తల్లిని సంరక్షించుకుందాం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:53 AM
ప్రసవ సమయంలో ఏ ప్రమాదం జరగకుండా ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపు
భారతీనగర్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ప్రసవ సమయంలో ఏ ప్రమాదం జరగకుండా ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నాలుగో డివిజన్‌లోని ఏఐసీసీ కాలనీలోని పట్టణ ఆరోగ్యకేంద్రం వద్ద జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ఆధ్వర్యంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీని శుక్రవారం వారు ప్రారంభించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి గురునానక్ రోడ్డు వరకునర్సింగ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. వివాహం అనంతరం కాబోయే తల్లులకు సాధారణ డెలివరీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారని కలెక్టర్ అన్నారు. గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర కాలంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ విధానాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్.శోభ, సీడీపీవో ఎం.మంగమ్మ, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉషారాణి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ మోతిబాబు, డాక్టర్ నవీన్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రావణి, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.