Share News

1,198 టీచర్‌ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:01 AM

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ-2025కు సంబంధించి 1,198 టీచర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 19న ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయం నోటీసు బోర్డులో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు.

1,198 టీచర్‌ పోస్టుల భర్తీ
ఈనెల 19న అమరావతిలో డీఎస్సీ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు చేతులమీదుగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి ముస్తాబవుతున్న వేదిక

ఉమ్మడి కృష్ణాజిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల జాబితా విడుదల

1,208 పోస్టులకు గానూ 1,198 పోస్టులకు ఓకే

మిగతా 10 పోస్టులకు అనర్హత.. భర్తీ నిలిపివేత

19న పోస్టింగ్‌ ఉత్తర్వులు అందజేత

మచిలీపట్నం డీఈవో కార్యాలయంలో జాబితా ప్రదర్శన

ఎక్కడికక్కడ హెల్ప్‌డెస్కుల ఏర్పాటు : డీఈవో

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1,208 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఏప్రిల్‌ 25న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో టీచర్‌ పోస్టుల కోసం 67,470 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆగస్టు 12న మార్కులను, ఈ తరువాత ర్యాంకులను విడుదల చేశారు. సర్టిఫికెట్లను పరిశీలించాక 1,198 పోస్టులను భర్తీ చేసేందుకు తుది జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 10 టీచర్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో భర్తీని నిలిపివేశారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన జాబితాను సోమవారం డీఈవో కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచారు. దీంతోపాటు డీఎస్సీ-2025 వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉన్నాయి.

సబ్జెక్టులవారీగా పోస్టుల వివరాలు

జిల్లా పరిషత, మండల పరిషత, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో భర్తీకానున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) తెలుగు సబ్జెక్టులో 29 పోస్టులకు 29 మంది ఎంపిక య్యారు. ఎస్‌ఏ ఉర్దూ విభాగంలో 4 పోస్టులకు మూడింటికే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక పోస్టుకు ఎవరూ అర్హత సాధించకపోవడంతో భర్తీ నిలిపివేశారు. ఎస్‌ఏ సంస్కృతం విభాగంలో రెండు పోస్టులకు ఒక పోస్టే భర్తీ చేశారు. మరో పోస్టుకు అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో నిలిపివేశారు. ఎస్‌ఏ హిందీ విభాగంలో 23 పోస్టులు, ఎస్‌ఏ ఇంగ్లీష్‌ విభాగంలో 88 పోస్టులు, ఎస్‌ఏ మేథమెటిక్స్‌ విభాగంలో 48 పోస్టులు, ఎస్‌ఏ ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో 53 పోస్టులు, ఎస్‌ఏ బయోలాజికల్‌ సైన్స్‌ విభాగంలో 140 పోస్టులు, ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 122 పోస్టులు ఉండగా, అన్నింటికీ అభ్యర్థులు అర్హత సాధించడంతో పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 430 ఉండగా, అన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌జీటీ ఉర్దూ విభాగంలో 26 పోస్టులు ఉండగా, 23 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మిగిలిన మూడు పోస్టులకు అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో నిలిపివేశారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో..

విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల్లో ఎస్‌ఏ తెలుగులో ఒక పోస్టు, ఎస్‌ఏ ఇంగ్లీష్‌లో 3, ఎస్‌ఏ మేథమెటిక్స్‌లో 3, ఎస్‌ఏ బయలాజికల్‌ సైన్స్‌లో 3, ఎస్‌ఏ సోషల్‌ స్టడీస్‌లో 2, ఎస్‌ఏ సోషల్‌ స్టడీస్‌ ఉర్దూ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఎస్‌జీటీ విభాగంలో 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌జీటీ ఉర్దూ విభాగంలో 10 పోస్టులు ఉండగా, ఏడుగురే అర్హత సాధించారు. మిగిలిన మూడు పోస్టులకు అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో నిలిపివేశారు.

మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎస్‌ఏ తెలుగు విభాగంలో 2, సంస్కృతం విభాగంలో 1, హిందీ విభాగంలో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. ఎస్‌ఏ ఇంగ్లీష్‌ విభాగంలో 2 పోస్టులకు ఒక్కరే అర్హత సాధించారు. దీంతో ఒక పోస్టును నిలిపివేశారు. ఎస్‌ఏ మేథమెటిక్స్‌ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఫిజికల్‌ సైన్స్‌లో 1, బయాలాజికల్‌ సైన్స్‌లో 1, సోషల్‌ స్టడీస్‌లో 2, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 1, ఎస్‌జీలో 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఈటీ విభాగంలో 3 పోస్టులకు ఇద్దరే అర్హత సాధించారు. దీంతో ఒక పోస్టు భర్తీ నిలిపివేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల ఖాళీలను బట్టి సంబంధిత పాఠశాలల్లో రానున్న రోజుల్లో కొత్తగా ఎంపికైన టీచర్లకు పోస్టింగ్‌లు ఇవ్వడం జరుగుతుందని డీఈవో పీవీజే రామారావు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం డీఈవో కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం ఎంఈవో ఎంవీఎస్‌డీ ప్రసాద్‌ సెల్‌ నెంబరు 94415 20389, అవనిగడ్డ ఎంఈవో ఎన్‌.శివశంకర్‌ సెల్‌ నెంబరు 92473 67099, తోట్లవల్లూరు ఎంఈవో బి.సురేష్‌ సెల్‌ సెంబరు 94908 79139తో హెల్ప్‌డెస్క్‌లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:01 AM