దశాబ్దాల ప్రతిష్ఠను కూల్చేశారు..!
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:21 AM
ఒకరిది స్వార్థం.. మరొకరిది అత్యాశ.. ఇంకొకరిది అవివేకం.. ఇంతమంది ఆడిన డబ్బులాటలో 55 ఏళ్లుగా ఎంతోమంది పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారి ఉన్నతికి బాటలు వేసిన శాతవాహన కళాశాల నేలమట్టమైంది. ఈ కళాశాల స్థలాన్ని ఎలాగైనా కాజేయాలన్న కుతంత్రాలతో ఎంతో పేరున్న విద్యాశిఖరాన్ని నామరూపాల్లేకుండా శిథిలం చేశారు. తాతల నాటి స్థలం కన్నేసి కొట్టేయాలనుకున్నది ఒకరైతే, అసలు మనుగడే లేకుండా చేసేందుకు శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలోని కొందరు పావులు కదిపారు. వీరంతా కలిసి ఆడిన ఆటలో శాతవాహన కనీసం కంటికి కూడా కనిపించకుండాపోయింది.
‘శాతవాహన’ కూల్చివేతలో దుష్టగ్రహాలెన్నో..
స్వార్థపు ఆటకు బలైన సరస్వతీ నిలయం
‘బోయపాటి’ని నడిపిస్తున్న ‘కృష్ణ’లీల ఏంటి?
వివాదం కోర్టులో ఉండగానే ‘డెవలప్‌మెంట్’ దొంగాట
కూల్చివేతకు సరేనన్న ప్రిన్సిపాల్, కరస్పాండెంట్
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రమేయమేంటి?
వివాదాలకు ఆజ్యంపోస్తున్న ‘వంకాయలపాటి’
డి అడ్రస్‌మాల్‌లో డీల్స్.. కిడ్నాప్ డ్రామాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : శాతవాహన కళాశాల భవనాలను బోయపాటి శ్రీనివాస అప్పారావు, ధూళిపూడి శ్రీకాంత నేలమట్టం చేయడానికి ముందు విజయవాడ కేంద్రంగా కిడ్నాప్ కథ నడిచింది. కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ తనను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత సహాయకుడు, మరికొంతమంది కిడ్నాప్ చేశారని హంగామా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు తన ఇంటి ముందు రెక్కీ నిర్వహించారని శ్రీనివాస్ కుమారుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఎంజీ రోడ్డులో ఉన్న డి అడ్రస్‌మాల్‌కు వెళ్లి బయటకు వస్తున్నప్పుడు ఆలపాటి మనుషులు కిడ్నాప్ చేసి గుంటూరుకు తరలించారని, తన సెల్‌ఫోన్ లాక్కుని వారికి కావాల్సిన కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని వంకాయలపాటి శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, ఆలపాటి రాజేంద్రప్రసాద్, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఆ తర్వాత కిడ్నాప్‌పై ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. వాస్తవానికి సుప్రీంకోర్టులో జరిగే పరిణామాల గురించి ఈ ముఠాకు ముందే సమాచారం ఉంది. దీనికి సంబంధించిన డీల్‌ను సెట్ చేసుకోవడానికి శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం డి అడ్రస్‌మాల్‌లో ఉన్న శ్రీకాంత వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది.
‘డెవలప్‌మెంట్’ మాయ
ఎంజీ రోడ్డులో ఉన్న డి అడ్రస్‌మాల్ అధినేత ధూళిపూడి శ్రీకాంత శాతవాహన ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి చాలా తెలివిగా వ్యవహరించాడు. శాతవాహన భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు రాకుండానే ఆ భూములు తనవేనని చెప్పుకొంటున్న బోయపాటి శ్రీనివాస అప్పారావుతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఏ డెవలపర్ అయినా ఎలాంటి వివాదాలు లేని భూములపై ఒప్పందాలు చేసుకుంటారు. అటువంటిది శ్రీకాంత కోర్టు వివాదాల్లో నలుగుతున్న శాతవాహన భూములను డెవలప్ చేయడానికి ఎందుకు ఆసక్తితో అడుగులు వేశారన్నది అనుమానమే. శాతవాహన కళాశాలలోకి ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లిన రోజున బోయపాటి శ్రీనివాస అప్పారావుతో పాటు శ్రీకాంత కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఓ థియేటర్‌లో భాగస్వామిగా ఉన్న ‘కృష్ణ’లీల ఈ కథంతా నడిపిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. కాగా, కళాశాలను కూల్చుకోవచ్చని కరస్పాండెంట్ రమాసత్యనారాయణ, ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ రాతపూర్వకంగా అనుమతి ఇచ్చారని కూడా పోలీసులు నిర్ధారించారు.
ఆలపాటికేం సంబంధం..?
శాతవాహన కళాశాల, శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీతో అసలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సంబంధం ఉందా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. బోయపాటి శ్రీనివాస అప్పారావు, ధూళిపూడి శ్రీకాంత, వంకాయలపాటి శ్రీనివాస్, ప్రస్తుత కరస్పాండెంట్ నిడుమోలు రమాసత్యనారాయణపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి కార్యదర్శి హోదాలో ఈ ఫిర్యాదు చేశారు. ఆలపాటికి సొసైటీలో కానీ, కళాశాలలో కానీ ఎలాంటి పదవులు లేవని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం శాతవాహన కళాశాల కరస్పాండెంట్‌గా నిడుమోలు రమాసత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. కరస్పాండెంట్‌గా ఉన్నవారే సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. దాని ప్రకారం తానే కార్యదర్శి, కరస్పాండెంట్ హోదాలో ఉన్నానని రమాసత్యనారాయణ చెబుతున్నారు. ఇదివరకు ఈ కార్యదర్శి పదవి విషయంలో ఆలపాటికి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. స్థానికత లేనందున ఆలపాటి సొసైటీ కార్యదర్శి, కళాశాల కరస్పాండెంట్ పదవులను చేపట్టడానికి అర్హత లేదని అప్పటి కలెక్టర్ రిజ్వి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే.. శాతవాహన కళాశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కార్యదర్శి హోదాలో పోలీసులకు ఫిర్యాదు చేయటం కొసమెరుపు. ఒకవేళ కార్యదర్శి హోదాలో ఆలపాటి కొనసాగితే కూల్చివేతలు జరిగిన ప్రదేశానికి ఆయన ఎందుకు రాలేదన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. గతంలో శాతవాహన స్థలాన్ని సొసైటీ ముసుగులో చేజిక్కించుకునే ప్రయత్నం చేశారన్న అనేక ఆరోపణలు కూడా ఆలపాటిపై ఉన్నాయి.
వివాదాలకు ఆజ్యం ఇలా..
శాతవాహన కళాశాల ఉన్న భూమి తమకు అగ్రిమెంట్ చేశారని, రిజిసే్ట్రషన్‌కు బోయపాటి అప్పారావు ముందుకు రావట్లేదని శ్రీదుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కోర్టును ఆయ్రించింది. ఈ వివాదం ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. 2009వ సంవత్సరంలో సొసైటీ కార్యదర్శిగా, కళాశాల కరస్పాండెంట్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన వంకాయలపాటి కామేశ్వరరావు ఈ వివాదాలకు ఆజ్యం పోశారు. అప్పటి వరకు ఒకటిగా ఉన్న సొసైటీలో చీలికలు తీసుకొచ్చారు. సొసైటీ కార్యదర్శి, కళాశాల కరస్పాండెంట్‌గా ఉన్న గుండవరపు ప్రజాపతిరావు అమెరికా వెళ్తూ ఆ బాధ్యతలు తాత్కాలికంగా కామేశ్వరరావుకు అప్పగించారు. సమాచార శాఖలో ఉద్యోగిగా ఉన్న కామేశ్వరరావుకు ఊహించని పదవులు రావడంతో అత్యాశలకు పోయాడు. ప్రజాపతిరావు లేని సమయం చూసుకుని కళాశాలకు ఏమాత్రం సంబంధం లేని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గేట్లు తెరిచారు. ఆయన రంగప్రవేశం చేశాక సొసైటీలో వివాదాలు పెరిగిపోయాయి. కామేశ్వరరావును అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు వంకాయలపాటి శ్రీనివాస్ తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.