Share News

నేలరాలిన ఆశలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:18 AM

ఈదురుగాలులు, గాలివాన సృష్టిస్తున్న బీభత్సం మామిడి రైతులపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. ఈనెలలో 15 రోజుల్లో సంభవించిన ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయి తోటలు బోసిపోతున్నాయి.

నేలరాలిన ఆశలు
ఈదురు గాలులకు రెడ్డిగూడెంలో చీలిపోయిన మామిడి చెట్టు

చెట్ల నుంచి రాలిపోతున్న కాయలు

కొనేవారు లేక కాయల్ని పారబోస్తున్న రైతులు

ఈనెలలో ఇప్పటికి నాలుగుసార్లు బీభత్సం

తిరువూరు, మైలవరంలో భారీగా నష్టం

తిరువూరు/విస్సన్నపేట/గంపలగూడెం/మైలవరం రూరల్‌/రెడ్డిగూడెం/జి.కొండూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ఈదురు గాలులు మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈనెలలో 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఈదురు గాలులు సృష్టించిన బీభత్సంతో 80 శాతానికి పైగా మామిడి కాయలు నేలరాలాయి. పగలు భారీ ఎండ, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గాలులు వీస్తుండటంతో రైతులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. ఇప్పటికే మూడుసార్లు వీచిన గాలులకు 60 శాతం మామిడి కాయలు నేల రాలిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి మారోసారి గాలులు బీభత్సం సృష్టించడంతో మరో 20 శాతం కాయలు నేలరాలాయి. కోతలు కోసినట్టుగా తోటలు ఖాళీగా మారిపోయాయి.

తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో..

తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, జి.కొండూరు, మైలవరం, విజయవాడ రూరల్‌ మండలంలో మామిడి తోటల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రాంతాల్లో వరి తర్వాత రైతులు రెండో ప్రధాన పంటగా మామిడిని సాగు చేస్తారు. వరుసగా మూడేళ్ల నుంచి నష్టాలు చవిచూస్తున్న రైతుల్ని ఈ ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట చేతికొచ్చే సమయంలో కాయలన్నీ నేలరాలిపోయాయి. మైలవరం మండలం గణపవరం గ్రామంలో రాలిన మామిడి కాయలు కొనే నాథుడు లేక రోడ్ల పక్కన పడేస్తున్నారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్నాం..

ఈ ఏడాది పెట్టుబడి అధికంగా పెట్టాం. ప్రతికూల వాతావరణం వల్ల కాపు తగ్గింది. మే నెలలో రావాల్సిన గాలి, దుమ్ము ఈనెల మొదటి వారంలోనే రావడంతో కోత కోయకుండానే కాయలు రాలిపోయాయి. ఉన్న కాయలు కోసినా కోత ఖర్చులు వచ్చేలా లేవు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. - పగడాల సత్యనారాయణ, నాగులూరు

Updated Date - Apr 17 , 2025 | 01:18 AM