కళలకు పుట్టినిల్లు కృష్ణాజిల్లా
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:55 AM
అనేక కళల పుట్టినిల్లు అయిన భారతదేశం ఒక గొప్ప కళాఖండమని, దేశ నలుమూలలకు భారతఖ్యాతిని ఇనుమడింపజేసిన అనేక మంది కళాకారులకు జన్మస్థలమని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి ఎగ్జిబిషన్)ను శనివారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
విజయవాడలో ఉత్సవాలు ఎంతో ఆనందదాయకం
గొల్లపూడి ఎగ్జిబిషన్ ప్రారంభ సభలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఇబ్రహీంపట్నం/గొల్లపూడి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అనేక కళల పుట్టినిల్లు అయిన భారతదేశం ఒక గొప్ప కళాఖండమని, దేశ నలుమూలలకు భారతఖ్యాతిని ఇనుమడింపజేసిన అనేక మంది కళాకారులకు జన్మస్థలమని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి ఎగ్జిబిషన్)ను శనివారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను పునరుద్ధరించడానికి, వాటి ఔన్నత్యాన్ని నేటితరానికి తెలియజేయడానికి విజయవాడ ఉత్సవ్ గొప్ప వేదికైందన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా కళలకు పుట్టినిల్లు అన్నారు. సినిమాలకు కేంద్రమైన విజయవాడలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు రోజుకు 24 గంటల పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కేన్సర్ చిక్సితను తక్కువ ధరకు అందించేందుకు తుళ్లూరులో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సినీ, రాజకీయ, సేవారంగాల్లో బాలకృష్ణ విశేష సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 50 ఏళ్లుగా హీరోగా నటిస్తూ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గర్వకారణమన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్‌లో గొల్లపూడిని భాగస్వామ్యం చేయడం ఆనందదాయకమన్నారు. 70 ఏళ్ల నుంచి ఇక్కడి భూమిని కౌలు చేసుకుంటున్న రైతులు.. అడిగిన వెంటనే 10 నిమిషాల్లో స్థలం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. గ్రేటర్ విజయవాడలో భాగంగా వచ్చే దసరా ఉత్సవాల నాటికి కొండపల్లి వరకు విజయవాడలో కలుస్తుందన్నారు. అమ్మవారి సన్నిధిలోకి గొల్లపూడే కాకుండా మైలవరం నియోజకవర్గం కూడా వస్తుందని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే విజయవాడ ఓ మంచి నగరం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ కృషితో విజయవాడ ఉత్సవాలు రానున్న రోజుల్లో మరింత వన్నె తెస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, శ్రీరామ్ రాజగోపాల్, కూటమి నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీతారామయ్య, నర్రా వాసు, నూతలపాటి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.