శ్రీవారి స్థలం కబ్జా
ABN , Publish Date - May 06 , 2025 | 01:00 AM
శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన లక్షల రూపాయల విలువచేసే ఖాళీస్థలాన్ని ఓ వ్యక్తి దర్జాగా కబ్జా చేశాడు. అంతేకాదు.. ఏకంగా పక్కా భవనాన్ని కూడా నిర్మించేస్తున్నాడు. ఖాళీగా ఉన్న ఈ స్థలానికి గతంలో వేలంపాట నిర్వహించగా, ఉచితంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ వేలాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ ఖాళీస్థలం నిరుపయోగంగా మారింది. వివరాల్లోకి వెళితే..
యనమలకుదురు కట్ట దిగువన భూ ఆక్రమణ
ఇప్పటికే అక్రమంగా రేకుల షెడ్ల నిర్మాణం
తాజాగా ఓ ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో 100 గజాలు
నానాటికీ కుచించుకుపోతున్న దేవస్థాన స్థలం
చోద్యం చూస్తున్న వన్‌టౌన్ వేంకటేశ్వరస్వామి ఆలయ అధికారులు
వన్‌టౌన్/పెనమలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన లక్షల రూపాయల విలువచేసే ఖాళీస్థలాన్ని ఓ వ్యక్తి దర్జాగా కబ్జా చేశాడు. అంతేకాదు.. ఏకంగా పక్కా భవనాన్ని కూడా నిర్మించేస్తున్నాడు. ఖాళీగా ఉన్న ఈ స్థలానికి గతంలో వేలంపాట నిర్వహించగా, ఉచితంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ వేలాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఆ ఖాళీస్థలం నిరుపయోగంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో పక్కా నిర్మాణం
వన్‌టౌన్ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి పోరంకిలో ఎకరం పొలం, గూడవల్లిలో ఎకరం పొలం, వేల్పూరులో 9 ఎకరాలు, వేమండలో 9 ఎకరాలకు పైగా భూములున్నాయి. గవర్నర్‌పేటలో సుమారు పది షాపుల భవన సముదాయం ఉంది. యనమలకుదురు కట్ట దిగువన సుమారు ఏ.2.14 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. అందులో సుమారు 85 సెంట్లను గతంలో కొందరు కబ్జాచేసి, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. దేవదాయ శాఖ అధికారులు రేకుల షెడ్లను తొలగించటానికి ప్రయత్నించగా, రాజకీయ నాయకులు అడ్డుకుని ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారు. ఇంకా ఏ.1.29 సెంట్లు ఖాళీగా ఉంది. ఈ స్థలంలో 2014 నుంచి 2019 వరకు నాటి వేంకటేశ్వరస్వామి దేవస్థాన అధికారులు, గుమస్తాల పర్యవేక్షణ కొరవడటంతో 11 మంది రేకుల షెడ్లు నిర్మించారు. అందులో దేవస్థానం అధికారులు 6, 7 ఇళ్లపై కోర్టులో కేసు వేశారు. మిగిలిన వాటి గురించి పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుతం స్థానికంగా ఉంటున్న ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రూ.70 లక్షలకు పైగా విలువచేసే 100 గజాలకు పైగా స్థలాన్ని దర్జాగా కబ్జాచేసి పక్కా నిర్మాణం చేపడుతున్నాడు. దేవస్థానం అధికారులు, ఉద్యోగులు ఆ ఖాళీస్థలంవైపు కన్నెత్తి చూడకపోవటంతో కబ్జాదారులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయ భూమిని కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ స్థలం కబ్జాకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టి దేవస్థానానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నిర్మాణ పనులు అడ్డుకున్నాం
యనమలకుదురు కట్ట దిగువన దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణ పనులు చేపడుతున్నాడని సమాచారం తెలుసుకున్నాం. అక్కడకు వెళ్లి పనులు అడ్డుకున్నాం. నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఆక్రమించుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. - సన్యాసిరావు, వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో