వ్యవసాయాన్ని లాభసాటిగా మారుద్దాం
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:41 AM
కంచికచర్ల రైతుసేవా కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి కలెక్టర్ జి.లక్ష్మీశ అందించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి..సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు కలెక్టర్ లక్ష్మీశ పిలుపు
కంచికచర్ల రూరల్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సాగు ఖర్చులు తగ్గించుకోండి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మారుద్దాం.’ అని రైతులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. కంచికచర్ల రైతుసేవా కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన అందించారు. జిల్లాలో 867 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు రూ.1.67 కోట్ల చెక్కులను అందించారు. వైవిధ్య పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యవసాయాధికారిణి ఎం.విజయకుమారి, కోగంటి బాబు, తహసీల్దార్ మానస, ఎంపీడీవో లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
రైతు ప్రభుత్వమిది: తంగిరాల సౌమ్య
‘వ్యవసాయ యాంత్రీకరణకు సబ్సిడీపై పరికరాలు అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మరో మారు రుజువైంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించలేదన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈనెల చివరికి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. అని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు.