గ్రేటర్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:50 AM
పంచాయతీ ఎన్నికలకు ముందే మహా విజయవాడకు అడుగులు పడుతున్నాయి. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గ్రేటర్ ప్రతిపాదనను ఆమోదించాల్సిందిగా కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. మార్చిలో పంచాయతీల పదవీకాలం కూడా పూర్తి కానుండటంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 75 (వీఎంసీ ఏరియా, విజయవాడ అర్బన్ పార్ట్) గ్రామాలను గ్రేటర్‌లో విలీనానికి ప్రతిపాదించగా, వీటికి పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేనట్టేనని తెలుస్తోంది.
పంచాయతీ సమరానికి ముందే మహా విజయవాడ
గ్రేటర్ ప్రక్రియకు అంగీకరించిన సీఎం చంద్రబాబు
ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు సూచనలు
గ్రేటర్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం కేవలం 61.88 చదరపు కిలోమీటర్లు. దీనిని పది రెట్లు అంటే.. 661.79 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించేందుకు వీలుగా గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 599.91 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విజయవాడలో విలీనం చేయనున్నారు.
విలీన ప్రతిపాదిత ప్రాంతాల విస్తీర్ణం ఇలా..
కృష్ణాజిల్లాలోని గన్నవరం మండలం పరిధిలో ఉన్న 19 గ్రామాల్లో 157.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని గ్రేటర్ విజయవాడలో విలీనానికి ప్రతిపాదించారు. ఉంగుటూరు మండలంలోని రెండు మండలాల్లో 26.88 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలోని 10 గ్రామాల్లో 122.56 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు మండలంలోని 11 గ్రామాల పరిధిలో 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు మండలంలోని 64 చదరపు కిలోమీటర్లు ప్రతిపాదించారు. మొత్తంగా 436.02 చదరపు కిలోమీటర్ల మేర విలీనానికి ప్రతిపాదించారు. ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలంలో రెండు గ్రామాల్లో 23.72 చదరపు కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని 13 గ్రామాల్లో 77.66 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 62.51 చదరపు కిలోమీటర్లు కలిపి మొత్తంగా 163.89 చదరపు కిలోమీటర్లు విలీనానికి ప్రతిపాదించారు.
గ్రేటర్‌లోకి 1,42,916 కుటుంబాలు
గ్రేటర్ విజయవాడ పరిధిలోకి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 1,42,916 కుటుంబాలను తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో 2,79,556 కుటుంబాలు ఉన్నాయి. విలీనం అనంతరం గ్రేటర్ పరిధిలో 4,22,472 కుటుంబాలు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడలో 10,34,358 మంది నివసిస్తుండగా, విలీన గ్రామాల్లో 5,54,370 మంది ఉన్నారు. మొత్తం కలిపి 15,88,728 మంది జనాభా కానున్నారు. వీరిలో 7,99,604 మంది పురుషులు, 7,89,124 మంది మహిళలు. ప్రస్తుత జనాభా ప్రకారం చూస్తే.. గ్రేటర్ విజయవాడ జనాభా 20 లక్షలు దాటిపోతుంది.
పాత, కొత్త ప్రతిపాదిత గ్రామాలివే..
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో మొత్తం 23 గ్రామాలను గ్రేటర్‌లో ప్రతిపాదించారు. వీటిలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో గతంలో ఈలప్రోలు, గూడూరుపాడు, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మల్కాపురం, తుమ్మలపాలెం గ్రామాలు ఉండగా, కొత్తగా కేతనకొండ, మూలపాడు, నవీపోతవరం, త్రిలోచనాపురం, జమీమాచవరం గ్రామాలను ప్రతిపాదించారు. జి.కొండూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలు లేవు. ఈసారి మాత్రం కడియం పోతవరం, కవులూరును ప్రతిపాదించారు.
కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 19 గ్రామాలను ప్రతిపాదించారు. కంకిపాడు మండల పరిధిలో ఈడుపుగల్లు, గోసాల, కంకిపాడు, పునాదిపాడు, ఉప్పులూరు, వేల్పూరు గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా, కొత్తగా దావులూరు, గొడవర్రు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు గ్రామాలను చేర్చారు. పెనమలూరు మండల పరిధిలోని యనమలకుదురు, గంగూరు, కానూరు, పెదపులిపాక, పెనమలూరు, పోరంకి, తాడిగడప గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా, కొత్తగా వణుకూరును చేర్చారు.
గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా 31 గ్రామాలను విలీనం చేయనున్నారు. గన్నవరం మండల పరిధిలో గతంలో అజ్జంపూడి, అల్లాపురం, బీబీ గూడెం, బుద్దవరం, చిన్న అవుటపల్లి, గన్నవరం, జక్కులనెక్కలం, కేసరపల్లి, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, వెంకట నరసింహాపురం, సావారిగూడెం గ్రామాలను ప్రతిపాదించగా, కొత్తగా బూతుమిల్లిపాడు, సూరంపల్లి, తెంపల్లి, వెదురుపావులూరు, కొండపావులూరు, వీరపనేనిగూడెం, వెంకటనరసింహాపురం (పీ) గ్రామాలను కూడా చేర్చారు. ఉంగుటూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలను ప్రతిపాదించ లేదు. కొత్తగా ఆత్కూరు, పెదఅవుటపల్లి గ్రామాలను ప్రతిపాదించారు. విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం, దొనె అత్కూరు, ఎనికేపాడు, గూడవల్లి, నిడమానూరు, నున్న (పార్ట్), పాతపాడు, ఫిర్యాది నైనవరం, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాలను ప్రతిపాదించారు.