జేవీ విధానంలోనే మెట్రో
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:54 AM
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ (జేవీ) విధానంలోనే ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు నూరుశాతం కేంద్రం భరించాలని ఏపీఎంఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
అన్ని నగరాల మాదిరిగానే విజయవాడ మెట్రో కూడా..
కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం వాటా
మిగిలిన 60 శాతం వాటా థర్డ్‌పార్టీ నుంచి అప్పుగా..
మెట్రో ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చిన కేంద్రం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ (జేవీ) విధానంలోనే ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు నూరుశాతం కేంద్రం భరించాలని ఏపీఎంఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని నగరాలకు ఏ విధంగా మెట్రో ప్రాజెక్టులను ఇచ్చామో, అలాగే విజయవాడ, విశాఖకు కూడా వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో భాగస్వామ్య విధానంలోనే మెట్రో ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. జాయింట్ వెంచర్ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం వాటాలు భరించాల్సి ఉండగా, మిగిలిన 60 శాతం వాటాను థర్డ్‌పార్టీ ఫైనాన్స్ సంస్థల దగ్గర అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ సంస్థ దగ్గర అప్పు తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఽథర్డ్‌పార్టీ ఫైనాన్స్ సంస్థలను నిర్దేశించాలంటే.. ప్రస్తుతం ఏపీఎంఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే విజయవాడ నగరంలో సమగ్ర రవాణా ప్లాన్ (సీఎంపీ)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే కన్సల్టెంట్‌ను ఎంపిక చేశారు. ఆరు నెలల్లో ఈ నివేదిక పూర్తవుతుంది. కానీ, పనుల్లో వేగం తీసుకురావటం కోసం 3 నెలల్లో అందించాలని ఏపీఎంఆర్‌సీ కోరింది. రెండున్నర నెలల్లోనే సీఎంపీ ఇచ్చేందుకు కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేపడుతోంది. ప్రస్తుతం నెల సమయం గడిచింది. మరో నెలన్నరకు సీఎంపీ వస్తుంది. ఆ ప్లాన్ రాగానే ఏపీఎంఆర్‌సీ.. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. కేంద్రం ఆమోదం తెలిపే సందర్భంలో మాత్రమే థర్డ్‌పార్టీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఏమిటన్న దానిపై కేంద్రం స్పష్టతనిస్తుంది. ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ.. ఇలా ఏదో ఒక్క ఆర్థిక సంస్థ పేరును ప్రతిపాదిస్తుంది. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.