడా ప్రతిగా ఎమ్మెల్యే కొలికపూడి, ఆయన అనుచరుల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. తిరువూరులో గురువారం గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం, ప్రజల నుంచి సలహాల స్వీకరణ పేరుతో ఎంపీ కేశినేని శివనాథ్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇదే క్రమంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన వారి పరామర్శల పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలకు పిలుపునివ్వటంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోయి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

పదవుల వివాదమా? వ్యక్తిగతమా?

తిరువూరు మండల పార్టీ అధ్యక్షుడిగా దుబ్బాకు వెంకటేశ్వరరావును నియమించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ లీడర్‌ అయిన దుబ్బాకు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి తిరిగి టీడీపీలో చేరారు. వయోభారం కారణంగా తాను పనిచేయలేనని చెప్పినప్పటికీ ఆయనకు ఆ పదవి ఇచ్చారని ఎమ్మెల్యే కార్యాలయం గుర్రుగా ఉంది. ఈ పదవికి మేకల చంద్ర, మల్లెల శ్రీనివాస్‌ వంటివారు కూడా పోటీ పడ్డారు. గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడిగా వి.రామకృష్ణను నియమించారు. ఇలా మండల, టౌన్‌ పార్టీ సంస్థాగత పదవులకు పలువురిని నియమించారు. ఈ పదవుల జాబితాను అప్పట్లో ఎంపీ కేశినేని శివనాథ్‌ సమక్షంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. ఆ రోజున అభ్యంతరాలు తెలపని కొలికపూడి రెండు నెలల తర్వాత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లోనూ ఇష్టానుసారంగా పదవులు ఇచ్చారన్న కారణంతో కొలికపూడి మరింత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీకి రూ.5 కోట్లు ఇచ్చానని, పదవులకు డబ్బు వసూలు చేశారని కూడా ఆయన ఆరోపణలు చేశారు.

వైసీపీ నేతలతో టచ్‌లో ఉంటున్నారా?

కొలికపూడి వైసీపీ కోవర్టుగా ఉన్నాడని ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆరోపించటంతో ఆయన కదలికలపై అనుమానాలు నెలకొంటున్నాయి. వైసీపీ సర్పంచ్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ డబ్బు ఇప్పించటంతో పాటు ఆ పార్టీ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పేర్ని నాని, దేవినేని అవినాష్‌, కేశినేని నాని, స్వామిదాసులతో కలిసి తిరుగుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేశినేని వ్యాఖ్యలపై కొలికపూడి శ్రీనివాసరావు కూడా స్పందించారు. తాను జగన్‌పై పోరాడి రాజకీయాల్లోకి వచ్చానని, అమరావతి ఉద్యమాన్ని నడిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ తనను వైసీపీ కోవర్టుగా ఆరోపిస్తున్నవారే ఆ పార్టీ నేతలతో వ్యాపారాలు చేస్తున్నారని ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలతో చెట్టపట్టాల్‌ వేసుకునే వారికి పదవులు ఇవ్వాలా?

  • ఎంపీ కేశినేని శివనాథ్‌

ఎంపీగా నేను అందజేసిన సీఎంఆర్‌ఎఫ్‌ సహాయం ఎవరూ చేయలేదు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలను దృష్టిలో ఉంచుకుని సహాయం చేస్తాను. కొలికపూడి మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల కంటే కూడా వైసీపీ వారికి సహాయం చేస్తారు. వైసీపీ సర్పంచ్‌కు రూ.10 లక్షల సహాయం ఇప్పించారు. నేనెక్కడికి వెళ్లినా టీడీపీ, జనసేన నాయకులతో వెళ్తాను తప్ప.. వైసీపీ వారితో వెళ్లను. నేను తిరువూరు నియోజకవర్గంలో ఐదు రూపాయలు అయినా తీసుకున్నానని మీరు నమ్ముతారా? నా క్రెడిబిలిటీ అది. నేను నా సొంత డబ్బు ఖర్చు పెడతానే కానీ, ఎవరి వద్దా తీసుకోను. నాకు విజయవాడలో కానీ, రాష్ట్రంలో కానీ వ్యాపారాలు లేవు. హైదరాబాద్‌లో నా కుటుంబం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంది.

పదవులు అమ్ముకున్నారు

  • కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు ఎమ్మెల్యే

నా నియోజకవర్గంలో నేను చెప్పిన వారికి కాకుండా ఎంపీ చెప్పినట్టుగా పదవులు ఇచ్చారు. పేర్లు మారిపోయాయి. పదవులు ఇవ్వటానికి డబ్బు వసూలు చేశారు. సంస్థాగత పదవులతో పాటు పీఏసీల్లోనూ అన్యాయం జరిగింది. నాడు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినప్పుడే నా దగ్గర ఎంపీ రూ.5 కోట్లు డబ్బు వసూలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో నా ద్వారా జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. టెండర్లన్నీ రద్దు చేయిస్తున్నారు. ఇసుక, పేకాట క్లబ్‌ల నిర్వహణతో పాటు చివరికి గంజాయి బ్యాచ్‌తో కూడా వ్యాపారం చేయిస్తున్నారు. వైసీపీ నాయకులతో నేను తిరగటం లేదు. వారితో ఎంపీనే వ్యాపారాలు చేస్తున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 01:06 AM