యోగాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
ABN , Publish Date - May 24 , 2025 | 01:14 AM
యోగాంధ్ర మాసోత్సవాలను ఈనెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్ర కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలుపుదామని ప్రజలకు కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపు
కలెక్టరేట్, మే 23(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర మాసోత్సవాలను ఈనెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్ర కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలుపుదామని ప్రజలకు కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలు లో అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఏడుగురు అందుబాటులో ఉంటారని, ట్రైనర్ ఒక సెషన్‌కు 50 మందితో యోగాభ్యాసనం చేయిస్తారని తెలిపారు.
థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు
ఈనెల 24న ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులతో కార్యక్రమం, 25న జేఏసీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, 26న పోలీసు-హోంగార్డ్స్, 27న వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, 28న ఆటో, లారీ డ్రైవర్లు, 29న క్రీడాకారులు, 30న కళాకారులు, 31న రైతులు, జూన్ 1న విద్యార్థులు, 2న పారిశుధ్య కార్మికులు, 3న కార్మికులు, 4న మాజీ సైనికులు, 5న విభిన్న ప్రతిభావంతులు, 6న న్యాయవాదులు, 7న స్వయం సహాయక సంఘాల సభ్యులు, 8న నర్సింగ్ సిబ్బంది, 9న ఉపాధ్యాయులు, 10న ఉపాధి హామీ శ్రామికులు, 11న అంగన్‌వాడీ, హెల్త్ వర్కర్లు, 12న వైద్యులు, 13న మహిళా పారిశ్రామికవేత్తలు, 14న ఆటో టెక్నీషియన్లు, 15న మత్స్యకారులు, 16న కాలేజీ విద్యార్థులు, 17న సీనియర్ సిటిజన్స్, స్వాతంత్య్ర సమరయోధులు, 18న దేవాలయ ఉద్యోగులు, 19న ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు, 20న సెలబ్రిటీలతో థీమ్ ఆధారిత 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్‌తో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డుతో పాటు గ్రా మ, మండల, డివిజన్, మున్సిపల్, జిల్లాస్థాయిలో రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గాంధీహిల్, భవానీద్వీపం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, కొండపల్లి ఖిల్లా ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని గ్రామ, వార్డుస్థాయిలో యోగా ఫర్ ఆల్, మండల స్థాయిలో యునిటీ త్రో యోగా, జిల్లాస్థాయిలో యోగా అండ్ యూత్ ఇతివృత్తాలతో పోటీలు నిర్వహిస్తామని, జిల్లా విజేతలు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని, విజేతలకు అవార్డులు అందజేస్తామని తెలిపారు. జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ జె.సుమన్ పాల్గొన్నారు.