అవినీతికి తావులేదు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:07 AM
: గుడివాడ నియోజకవర్గంలో అవినీతికి తావులేదని, ఎవరైనా, ఎంతటివారైనా అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపిస్తే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజావేదికలో గుడివాడ పట్టణ, రూరల్ మండల పార్టీ నాయకులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఆధారాలతో వస్తే ఎంతటి వారైనా చర్యలు
టీడీపీ స్థానిక నేతల సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : గుడివాడ నియోజకవర్గంలో అవినీతికి తావులేదని, ఎవరైనా, ఎంతటివారైనా అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపిస్తే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజావేదికలో గుడివాడ పట్టణ, రూరల్ మండల పార్టీ నాయకులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి మంజూరైన రూ.10 కోట్లతో గుడివాడలో త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని పాత పంపుల చెరువుకు మరమ్మతులు చేయించామని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గుడివాడ-కంకిపాడు రహదారికి తాత్కాలిక పనులు చేపట్టామని, కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో రహదారిని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గుడివాడ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేశానని చెప్పారు. తనతో సహా అందరూ టీడీపీ కార్యకర్తలేనన్నారు. గుడివాడ పేరును చెడగొట్టేలా అసత్య వదంతులను వ్యాప్తిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగిందా.. అని వెనిగండ్ల ప్రశ్నించారు. పార్టీలో అంతర్గత విషయాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, సోషల్ మీడియా వేదికగా అనవసర పోస్టులు పెడితే సీరియస్‌గా పరిగణిస్తానని హెచ్చరించారు. ఇప్పటివరకు సొంత డబ్బునే అవసరాలకు వినియోగిస్తున్నానని, నిజాయితీగా ఉంటూనే పార్టీ శ్రేణులను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నానన్నారు. గుడివాడలో టీడీపీ గెలుపునకు అందరూ కృషి చేశారని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందన్నారు. వర్గాల పేరుతో అనవసర రాద్ధాంతం వద్దన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగిందనిపిస్తే ఆధారాలతో వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని వెనిగండ్ల పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, రూరల్ అధ్యక్షుడు మురళీ, నాయకులు లింగం ప్రసాద్, పండ్రాజు సాంబశివరావు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.