Share News

మస్తర్ల మస్కా

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:39 AM

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పారిశుధ్య కార్మికులు పనిచేయకున్నా.. చేసినట్లుగా చూపి, వారి పేరుతో జీతాలు తీసుకోవడం వంటి అనేక విషయాలు బయట పడుతున్నాయి. ఈనెల 9న ‘అక్రమార్కులకు అందలం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కాగా, అధికారులు విచారణకు ఆదేశించారు. పనిచేయకున్నా పారిశుధ్య కార్మికుల పేరుతో మస్తర్లు వేయడం, జీతాలు చెల్లించడం వంటిఅంశాలు ఈ విచారణలోనే తెలుస్తున్నాయి.

మస్తర్ల మస్కా

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో చిత్రాలెన్నో..

పనిచేయని పారిశుధ్య కార్మికులకు హాజరు

50 మందికి పైగా కార్మికుల పేరిట జీతాలు డ్రా

ఇన్‌చార్జి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు

తప్పును కప్పిపుచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు

అధికారుల విచారణలో బయటపడుతున్న నిజాలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 480 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి హాజరును హెల్త్‌ అసిస్టెంట్లు లేదా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు రోజూ పరిశీలించాలి. 480 మందిలో 50 మందికి పైగా కార్మికులు విధులకు హాజరుకారు. అయినా వీరు విధులకు హాజరైనట్లుగా మస్తర్లు వేస్తున్నారు. ఈ మస్తర్ల నమోదుపై ఇటీవల మునిసిపల్‌ శాఖ అధికారులు నిఘా పెట్టారు. 17వ డివిజన్‌లో 16 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నట్లుగా ఇన్‌చార్జి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మస్తర్లు వేస్తున్నాడు. మోపిదేవి మండలంలోని ఓ హాస్టల్‌లో వంట పనిచేస్తున్న మహిళ 17వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు మస్తర్‌ వేయడంపై అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేశారు. రెండు నెలల పాటు ఆ మహిళ మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ 17వ డివిజన్‌లో పనిచేస్తున్నట్టుగా చూపించారు. ఈ తరహాలో ఇన్‌చార్జి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ మిగిలిన డివిజన్లలో మస్తర్లు నమోదు చేస్తున్నారా లేదా అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

తెగని పంచాయితీ

17వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికురాలు విధులకు హాజరుకాకున్నా హాజరైనట్టుగా మస్తర్‌ వేసిన విషయంపై అధికారులు ఈ నెల 19న సంబంధిత డివిజన్‌ సెక్రటరీని, ఇన్‌చార్జి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి విచారణ చేశారు. తనపై ఒత్తిడి తేవడంతోనే మహిళా కార్మికురాలు విధులకు హాజరైనట్టుగా నమోదుచేసి ఆన్‌లైన్‌లో పంపానని సంబంధిత సెక్రటరీ అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఇన్‌చార్జి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పొంతనలేని సమాధానం చెప్పాడని తెలిసింది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు ఈ అంశంపై అధికారులు మధ్య పంచాయితీ జరిగింది.

విచారణ చేస్తున్నాం..

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ 17వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికుల హాజరుపై విచారణ చేశాం. ఒక కార్మికురాలు అసలు విధులకు రాకున్నా.. వచ్చినట్టుగా మస్తర్‌ వేస్తున్న విషయం మా పరిశీలనలో వెల్లడైంది. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- ఏవీ గోపాలరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌

Updated Date - Aug 21 , 2025 | 12:39 AM