Share News

కిక్కిసలో నొక్కిసలాట

ABN , Publish Date - May 20 , 2025 | 01:00 AM

‘పనులు దక్కడానికి టెండర్‌ ఎంత తక్కువైనా వేద్దాం. టెండర్‌ దక్కాక ఏదోలా పని కానిచేద్దాం. తర్వాత బిల్లులు పూర్తిస్థాయిలో తీసుకుందాం.’ ఇదీ జలవనరుల శాఖలో కాంట్రాక్టర్ల ఆలోచనాతీరు. టెండర్లలో పోటీపడి తక్కువగా కోట్‌ చేశాక పనులు తమకు నచ్చినట్టుగా చేస్తున్నారు. ఆయా కాల్వల వద్ద పరిస్థితి చూస్తుంటే అసలు ఇక్కడ పనులు జరిగాయా.. అనే అనుమానం కలుగుతోంది. కాల్వల వద్ద మళ్లీ మొలకెత్తుతున్న కిక్కిసే ఇందుకు నిదర్శనం.

కిక్కిసలో నొక్కిసలాట
ఉంగుటూరు మండలం ఆత్కూరు యూటీ డ్రెయిన్‌ వద్ద తొలగించినా మళ్లీ మొలకెత్తిన కిక్కిస

జిల్లాలోని కాల్వల్లో నామమాత్రంగా కిక్కిస తొలగింపు పనులు

జనవరిలో టెండర్లు, మార్చిలో పనులు పూర్తి

జూన్‌లో నీటి విడుదల.. ఈలోపే పెరిగిన కిక్కిస

మూడు ప్రధాన కాల్వల్లోనూ ఇదే పరిస్థితి

కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. బిల్లులకు మాత్రం సిద్ధం

ముడుపుల మాయలో జలవనరుల శాఖ ఇంజనీర్లు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో బందరు, ఏలూరు, రైవస్‌, బుడమేరు కాల్వలు ప్రవహిస్తాయి. విజయవాడ నుంచి దిగువకు వెళ్లేకొద్దీ ఈ కాల్వల్లో ఒకప్పుడు తూటికాడ, గుర్రపుడెక్క ఎక్కువగా కనిపించేది. కొన్నేళ్లుగా కిక్కిస మొలకెత్తడం మొదలైంది. త్వరలో కాల్వలకు నీరు వదలనుండటంతో కిక్కిస తొలగింపు పనులకు జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో కాల్వల వద్ద పాత పరిస్థితే కనిపిస్తోంది.

తూతూమంత్రంగా పనులు.. అయినా బిల్లులకు రెడీ

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు ప్రధాన కాల్వల ద్వారా తాగు, సాగునీరు సరఫరా అవుతోంది. బందరు, రైవస్‌, ఏలూరు కాల్వలు జిల్లాలోని తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. వీటికి అనుబంధంగా సుమారు 200 వరకు ఉపకాల్వలు ఉన్నాయి. ఒక్కో ప్రధాన కాల్వకు పది వరకు ఉపకాల్వలు ఉంటాయి. వాటికి అనుబంధంగా పిల్ల కాల్వలు ఉంటాయి. తూర్పుడెల్టా పరిధిలో ఆయకట్టు సాగుకు మొత్తం ఈ కాల్వల ద్వారానే నీరు అందుతోంది. వీటిలో అల్లుకుపోయిన కిక్కిసను తొలగించడానికి జలవనరుల శాఖ అధికారులు జనవరిలో టెండర్లు ఆహ్వానించారు. మొత్తం రూ.25.49 లక్షల పనులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను 38.89 శాతం తక్కువకు వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. హడావిడిగా మార్చి నెలాఖరుకు పనులు పూర్తిచేశారు. వాస్తవానికి కిక్కిసను వేళ్ల సహా తొలగించాలి. అటువంటిది కాంట్రాక్టర్లు ఎక్స్‌కవేటర్లతో పైపైనే తొలగించారు. దీంతో కాల్వల వద్ద మళ్లీ కిక్కిస మొలకెత్తుతోంది. అసలు పనులు ఏ స్థాయిలో, ఏవిధంగా జరిగాయో పరిశీలించాల్సిన ఇంజనీర్లు ముడుపుల మత్తులో జోగుతున్నారు. పనులు జరిగిన వైపు ఇప్పటి వరకు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. కానీ, పనులు పూర్తి చేశామని చెబుతూ కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఙ

ముడుపుల మత్తులో ఇంజనీర్లు

కాల్వలో తూటికాడ, గుర్రపుడెక్క ఉన్నా నీరు ఎంతో కొంత నెమ్మదిగా ఉపకాల్వలకు ప్రవహిస్తుంది. అదే కిక్కిస కాల్వలను అల్లుకుందంటే ఇక అంతే సంగతులు. నీటిని కిందకు ప్రవహించకుండా అడ్డుకుంటుంది. వాటిని తొలగించడానికి కూలీలూ కిందకు దిగలేని పరిస్థితి ఉంటుంది. కృష్ణాడెల్టా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కిక్కిస పేరు వినిపించలేదు. ఇది ఎక్కువగా కొల్లేరు ప్రాంతంలో ఉండేది. నెమ్మదిగా కృష్ణాడెల్టాలోని కాల్వలోకి ప్రవేశించింది. ఐనంపూడి డ్రెయిన్‌, ఏనుగులకోడు, నందివాడ మండలంలోని ఆత్కూరు యూటీ (అండర్‌ టన్నల్‌), ఉంగుటూరు మండలంలోని వన్నేరు మీదుగా ప్రవహిస్తున్న కాల్వల్లో కిక్కిరిసి అల్లుకుపోయింది. గట్ల నుంచి కాల్వల వరకు విస్తరిస్తోంది. జూన్‌లో జలవనరుల శాఖ అధికారులు కాల్వలకు నీటిని విడుదల చేసినా పూర్తిగా కిందకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - May 20 , 2025 | 01:00 AM