తగ్గిన ఉధృతి
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:55 AM
వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీరు సాధారణ స్థాయికి చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో వర్షాలు సాధారణంగా ఉండొచ్చని వాతావరణ శాఖ ఫోర్‌కాస్ట్ విడుదల చేసింది.
క్రమంగా తగ్గుతున్న కృష్ణానది వరద
పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి సాధారణంగానే ఇన్‌ఫ్లో
నేటికి మరింత తగ్గే అవకాశం
వర్షపాతంపై ఆరెంజ్ అలెర్ట్ రద్దు
విజయవాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీరు సాధారణ స్థాయికి చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో వర్షాలు సాధారణంగా ఉండొచ్చని వాతావరణ శాఖ ఫోర్‌కాస్ట్ విడుదల చేసింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 1,54,081 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి 1,67,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి 2,28,665 క్యూసెక్కుల నీరు వస్తోంది. 55 గేట్లను ఏడు అడుగులు, 15 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి 2,79,875 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాల్వలకు 3,523 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక వర్షపాతం విషయంలో వాతావరణ శాఖ ఇచ్చిన ఆరెంజ్ అలెర్ట్‌ను రద్దు చేసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. గురువారం రెండు కాల్వలకు 606 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన బ్యారేజీ అధికారులు ఆ పరిమాణాన్ని శుక్రవారం పెంచారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలు. ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 40.81 టీఎంసీలు ఉంది. మరోపక్క మునేరు, బుడమేరుకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. శనివారం నాటికి ఈ ఇన్‌ఫ్లోలు మరింతగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.